STOCKS

News


ఎఫ్‌పీఐ పరిమితి పెంపుతో పీఎస్‌యూలకే లాభం!

Thursday 6th February 2020
news_main1580979323.png-31567

కార్పొరేట్‌ బాండ్స్‌లో పెరగనున్న విదేశీ పెట్టుబడులు
కార్పొరేట్‌ బాండ్స్‌లో ఎఫ్‌పీఐల పరిమితి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పీఎస్‌యూ కంపెనీలకు మేలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పీఎస్‌యూ కంపెనీలతో పాటు ఏఏఏ రేటింగ్‌ ఉన్న కంపెనీలు కూడా ఈ నిర్ణయంతో మేలు పొందుతాయంటున్నారు. అయితే ఈ ప్రభావం తక్షణమే ఉండకపోవచ్చన్నారు. కార్పొరేట్‌ బాండ్స్‌లో ఎఫ్‌పీఐల వాటా పరిమితిని 9 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ కేంద్రం బడ్జెట్లో నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ సెక్యూరిటీలను విదేశీ ఇన్వెస్టర్ల కోసం పూర్తిగా ఓపెన్‌చేస్తామని తెలిపింది. ప్రస్తుత 9 శాతం పరిమితి ప్రకారం లెక్కిస్తే బాండ్స్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల పరిమితి రూ.3.17 లక్షల కోట్లకు సమానం అవుతుంది. ఇప్పటికి ఇందులో 58 శాతమే ఎఫ్‌పీఐలు వినియోగించుకున్నట్లు ఎన్‌ఎస్‌డీఎల్‌ గణాంకాలు చెబుతున్నాయి. కార్పొరేట్‌ బాండ్స్‌తో పాటు ప్రభుత్వ బాండ్స్‌లో సైతం ఎఫ్‌పీఐల వాటా పరిమితి పూర్తి వినియోగంలోకి రాలేదని తెలిపింది. ప్రస్తుతం వర్ధమాన మార్కెట్లలో ఎఫ్‌ఐఐల వాటా దాదాపు 11500 కోట్ల రూపాయలుండగా భారత బాండ్స్‌లోకి ఇందులో కేవలం 5 శాతం నిధులే వచ్చాయని ఐఐఎఫ్‌ తెలిపింది. వచ్చిన 5 శాతం నిధుల్లో సగం కార్పొరేట్‌ బాండ్స్‌లోకి వచ్చాయి. 
తాజాగా బాండ్లలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంచడంతో ఎఫ్‌పీఐలు ఎక్కువగా మక్కువ చూపే పీఎస్‌యూ కంపెనీల బాండ్స్‌కు గిరాకీ పెరగవచ్చని నిపుణుల భావన. ప్రభుత్వ అండదండ ఉంటుందన్న నమ్మకంతో పీఎస్‌యూ కంపెనీల బాండ్స్‌కు ఎఫ్‌పీఐలు అధిక మొగ్గు చూపుతుంటారు. వీటి తర్వాత స్థానాల్లో ఆర్థిక సంస్థలు, ఇన్‌ఫ్రా, ఎనర్జీ కంపెనీల బాండ్స్‌ ఉంటాయి. దేశీయ కార్పొరేట్‌ బాండ్‌ పోర్టుఫోలియోలో పది ఎఫ్‌పీఐల పెట్టుబడులన్నీ కలిపి రూ. 82800 కోట్లుంటాయి. విదేశీ మదుపరులు ఎక్కువగా పెట్టుబడి పెట్టిన బాండ్స్‌ పీఎఫ్‌సీ, ఆర్‌ఱీసీ, ఐఓసీ, ఎఫ్‌సీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆర్‌ జియో ఇన్ఫాకామ్‌, ఎయిర్‌టెల్‌కంపెనీలకు చెందినవి ఉంటాయి. బాండ్స్‌లో పెట్టుబడులకు సదరు దేశ కరెన్సీ స్థిరత్వాన్ని విదేశీ మదుపరులు నిశితంగా పరిశీలిస్తారని, తర్వాత ప్రాధాన్యతాక్రమంలో హైఈల్డ్‌ బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఏఏఏ రేటింగ్‌ సంస్థల బాండ్స్‌లో పెట్టుబడులు పెడతారని నిపుణులు వివరించారు. రెండేళ్ల క్రితం వరకు ఎఫ్‌పీఐలు ఎన్‌బీఎఫ్‌సీల బాండ్స్‌పై బాగా మక్కువ చూపేవని, కానీ ప్రస్తుతం వీటిపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. గతేడాది ఎక్కువగా పీఎస్‌యూలు బాండ్స్‌ను జారీ చేశాయి.  
కార్పొరేట్‌ బాండ్స్‌లో పరిమితి పూర్తిగా వాడకపోవడానికి వాలంటరీ రిటెన్షన్‌ రూట్‌(2018లో ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది) కూడా కారణమేనని నిపుణుల విశ్లేషణ. ఈ రూట్‌ రాకముందు కార్పొరేట్‌ బాండ్స్‌లోకి అధికంగా ఎఫ్‌పీఐ నిధులు వచ్చేవి. తదనంతరం నిబంధనలు కఠినం చేయడం, వీఆర్‌ రూట్‌ ప్రవేశపెట్టడంతో బాండ్స్‌లో ఎఫ్‌పీఐల కోటా పూర్తిగా నిండడం లేదని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన పరిమితి పెంపుతో పాటు కొన్ని నిబంధనలను సడలిస్తేనే బాండ్‌ మార్కెట్లో జోరు పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 



You may be interested

రియల్టీ రంగానికి ఆర్‌బీఐ రిలీఫ్‌: హెచ్‌ఎఫ్‌సీ షేర్ల ర్యాలీ

Thursday 6th February 2020

నిర్మాణాలు వాస్తవంగానే ఆలస్యమైన కమర్షియల్‌ రియాల్టీ రుణాలను డౌన్‌గ్రేడ్ చేయబోమంటూ ఆర్‌బీఐ ప్రకటించడటంతో గురువారం రియాల్టీ కంపెనీల షేర్లతో పాటు హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వాణిజ్య ప్రాతిపదికన ప్రాజెక్ట్‌లు అనుకోని పరిస్థితుల్లో ఆలస్యమైనప్పటికీ.., మరో ఏడాది పాటు గడువు పొడిగించేందుకు ఆర్‌బీఐ తాజా పాలసీలో నిర్ణయించింది. అంతేకాకుండా ఆలస్యమైన ప్రాజెక్ట్‌లను డౌన్‌గ్రేడ్‌ చేయరు. ఇన్ఫ్రాయేతర రంగాల ప్రాజెక్ట్‌లకు కల్పించే సదుపాయాలకు వీటికీ

అజంతా ఫార్మా- శ్రీరామ్‌ సిటీ.. భలే జోరు

Thursday 6th February 2020

8 శాతం జంప్‌చేసిన అజంతా ఫార్మా శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు బయ్‌ రేటింగ్‌ విదేశీ ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 117 పాయింట్లు పెరిగి 41,260కు చేరగా.. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 12,121 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించిన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ ర్యాలీ బాటలో సాగుతోంది.

Most from this category