STOCKS

News


ఆర్థిక రంగాన్ని సరిదిద్దుతాం..!

Saturday 24th August 2019
news_main1566621472.png-27979

  • ఆటో సహా పలు రంగాలకు ప్రోత్సాహకాలు
  • దేశ, విదేశీ ఇన్వెస్టర్లపై సర్‌చార్జీ పెంపు ఉపసంహరణ
  • హెచ్‌ఎఫ్‌సీలకు అదనంగా రూ.20,000 కోట్లు
  • ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు
  • చౌకగా హౌసింగ్‌, ఆటో, రిటైల్‌ రుణాలు
  • ఎంఎస్‌ఎంఈలకు 30 రోజుల్లోనే జీఎస్టీ రిఫండ్‌లు
  • కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటన 

న్యూఢిల్లీ:- మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. రియల్‌ ఎస్టేట్‌, ఆటోమొబైల్‌, ఎంఎస్‌ఎంఈ, ప్రభత్వరంగ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ/హెచ్‌ఎఫ్‌సీ ఇలా ఎన్నో రంగాలను లక్ష్యంగా చేసుకుని ఇవి ఉన్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను సర్‌చార్జీని భారీగా పెంచుతూ గత బడ్జెట్‌లో చేసిన ప్రకటన దేశ స్టాక్‌ మార్కెట్లను తీవ్రంగా నష్టపరిచింది. దీంతో సర్‌చార్జీ పెంపును తొలగించాలన్న ఎఫ్‌పీఐల డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గింది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను సర్‌చార్జీ అదనపు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. పరిశ్రమలకు చౌకగా మూలధన నిధుల రుణాలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల(హెచ్‌ఎఫ్‌సీ)కు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) నుంచి అదనంగా రూ.20,000 కోట్ల నిధుల మద్దతు (మొత్తం రూ.30,000 కోట్లు అవుతుంది), సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు నిధుల కొరత సమస్య తీర్చేందుకు గాను వారికి జీఎస్టీ రిఫండ్‌లను 30 రోజుల్లోనే చేసేయడం, ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవవత్సరంలో రూ.70,000 కోట్ల మూలధన నిధుల సాయం, ఇన్‌ఫ్రా, హౌసింగ్‌ ప్రాజెక్టులకు రుణాల లభ్యత పెంచేందుకు ఓ సం‍స్థను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు సవరణను 2020 జూన్‌ వరకు వాయిదా వేయడం, రిజిస్టర్డ్‌ స్టార్టప్‌లపై ఏంజెల్‌ట్యాక్స్‌ రద్దు, సహా ఎన్నో నిర్ణయాలు మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన వాటిల్లో ఉన్నాయి. 

ఇన్వెస్టర్లపై అధిక ఆదాయ సర్‌చార్జీ ఉండదు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం మన్నించింది. రూ.2-5 కోట్ల మధ్య ఆదాయంపై సర్‌చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్ల పైన ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జీని 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతున్నట్టు బడ్జెట్‌ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీనికి అదనంగా ఆర్థిక రంగ పునరుత్తేజానికి ఎటువంటి చర్యల్లేకపోవడంతో... నాటి నుంచి ఎఫ్‌పీఐలు మన మార్కెట్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.25,000 కోట్ల వరకు నిధులను వెనక్కి తీసుకున్నారు. సర్‌చార్జీ పెంపును ఉపసంహరించుకోవాలని వారు గట్టిగా కేంద్రాన్ని డిమాండ్‌ కూడా చేశారు. ‘‘క్యాపిటల్‌ మార్కెట్లో పెట్టుబడులను ‍ప్రోత్సహించేందుకు ఫైనాన్స్‌ యాక్ట్‌ 2019 ద్వారా స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై విధించిన సర్‌చార్జీ పెంపును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది’’ అని మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల మేర ఆశించిన ఆదాయం రాకుండా పోతుంది. సర్‌చార్జీ ఉపసంహరణ దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అందరికీ వర్తిస్తుంది. 
స్టార్టప్‌లకు ఊరట...
రిజిస్టర్డ్‌ స్టార్టప్‌లకు ఏంజెల్‌ ట్యాక్స్‌ నుంచి ఉపశమనం కల్పించడం ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. ‘‘స్టార్టప్‌లు, వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసే వారు ఎదుర్కొంటున్న నిజమైన ఇబ్బందులను తొలగించేందుకు గాను, డీపీఐఐటీ వద్ద నమోదైన స్టార్టప్‌లకు ఆదాయపన్న చట్టంలోని 56(2)(7బీ)ను అమలు చేయరాదని నిర్ణయించడం జరిగింది’’ అని మంత్రి వెల్లడించారు. ఆదాయపన్ను సర్‌చార్జీ పెంపు, ఏంజెల్‌ ట్యా‍క్స్‌ రద్దును నిపుణులు స్వాగతించారు. క్యాపిటల్‌ మార్కెట్లకు ఇవి జోష్‌నిస్తాయని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ రాజేష్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. 


రుణాలు ఇక చౌక!
గృహ, వాహన, వినియోగ రుణాలు చౌకగా మారనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్‌బీఐ రేట్ల కోతను బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ విధానంలో రుణ గ్రహీతలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. రెపో రేటు, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమైన రుణ ఉత్పత్తులను బ్యాంకులు ప్రారంభిస్తాయని, ఫలితంగా గృహ, వాహన, ఇతర రిటైల్‌ రుణాల ఈఎంఐలు తగ్గుతాయని పేర్కొన్నారు. అలాగే, వ్యవస్థలో రుణ వితరణను పెంచేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వం రూ.70,000 కోట్లను మూలధన సాయంగా అందించనున్నట్టు చెప్పారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలో రూ.5 లక్షల కోట్ల వరకు అదనపు లిక్విడిటీ, రుణ వితరణ సాధ్యపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇక రుణాల వితరణ ప్రక్రియను మరింత సులభంగా మార్చేందేకు పీఎంఎల్‌ఏ, ఆధార్‌ నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేయనుంది. రుణాలను తీర్చేసిన 15 రోజుల్లోపు వాటి డాక్యుమెంట్లను రుణ గ్రహీతలకు ప్రభుత్వరంగ బ్యాంకులు తిరిగి ఇచ్చేయడం ఇకపై తప్పనిసరి. దీనివల్ల కస్టమర్లు బ్యాంకుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పిపోతాయి. 
ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల మద్దతు 
హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (హెచ్‌ఎఫ్‌సీలు) అదనంగా రూ.20,000 కోట్ల నిధులను ఎన్‌హెచ్‌బీ ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌ఎఫ్‌సీలకు లోగడ ఎన్‌హెచ్‌బీ ప్రకటించిన రూ.10,000 కోట్లకు ఇది అదనపు సాయం. దీనివల్ల హౌసింగ్‌ రంగానికి నిధుల వితరణ పెరగనుంది. ఆధార్‌ ఆధారిత కేవైసీని వినియోగించేందుకు ఎన్‌బీఎఫ్‌సీలను అనుమతించనున్నట్టు మంత్రి తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఆస్తులను బ్యాంకులు కొనుగోలు చేసేందుకు పాక్షిక క్రెడిట్‌ స్కీమ్‌ను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించగా, ప్రతీ బ్యాంకు స్థాయిలో దీనిపై అత్యున్నత స్థాయిలో సమీక్ష చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

భారతీయ కంపెనీలను కాపాడాలి
కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంపిటిషన్‌ కమీషన్‌ సన్నద్ధం కావాలని మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. మారిన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో విదేశీ సంస్థల నుంచి పోటీ పరంగా భారత కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్‌ శాఖ వ్యవహరాలనూ కూడా మంత్రి నిర్మలా సీతారామనే చూస్తున్నారు. సీసీఐ పదో వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ... పోటీ పరంగా దేశీయ మార్కెట్‌పై అంతర్జాతీయ సంస్థల ప్రభావాన్ని తెలుసుకునేందుకు సీసీఐ స్వచ్చందంగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. భారతీయ వినియోగదారులను, భారత కంపెనీలను పరిరక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. You may be interested

ఐపీఓ రూట్లో స్టార్టప్‌లు!

Saturday 24th August 2019

రూ.1,000 కోట్లు సమీకరించనున్న 200 స్టార్టప్‌లు ఐపీవోకి వస్తున్న తొలి స్టార్టప్‌ ‘ఆల్ఫాలాజిక్‌ టెక్‌సైస్‌’ ఇష్యూ ఈ నెలాఖరున ప్రారంభం; రూ.5 కోట్ల సమీకరణ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ స్టార్టప్స్‌ ఐపీవో బాట పట్టాయి. బెంగళూరు, పుణె, ముంబై, హైదరాబాద్‌ తదితర నగరాలకు చెందిన 200కు పైగా స్టార్టప్‌లు ప్రస్తుతం ఐపీఓకి ముస్తాబయ్యాయి. దాదాపు రూ.1,000 కోట్ల నిధుల సమీకరించాలన్నది వీటి లక్ష్యం. వీటిలో భాగంగా అన్ని అనుమతులతో ఈ నెలాఖరులో పుణెకు

‘2002-03 తరహా సంక్షోభం కాదు..’

Saturday 24th August 2019

ఆర్థిక రంగంలో ప్రస్తుతం నెలకొన్న బలహీనత 2002-03 నాటి సంక్షోభం మాదిరి కాదన్నారు క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌ పరిశోధన విభాగం హెడ్‌ గౌరవ్‌గార్గ్‌. ప్రస్తుత ఆర్థిక వాతావరణాన్ని బేర్‌ మార్కెట్‌తో పోల్చరాదని అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఆరోగ్యకమైర దిద్దుబాటుకు గురయ్యాయని, ఇకపై అప్‌సైడ్‌ ఉంటుందని పేర్కొన్నారు.    ‘‘సూచీలు గరిష్టాల నుంచి 10 శాతం మేర కరెక్షన్‌కు గురయ్యాయి. కనుక ఇన్వెస్టర్లు తాము ఇన్వె‍స్ట్‌ చేయదలిచిన మొత్తంలో 60 శాతాన్ని నాణ్యమైన స్టాక్స్‌లో

Most from this category