STOCKS

News


ఎన్‌బీఎఫ్‌సీలకు కష్టకాలం..

Thursday 15th August 2019
news_main1565851626.png-27778

  • జూన్‌లో మూడేళ్ల కనిష్టానికి రుణ వృద్ధి
  • ఆటో, రియల్టీ తదితర రంగాల్లో డిమాండ్‌ తగ్గడం కారణం
  • కష్టతరంగా మారిన నిధుల సమీకరణ
  • సదరు సంస్థల ఆర్థిక ఫలితాలపై ప్రతికూల ప్రభావం

న్యూఢిల్లీ: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు చాలా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. ఇటు రుణాలకు డిమాండ్‌ తగ్గి అటు నిధుల సమీకరణ కష్టతరంగా మారడంతో జూన్‌ త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీల రుణ మంజూరు వృద్ధి రేటు గణనీయంగా క్షీణించి ఉంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి ఉండొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆటో మొబైల్, రియల్‌ ఎస్టేట్, నాన్‌–రిటైల్‌ రంగాల్లో డిమాండ్‌ మందగించడం కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలపై గణనీయంగానే ప్రతికూల ప్రభావం చూపించిందన్న అంచనాలు ఉన్నాయి.  
    జూన్‌ త్రైమాసికంలో మొత్తం మీద పరిశ్రమ రుణ వృద్ధి 15 శాతం మాత్రమే ఉండొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది. 2017 మార్చి తర్వాత ఇది కనిష్ట స్థాయి.  "అంతటా మందగమనం కనిపిస్తోంది. నిధులపరమైన కొరతే కాకుండా రుణాలు తీసుకునే విభాగాల్లో కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. ముఖ్యంగా ఆటోమొబైల్, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో మందగమనం ప్రభావం ఎన్‌బీఎఫ్‌సీ రుణ వృద్ధిపై ప్రతికూలంగా ఉండవచ్చు" అని మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థలో ఎన్‌బీఎఫ్‌సీ విశ్లేషకుడు అల్పేష్‌ మెహతా చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి వాహన దిగ్గజాల అమ్మకాలు మందగించాయి. ఈ ఏడాది మేలో దేశీ వాహనాల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఉత్పత్తిని సుమారు 18 శాతం తగ్గించుకుంది. మార్కెట్లో డిమాండ్‌ బలహీనంగా ఉండటంతో ఇలా ఉత్పత్తిలో కోత విధించుకోవడం వరుసగా ఇది నాలుగో నెల. 

కొన్నే మెరుగ్గా...
అయితే హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్స్‌ వంటి బలమైన మాతృసంస్థలున్న ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక ఫలితాలు మెరుగ్గానే ఉండొచ్చని అంచనా.  మిగతా ఎన్‌బీఎఫ్‌సీలతో పోలిస్తే వీటికి బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ మొదలైన వాటి నుంచి పుష్కలంగా నిధుల లభ్యత ఉండటమే ఇందుకు కారణమని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఏఎస్‌ ఫైనాన్షియల్, పీఎన్‌బీ హౌసింగ్‌ సంస్థల ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉండవచ్చని, మరోవైపు ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, ముత్తూట్‌ ఫైనాన్స్‌ వంటి సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయిలో ఉండొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది.

తొలి త్రైమాసికం అంతంత మాత్రమే..
సాధారణంగా తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్‌ ఫైనాన్స్‌ సంస్థల పనితీరు అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇక ఎన్నికలు ఆపై మందగమనం తదితర కారణాల వల్ల ఆ సంస్థల రుణాల పోర్ట్‌ఫోలియోల విశేషాలను త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. "ఆటో ఫైనాన్స్, హౌసింగ్‌ లోన్స్‌ ఇచ్చే సంస్థలకు సాధారణంగానే తొలి త్రైమాసికం కాస్త బలహీనంగా ఉంటుంది. ఈ ఏడాది చూస్తే ఎన్నికల ప్రభావం కూడా ఉంది. రిటైల్‌ రుణాల్లో మందగమనం, డెవలపర్లు కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉండటం వంటి అంశాలు హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు" అని కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఫలితాలతో పాటు మధ్యకాలికంగా ఆయా సంస్థల షేర్ల పనితీరుపై అసెట్‌ క్వాలిటీ ప్రభావం మరింతగా ఉండగలదని వివరించింది. 
    ఇక, సాధారణంగా గృహ రుణాల మెచ్యూరిటీ గడువు అనేక సంవత్సరాల పాటు, కొన్ని సార్లు కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీలకు ఆస్తులు, అప్పుల మధ్య సమన్వయం పాటించడం కష్టతరంగా మారుతోంది. ఈ సంస్థలు స్వల్పకాలిక రుణాలు తీసుకొచ్చుకుని.. దీర్ఘకాలిక ప్రాతిపదికన రిటైల్‌ రుణాలు ఇస్తున్నాయి. అయితే, ఇన్‌ఫ్రా రుణాల దిగ్గజం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గతేడాది సెప్టెంబర్‌లో డిఫాల్ట్‌ అయినప్పట్నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులు దొరకడమే గగనంగా మారింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ విషయమే తీసుకుంటే భారీ ప్రొవిజనింగ్‌ చేయాల్సి రావడం, రుణ వితరణ తగ్గడంతో మార్చి త్రైమాసికంలో రూ. 2,223 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. ప్రాధాన్యేతర అసెట్స్‌ అమ్మకాలు, పోర్ట్‌ఫోలియోల తనఖా తదితర మార్గాల్లో సమీకరించిన నిధులతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గత సెప్టెంబర్‌ నుంచి దాదాపు రూ. 40,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించింది.You may be interested

జేఎస్‌పీఎల్‌ నష్టాలు రూ.87 కోట్లు

Thursday 15th August 2019

గత క్యూ1 లాభం రూ.110 కోట్లు  -మొత్తం ఆదాయం రూ.9,946 కోట్లు  -10 శాతం పెరిగిన షేరు  న్యూఢిల్లీ: జిందాల్‌​ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (జేఎస్‌పీఎల్‌) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.87 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ1లో రూ.110 కోట్ల నికర లాభం ఆర్జించామని జేఎస్‌పీఎల్‌ తెలిపింది. వ్యయాలు బాగా పెరగడంతో ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది. గత క్యూ1లో రూ.9,665 కోట్లుగా ఉన్న

భారత్‌ ఇంకా వర్ధమాన దేశమేమీ కాదు..

Thursday 15th August 2019

ఇకపై అక్రమంగా ప్రయోజనాలు తీసుకోనిచ్చేది లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు వాషింగ్టన్‌: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో ఇతర దేశాలపై విరుచుకుపడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి భారత్‌, చైనాపై విమర్శలు చేశారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన 'వర్ధమాన దేశాల' హోదా ముసుగులో భారత్‌, చైనా అక్రమంగా ప్రయోజనాలు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇకపై ఇలాంటివి సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. భారత్‌, చైనాలు ఆసియాలో ప్రస్తుతం ఆర్థిక దిగ్గజాలుగా ఎదిగాయని..

Most from this category