News


మరోసారి ఆర్‌బీఐ రేట్ల కోత!

Monday 5th August 2019
news_main1564991583.png-27545

- ఈ నెల 7న పాలసీ సమీక్ష నిర్ణయం...
- కీలక వడ్డీరేట్లలో పావు శాతం తగ్గింపునకు అవకాశం...
- బ్యాంకర్లు, నిపుణుల అంచనా...

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్ల కోతకు సై అంటుందా? కీలక గణాంకాలన్నీ మందగమనాన్ని స్పష్టంగా చూపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించేందుకు వరుసగా నాలుగోసారి కీలక పాలసీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశం ఈ నెల 5 నుంచి 7 వరకూ జరగనుంది. 7న(బుధవారం) సమీక్ష నిర్ణయం వెలువడుతుంది. అంతేకాకుండా వ్యవస్థలో ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) పెంచేందుకు, తగ్గించిన పాలసీ రేట్ల ప్రయోజనాన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు బదలాయించేలా ఆర్‌బీఐ తగిన చర్యలను ప్రకటించవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో పావు శాతం తగ్గొచ్చు...
ఈసారి పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ మరో పావు శాతం రెపోరేటు (బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు)ను తగ్గించవచ్చని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ, ఎండీ రాజ్‌కిరణ్‌ రాయ్‌ పేర్కొన్నారు. ‘ప్రస్తుత తరుణంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చర్యలు చాలా అవసరం. ఆర్‌బీఐ తన వంతుగా రేట్లను తగ్గించే అవకాశం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్‌లో జరిగిన పాలసీ సమీక్షలో వరుసగా మూడోసారి రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించిన సంగతి తెలిసిందే. వృద్ధికి ఊతమిచ్చేందుకు అవసరమైతే మరిన్ని వడ్డీరేట్ల కోతలకు సిద్ధమేనంటూ సంకేతాలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 5.75 శాతంగా ఉంది. రివర్స్‌ రెపో(ఆర్‌బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీ రేటు) 5.5 శాతం వద్ద ఉంది. ఇక నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌- బ్యాంకులు తమ డిపాజిట్‌ నిధుల్లో తప్పనిసరిగా బ్యాంకుల మద్ద ఉంచాల్సిన నిధుల పరిమాణం) 4 శాతంగా కొనసాగుతోంది.
వృద్ధి డేంజర్‌ బెల్స్‌...
జూన్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ట స్థాయి(3.18 శాతం) ఎగబాకినప్పటికీ ఆర్‌బీఐ నిర్ధేశిత లక్ష్యం(4 శాతం) దిగువనే కొనసాగుతోంది. ఇదే తరుణంలో ఆర్థిక వృద్ధి రేటు గతేడాది ఆఖరి త్రైమాసికం(2018-19, జనవరి-మార్చి క్వార్టర్‌)లో ఐదేళ్ల కనిష్టానికి (5.8 శాతం) పడిపోయింది. 2018-19 పూర్తి ఏడాది కూడా 6.8 శాతానికే పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2017-18)లో ఇది 7.2 శాతంగా ఉంది. మరోపక్క, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) వృద్ధి రేటు అంచనాలను ఐఎంఎఫ్‌ సహా పలు ఆర్థిక సంస్థలు ఇప్పటికే తగ్గించడం వృద్ధి మందగమనానికి నిదర్శనంగా నిలుస్తోంది. మరీముఖ్యంగా మౌలిక రంగానికి చెందిన 8 పరిశ్రమల వృద్ధి రేటు సున్నా స్థాయికి పడిపోవడం, వాహన అమ్మకాలు ఘోరంగా క్షీణిస్తుండటం, పెట్టుబడులు పడిపోవడం వంటివి భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోతుందనేదానికి నిదర్శనమని ఎడెల్‌వీజ్‌ రీసెర్చ్‌ తాజా నివేదికలో పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో పావు శాతం రెపో కోతకు ఆస్కారం ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రెసిడెంట్‌(కన్జూమర్‌ బ్యాంకింగ్‌) శాంతి ఏకాంబరం అంచనా వేశారు. కాగా, నేడు ప్రభుత్వ, ప్రై‍్రవేటు రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆర్థిక మందగమన సంకేతాల నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈ, ఆటోమొబైల్‌, హౌసింగ్‌తో పాటు ఇంకా పలు కీలక రంగాలకు రుణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

నగదు లభ్యత పెంచాలి: పరిశ్రమ
వృద్ధికి ఊతమిచ్చేందకు ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు చర్యలు తీసుకుంటోందని. అయితే, అందుకు తగ్గట్లుగా బ్యాంకులు తమ వడ్డీరేట్లను తగ్గించడం లేదని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అంటోంది. బ్యాంకులు చాలా నెమ్మదిగా రేట్ల కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిస్తున్నాయని పేర్కొంది. వ్యవస్థలో నగదు లభ్యతను పెంచేందుకు ఈసారి పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ సీఆర్‌ఆర్‌ను అర శాతం తగ్గించాలని సీఐఐ కోరింది. దీనివల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ.60,000 కోట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ‘వృద్ధికి చేదోడుగా పెట్టుబడులను పెంచాలంటే మరింతగా వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల వినియోదారుల వ్యయం పుంజుకోవడంతోపాటు వాహనాలకు మళ్లీ డిమాండ్‌ కూడా పెరుగుతుంది. అదేవిధఃగా బ్యాంకింగేతర ఆర్థిఖ సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)ల్లో నెలకొన్న లిక్విడిటీ సమస్యను పరిష్కరించాలి’ అని అసోచామ్‌ అభిప్రాయపడింది.You may be interested

మార్కెట్‌ దిశ ఎటు!

Monday 5th August 2019

-ఆర్‌బీఐ పాలసీ, ఎఫ్‌పీఐలకు పన్ను ఊరట అంశాలపై దృష్టి  - బుధవారం కీలక వడ్డీ రేట్ల ప్రకటన - 25 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు ఉండవచ్చని అంచనా.. - చైనా-అమెరికా వాణిజ్య చర్చలపై మార్కెట్‌ దృష్టి - ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, టైటాన్, హెచ్‌సీఎల్‌, బీపీసీఎల్‌, ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ క్యూ1 ఫలితాలు ఈవారంలోనే.. ముంబై: గడిచిన నాలుగు వారాల్లో ఆరు శాతం నష్టాలను నమోదుచేసి, బేర్‌ గుప్పిట్లో ఉన్న అంశాన్ని

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 5th August 2019

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా    కొనచ్చు బ్రోకరేజ్‌ సం‍స్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ.105 టార్గెట్‌ ధర: రూ.140 ఎందుకంటే: ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. దేనా బ్యాంక్‌, విజయ బ్యాంక్‌ల విలీనాంతరం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్లడించిన ఫలితాలు ఇవి. నికర వడ్డీ ఆదాయం 3 శాతమే పెరిగి రూ.6.498 కోట్లకు పరిమితమైంది. ట్రేడింగ్‌ లాభాలు, ఫీజు ఆదాయం 8

Most from this category