News


అదుపు తప్పిన రిటైల్‌ ధరలు

Thursday 14th November 2019
news_main1573701240.png-29565

  • అక్టోబర్‌లో 4.62 శాతం పెరుగుదల
  • 4 శాతం దాటకూడదని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశం
  • ఇదే ధోరణి కొనసాగితే మరో దఫా రేటు కోత అసాధ్యం!

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2019 అక్టోబర్‌లో అదుపు తప్పింది. 4.62 శాతంగా నమోదయ్యింది. అంటే వినియోగ వస్తువుల బాస్కెట్‌ ధర 2018 అక్టోబర్‌తో పోల్చిచూస్తే, 2019 అక్టోబర్‌లో 4.62 శాతం పెరిగిందన్నమాట. గడిచిన 16 నెలల కాలంలో (జూన్‌ 2018లో 4.92 శాతం) ఇంత తీవ్ర స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 శాతాన్ని మించకూడదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి (ఆర్‌బీఐ) కేంద్రం నుంచి నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్‌ 2’ లేదా ‘మైనస్‌ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. అంటే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎగువదిశలో 4 శాతం దాటకూడదన్నమాట. బుధవారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ప్రధానమైనవి చూస్తే...
ఐదు ప్రధాన విభాగాలూ ఇలా...

  • ఆహారం-పానీయాలు: సెప్టెంబర్‌లో 5.11 శాతంగా ఉన్న ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ ధరల స్పీడ్‌ అక్టోబర్‌లో 7.89 శాతానికి పెరిగింది. ఒక్క కూరగాయల ధరలు ఇదే కాలంలో 5.40 శాతం నుంచి 26.10 శాతానికి ఎగశాయి. పండ్ల ధరలు 0.83 శాతం నుంచి 4.08 శాతానికి పెరిగాయి. తృణధాన్యాల ధరలు 2.16 శాతం, మాంసం, చేపల ధరలు 9.75 శాతం, గుడ్ల ధరలు 6.26 శాతం పెరిగాయి. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 11.72 శాతం ఎగశాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 3.10 శాతం ఎగశాయి. ఆల్కాహాలేతర పానీయాల ద్రవ్యోల్బణం రేటు 2.58 శాతం ఎగసింది. ప్రెపేర్డ్‌ మీల్స్‌ (స్నాక్స్‌, స్వీట్స్‌ వంటివి) ధరల రేటు 2.21 శాతం పెరిగింది.
  • పాన్‌, పొగాకు ఇతర మత్తు ప్రేరిత ఉత్పత్తులు: ధరల పెరగుదల రేటు 3.92 శాతంగా నమోదయ్యింది.
  • దుస్తులు, పాదరక్షలు: ద్రవ్యోల్బణం రేటు 1.65 శాతంగా ఉంది. 
  • హౌసింగ్‌: ఈ విభాగంలో ధరల స్పీడ్‌ 4.58 శాతంగా నమోదయ్యింది. 
  • ఇంధనం, లైట్‌: ఈ  విభాగంలో మాత్రం ధరల రేటు -2.02 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. సెప్టెంబర్‌లో ఈ రేటు -2.18 శాతం క్షీణతలో ఉంది. 

రెపోరేటు కోత ఇక లేనట్లే!
అక్టోబర్‌లో ఈ రేటు అదుపు తప్పిన నేపథ్యంలో మరో దఫా ఆర్‌బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు (ప్రస్తుతం 5.15 శాతం)‍ తగ్గింపునకు అవకాశాలు తక్కువేనన్నది నిపుణుల అభిప్రాయం. అలా చేస్తే, వ్యవస్థలో లిక్విడిటీ  (ద్రవ్య లభ్యత) మరింత పెరుగుతుందని, దీనితో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందనీ, ఇది నిరుపేదల కొనుగోళ్లపై పెను భారం చూపుతుందన్నది ఆర్థిక సిద్ధాంతం. క్రూడ్‌ ధరల పెరుగుదల అవకాశాలనూ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో,  అక్టోబర్‌ 4 నాటికి అంతక్రితం వరుస ఐదు ఆర్‌బీఐ ద్వైమాసిక సమావేశాల్లో 135 బేసిస్‌ పాయింట్లు (1.35 శాతం) రెపో రేటు తగ్గి 5.15 శాతానికి దిగివచ్చింది.You may be interested

మూడు నెలల్లో బాకీలు కట్టేయాల్సిందే

Thursday 14th November 2019

 టెల్కోలకు టెలికం శాఖ నోటీసులు న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మూడు నెలల్లోగా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తదితర బాకీలన్నీ కట్టేయాలంటూ టెల్కోలకు టెలికం శాఖ (డాట్‌) ఆదేశాలు జారీ చేసింది. స్వయం మదింపు ప్రాతిపదికన బకాయీలను తీర్చవచ్చంటూ నోటీసుల్లో పేర్కొన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లైసెన్సు ఫీజు మొదలైన వాటికి ప్రాతిపదిక అయిన ఏజీఆర్‌ను (సవరించిన స్థూల ఆదాయం) లెక్కించే ఫార్ములా విషయంలో.. ప్రభుత్వానికి

ఈ స్టాక్స్‌ ‘వ్యాల్యూ బై’

Wednesday 13th November 2019

వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ విధానంలో స్టాక్స్‌ను చౌకగా ఉన్నప్పుడే సొంతం చేసుకోవాలి. అంటే చౌకగా ఉన్నప్పుడు కొనుగోలు చేయడం, మంచి విలువ వచ్చే వరకు వేచి చూడడాన్ని వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌గా చెబుతారు. బీఎస్‌ఈ లిస్టెడ్‌ స్టాక్స్‌ డేటాను గమనిస్తే.. 45 స్టాక్స్‌ పోటీ కంపెనీలతో పోలిస్తే చౌకగా కనిపిస్తూ, వృద్ధి దిశగా సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. వీటిల్లో లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఇవి...   రెఫెక్స్‌

Most from this category