News


ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి!

Saturday 13th July 2019
news_main1562995916.png-27038

  • ఆందోళనకలిగిస్తున్న పారిశ్రామిక, 
  • ద్రవ్యోల్బణం గణాంకాలు
  • మేలో ఐఐపీ వృద్ధి స్పీడ్‌ 3.1 శాతం
  • మైనింగ్‌, తయారీ పేలవ పనితీరు
  • రిటైల్‌ ధరల పరుగు
  • జూన్‌లో 3.18 శాతం
  • వరుసగా ఆరునెలల నుంచీ ఎగువముఖం

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి శుక్రవారం నిరుత్సాహకరమైన గణాంకాలు వెలువడ్డాయి. ఈ అధికారిక గణాంకాల ప్రకారం- పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి సంబంధించిన ఐఐపీ (పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) మేలో కేవలం 3.1 శాతం పెరిగింది. అంటే 2018 మేతో పోల్చితే, 2019 మేలో ఈ పారిశ్రామిక ఉత్పత్తి బాస్కెట్‌ కేవలం 3.1 శాతం పెరిగిందన్నమాట. తయారీ, మైనింగ్‌ రంగాల పేలవ పనితీరు దీనికి కారణమని ప్రభుత్వ గణాంకాధికారులు చెబుతున్నారు. 2018 మే నెలలో (3.8 శాతం) చూసినా,  2019 ఏప్రిల్‌లో (4.3 శాతం) చూసినా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి గణాంకాలు 2019 మే నెలకన్నా అధికంగా ఉండడం గమనార్హం. అయితే ఈ ఏడాది మార్చిలో మాత్రం కేవలం 0.4 శాతంగా నమోదయ్యింది. ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం వరుసగా ఆరవ నెలా అప్‌ట్రెండ్‌లో ‍కొనసాగింది. ఇది జూన్‌లో 3.18 శాతంగా నమోదయ్యింది.
విద్యుత్‌ మినహా అన్ని విభాగాలూ పేలవమే!
- తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతంపైగా వాటా ఉన్న తయారీ రంగం వృద్ధిరేటు 2.5 శాతంగా (2018 మే నెలతో పోల్చితే) నమోదయ్యింది. 2018 మేలో ఈ రేటు 3.6 శాతం. ఈ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 12 మాత్రమే వృద్ధిని నమోదుచేసుకున్నాయి. 
- మైనింగ్‌: మే నెలలో ఈ రంగం కేవలం 3.2 శాతం పెరిగింది. 2018 మే నెల్లో ఈ రేటు 5.8 శాతం.
- విద్యు‍త్‌: ఈ రంగంలో వృద్ధి రేటు మాత్రం 4.2 శాతం నుంచి 7.4 శాతానికి ఎగసింది. 
- కేపిటల్‌ గూడ్స్‌: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, పెట్టుబడులను ప్రతిబింబించే ఈ విభాగంలో వృద్ధి రేటు తీవ్రంగా 6.4 శాతం నుంచి 0.8 శాతానికి పడిపోయింది. 
- కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా -0.1 శాతం క్షీణత నమోదయ్యింది. నాన్‌-డ్యూరబుల్స్‌ విషయంలో వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంది. 

  • ఏప్రిల్‌-మే నెలల్లోనూ నీరసమే!

ఏప్రిల్‌-మే నెలల్లో చూసినా... పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 4.1 శాతం నుంచి 3.7 శాతానికి పడిపోయింది. మైనింగ్‌ రంగంలో వృద్ధి 4.8 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది. తయారీ రంగంలోనూ వృద్ధి రేటు 4.2 శాతం నుంచి 3.2 శాతానికి చేరింది. అయితే విద్యుత్‌ రంగంలో మాత్రం వృద్ధి రేటు 3.1 శాతం నుంచి 6.7 శాతానికి చేరింది. 
 

రిటైల్‌ ధరల తీరిది...
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం నిజానికి మైనస్‌ 2 లేదా ప్లస్‌తో 4 శాతంగా ఉండాలన్నది అధికారిక నిర్దేశం. జూన్‌ నెలలో ఈ రేటు 3.18 శాతంగా (2018 జూన్‌తో పోల్చి) నమోదయ్యింది. నిజానికి ఆర్‌బీఐ నిర్దేశిత రేటుకన్నా (2 శాతానికి ప్లస్‌ 2 శాతం లెక్కన)  ఇంతకన్నా తక్కువగానే ఉన్నప్పటికీ, ఆరు నెలల నుంచీ వరుసగా రిటైల్‌ ద్రవ్యోల్బణం రేటు పెరుగుతూ వస్తున్న విషయం గమనార్హం. ద్రవ్యోల్బణం కట్టడి నేపథ్యంలో ఆర్‌బీఐ వరుసగా ఆరు నెలల్లో రెపో రేటును 0.75 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. సీపీఐలో ఉండే మొత్తం ఐదు విభాగాలనూ వేర్వేరుగా చూస్తే...
- ఆహారం, పానీయాల ధరల పెరుగుదల రేటు 2.37 శాతంగా (2018 జూన్‌తో పోల్చి) నమోదయ్యింది.
- పాన్‌, పొగాకు ఇతర మత్తుప్రేరితాల రేట్లు 4.11 శాతం ఎగశాయి
- వస్త్రాలు, పాదరక్షల విభాగంలో రేటు 1.52 శాతంగా ఉంది.
- గృహ విభాగంలో రేటు 4.84 శాతంగా నమోదయ్యింది.
- ఇంధనం, లైట్‌ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 2.32 శాతంగా ఉంది. 

ఆహార ధరలు వేర్వేరుగా చూస్తే...
మాంసం, చేపల ధరల స్పీడ్‌ భారీగా 9.01 శాతంగా ఉంది. పప్పు దినుసుల ధరలు 5.68 శాతం, కూరగాయల ధరలు 4.66 శాతం ఎగశాయి. తక్కువ శాతాల్లో ధరలు పెరిగిన ఉత్పత్తుల్లో  తృణధాన్యాలు (1.31 శాతం), గుడ్లు (1.62 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (0.63 శాతం), చమురు, వెన్న (0.74 శాతం), సుగంధ ద్రవ్యాలు (1.59 శాతం) ఉన్నాయి. అయితే పండ్లు (-4.18 శాతం), చక్కెర, తీపి ఉత్పత్తుల (-0.09 శాతం) ధరలు తగ్గాయి. You may be interested

జపాన్‌ను మించనున్న భారత్‌

Saturday 13th July 2019

2025 నాటికి అతి పెద్ద ఎకానమీల్లో 3వ స్థానం     ఐహెచ్‌ఎస్ మార్కిట్ నివేదిక న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగ్స్‌లో భారత్ శరవేగంగా ముందుకెడుతోంది. ఈ ఏడాది బ్రిటన్‌ను తోసిరాజని అయిదో స్థానాన్ని దక్కించుకోనుంది. ఇక 2025 నాటికి జపాన్‌ను దాటి మూడో అతి పెద్ద ఎకానమీగా అవతరించనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. "2019లో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద

సావరిన్‌ బాండ్ల ద్వారా రూ.70,000 కోట్ల సమీకరణ !

Saturday 13th July 2019

సావరిన్‌ బాండ్ల ద్వారా రూ.70,000 కోట్ల సమీకరణ ! ఆర్థిక శాఖ కార్యదర్శి వెల్లడి  న్యూఢిల్లీ: సావరిన్‌ బాండ్ల ద్వారా కేంద్రం రూ.70,000 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. విదేశీ మార్కెట్ల నుంచి  సావరిన్‌ బాండ్ల ద్వారా రుణాలు సమీకరించడం సాహసోపేతమైన చర్య అని ఆయన అభివర్ణించారు. విదేశాల్లో రుణాలను సమీకరించడం వల్ల దేశీయంగా ప్రైవేట్‌ రంగానికి మరిన్ని నిధులు అందుబాటులో

Most from this category