News


పుంజుకున్న తయారీ రంగం.

Tuesday 4th June 2019
news_main1559628284.png-26084

  • కొత్త ఆర్డర్లతో డిమాండ్‌ మెరుగు
  • మే లో 52.7కు నికాయ్‌ ఇండియా పీఎంఐ

న్యూఢిల్లీ: డిమాండ్ మెరుగుపడుతున్న దాఖలాలతో కంపెనీలు ఉత్పత్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా తయారీ రంగం గత నెల మళ్లీ కాస్త పుంజుకుంది. ఏప్రిల్‌లో 51.8 పాయింట్లుగా ఉన్న నికాయ్ ఇండియా తయారీ రంగ సూచీ (పీఎంఐ) మే నెలలో 52.7 పాయింట్లకు పెరగడం ఇందుకు నిదర్శనం. పీఎంఐ 50 పాయింట్ల పైన కొనసాగడం ఇది వరుసగా 22వ నెల కావడం గమనార్హం. పీఎంఐ 50కి పైన ఉంటే వృద్ధిని, అంతకన్నా దిగువన ఉంటే మందగమనాన్ని సూచిస్తుంది. "కొత్త ఆర్డర్ల రావడం మొదలు కావడంతో, డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి చేయడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాయి. దీంతో తయారీ రంగంలో ఉత్పత్తి కూడా వేగంగా పెరిగింది" అని పీఎంఐ సూచీ నిర్వహించే ఐహెచ్‌ఎస్ మార్కిట్ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త, నివేదిక రూపకర్త పోల్యానా డి లిమా పేర్కొన్నారు. కొత్త ఆర్డర్లు వస్తుండటం, ఉత్పత్తి పెంపుపై కంపెనీలు ఆశావహంగా ఉండటం వంటి అంశాలతో తయారీ రంగంలో మరింత మందికి ఉపాధి కల్పన జరిగినట్లు వివరించారు. గతేడాది ఏప్రిల్ నుంచి తయారీ రంగంలో ప్రతి నెలా ఉపాధి కల్పన పెరుగుతోందని, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే మేలో అత్యధికంగా జరిగిందని లిమా పేర్కొన్నారు.
ధీమాగా కంపెనీలు...
ఏప్రిల్ నుంచి సెంటిమెంటు మెరుగుపడుతుండటంతో రాబోయే రోజుల్లోనూ ఉత్పత్తి పెంపుపై దేశీ తయారీ కంపెనీలు ధీమాగా ఉన్నాయి. వ్యాపారాలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు, మార్కెటింగ్‌ వ్యూహాలు, పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు, సానుకూల ఆర్థిక పరిస్థితులు మొదలైన అంశాలు ఈ ఆశావహ దృక్పధానికి కారణమని నివేదికలో వెల్లడైంది. ద్రవ్యోల్బణ కోణంలో చూస్తే ధరలపరమైన ఒత్తిళ్లు పెద్దగా పెరగలేదని, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల స్వల్పంగానే ఉండటం వల్ల కంపెనీలు రేట్లను పెద్దగా మార్చలేదని లిమా తెలిపారు. గత రెండేళ్ల సరళిని బట్టి చూస్తే మే లో ఉత్పత్తి, కొత్త ఆర్డర్లు, ఎగుమతులు అన్నీ కూడా మెరుగ్గానే ఉన్నాయని ఆమె వివరించారు. 



You may be interested

యాక్సిస్‌ బ్యాంక్‌ నిర్ణయానికి ఆర్‌బీఐ ఆమోదం

Tuesday 4th June 2019

న్యూఢిల్లీ: యాక్సిస్‌ బ్యాంక్‌ స్వతంత్ర డైరెక్టర్‌ ‘రాకేష్ మఖీజా’ను మూడేళ్ల వ్యవధితో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ (పార్ట్‌-టైం) ఛైర్మన్‌గా నియమించేందుకు ఆర్‌బీఐ ఆమోదముద్రవేసింది. ఈయన నియామకానికి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే కాగా, ఆర్‌బీఐ ఆమోదంతో నియామకం ఖారారైంది. ఈనెల 18 నుంచి 2022 జూలై 17 వరకు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో సోమవారం బ్యాంక్‌ ప్రకటించింది.

ఏడాదిలో రూ.71వేల కోట్ల మాయం!

Tuesday 4th June 2019

2018-19లో బ్యాంకులకు భారీ టోపీలు మోసాలకు సంబంధించి 6,800 కేసులు రిజర్వ్ బ్యాంక్‌ వెల్లడి న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం బ్యాంకు మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో 6,801 కేసులు నమోదు కాగా.. విలువపరంగా ఇవి రూ. 71,500 కోట్లు ఉండొచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వెల్లడించింది. 2017-18లో రూ. 41,167 కోట్లకు సంబంధించి 5,916 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలిస్తే 2018-19లో పరిమాణం ఏకంగా 73

Most from this category