News


మోదీ ‘రియల్‌’ బూస్ట్‌!

Thursday 7th November 2019
news_main1573096151.png-29401

  • నిలిచిన ఇళ్ల ప్రాజెక్టుల కోసం ప్రత్యేక నిధి
  • రూ.25,000 కోట్లతో ఏఐఎఫ్‌ ఏర్పాటు
  • ఇందులో ప్రభుత్వ వాటా రూ.10,000 కోట్లు
  • ఎన్‌పీఏ ప్రాజెక్టులకూ సాయం
  • కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటన

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం, నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి ఒక పరిష్కారంతో కేంద్రంలోని మోదీ సర్కారు ముందుకు వచ్చింది. రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్‌)ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. నిలిచిన 1,600 ఇళ్ల ప్రాజెక్టులు (అందుబాటు ధరల ప్రాజెక్టులు, మధ్య, తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు) పూర్తి అయ్యేందుకు సాయపడుతుందని పేర్కొంది. మొండి బకాయిలు (ఎన్‌పీఏలు), దివాలా చర్యల కోసం దాఖలైన ప్రాజెక్టులు కూడా ఈ నిధిని పొందేందుకు అర్హమైనవిగా తాజాగా నిర్ణయించింది. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరాలు వెల్లడించారు. రూ.25,000కోట్ల ఏఐఎఫ్‌ నిధిలో కేంద్రం తన వాటా కింద రూ.10,000 కోట్లు సమకూరుస్తుందని, మిగిలిన మొ‍త్తాన్ని ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ అందిస్తాయని తెలిపారు. నిలిచిపోయిన మొత్తం 4.58 లక్షల ఇళ్ల యూనిట్లను పూర్తి చేసే లక్ష్యంతోపాటు, ఉపాధి కల్పన, సిమెంట్‌, ఐరన్‌, స్టీల్‌ రంగాల్లో డిమాండ్‌ పునరుద్ధరణకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకం గురించి సెప్టెంబర్‌ 14నే ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. అయితే, రుణాలు చెల్లించలేక ఎన్‌పీఏలుగా మారిన ప్రాజెక్టులు, ఎన్‌సీఎల్‌టీ వద్దకు వెళ్లిన ప్రాజెక్టులను నాడు మినహాయించారు. తాజాగా వీటికి కూడా ఏఐఎఫ్‌ ద్వారా నిధులు అందించాలని నిర్ణయించారు. సవరించిన ఈ పథకానికి ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్టు సీతారామన్‌ తెలిపారు. కాకపోతే రెరా రిజిస్ట్రేషన్‌ ఉండి, సానుకూల నికర విలువ ఉన్న ప్రాజెక్టులకే నిధుల సాయం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. సౌర్వభౌమ, పెన్షన్‌ ఫండ్స్‌ భాగస్వామ్యంతో ఈ నిధి మొత్తాన్ని పెంచే అవకాశం కూడా ఉందన్నారు. రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసి, అవి స్వాధీనం కాకుండా ఈఎంఐలు చెల్లించే వారి సమస్యను పరిష్కరించినట్టు చెప్పారు.
సమస్యకు పరిష్కారం...
‘‘ఇళ్ల కొనుగోలు దారుల దీర్ఘకాలిక సమస్యకు ఇది పరిష్కారం చూపుతుంది. తొలుత ప్రకటన (సెప్టెంబర​ 14)లో చేసిన మార్పు ఆహ్వాననీయం. ఇప్పుడు నిధుల సాయం పొందేందుకు నిర్దేశించిన ఏకైక అర్హత సానుకూల నికర విలువ కలిగి ఉండడమే... ఎన్‌పీఏ లేదా ఎన్‌సీఎల్‌టీ ముందున్న ప్రాజెక్టు అయినా సరే, నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయించడం కోసమే ఈ నిధిని ఏర్పాటు చేసినట్టు భరోసా ఇస్తోంది. ఇళ్లను కొనుగోలు చేసిన అధిక శాతం మందికి ఇది ప్రయోజనం కలిగిస్తుంది.’’
- జక్సాయ్‌షా, క్రెడాయ్‌ చైర్మన్‌

ఉపశమనం...
‘‘ప్రభుత్వ నిర్ణయం ఇళ్ల కొనుగోలుదారులు (డబ్బులు చెల్లించి ఇళ్లను పొందలేనివారు)కు ఉపశమనం కల్పిస్తుంది. డిమాండ్‌ పడిపోయిన రియల్‌ఎస్టేట్‌ రంగంలో సెంటిమెంట్‌కు ఊతం ఇస్తుంది.’’
- అనుజ్‌పూరి, ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ అన్‌రాక్‌ చైర్మన్‌ You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్ఎస్‌..

Thursday 7th November 2019

50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు వర్తింపు 80,000 మంది దాకా వినియోగించుకుంటారని అంచనా డిసెంబర్ 3 దాకా అవకాశం సంస్థకు రూ. 7,000 కోట్ల ఆదా న్యూఢిల్లీ: కేంద్రం అందిస్తున్న పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) ప్రకటించింది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 3 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది. సుమారు 70,000-80,000 మంది దాకా ఉద్యోగులు దీన్ని

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే ప్రధాన కంపెనీలు

Thursday 7th November 2019

సన్‌ ఫార్మా, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, డీఎల్‌ఎఫ్‌, ఆంధ్రాబ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌,  యూకో బ్యాంక్‌, యూపీఎల్‌, ఓకార్డ్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌, అదానీ ట్రాన్సిమిషన్‌, అజ్మీరా రియల్టీ, ఇప్కా ల్యాబ్స్‌, మ్యాక్స్‌ ఇండియా, యునైటెడ్‌ బ్రూవరీస్‌ తదితర కంపెనీలతో పాటు సుమారు 140 కంపెనీలు నేడు తమ రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

Most from this category