News


టాప్‌ 3 ఎకానమీల్లోకి భారత్‌

Tuesday 25th February 2020
news_main1582598654.png-32054

  • దశాబ్దకాలంలో సాధ్యమే
  • డిజిటల్‌ సొసైటీగా ఎదుగుతాం
  • టెక్నాలజీ ఇందుకు ఊతంగా నిలుస్తుంది
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో ప్రపంచంలోని టాప్‌ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌..  కచ్చితంగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. అత్యుత్తమ డిజిటల్‌ సమాజంగా భారత్‌ రూపొందుతుందని ఆయన చెప్పారు. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ ఇందుకు ఊతంగా నిలుసుందన్నారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో కలిసి సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘ప్రపంచంలోని టాప్‌ 3 ఎకానమీల్లో ఒకటిగా భారత్‌ ఎదుగుతుందనడంలో నాకెలాంటి సందేహం లేదు. ఇందుకు అయిదేళ్లు పడుతుందా లేక పదేళ్లు పడుతుందా అన్నది చెప్పలేము కానీ.. కచ్చితంగా ఇది మాత్రం జరుగుతుంది. అప్పటికల్లా మన దేశం సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందినదిగా ఉంటుందా? అభివృద్ధి పనుల్లో టెక్నాలజీ వాడకం ఎలా ఉంటుంది? టెక్నాలజీ వినియోగం విషయంలో మనం మిగతా వాళ్లకు దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉండగలమా? ఇలాంటి విషయాలను మనం తేల్చుకోవాలి. ఏదైతేనేం .. ప్రపంచంలోనే ప్రీమియర్‌ డిజిటల్‌ సొసైటీగా ఎదిగేందుకు భారత్‌ ముందు అద్భుతమైన అవకాశం ఉంది. మనం అస్త్రశస్త్రాలన్నీ అందిపుచ్చుకుని ముందుకు దూసుకెళ్లడమే తరువాయి‘ అని అంబానీ చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) గణాంకాల ప్రకారం గతేడాదే భారత్‌.. అయిదో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత స్థానాల్లో నిల్చింది. ఈ నేపథ్యంలో అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

300 బిలియన్‌ డాలర్ల నుంచి .. 3 ట్రిలియన్‌ డాలర్లకు...
సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు భారత ఎకానమీ పరిమాణం 300 బిలియన్‌ డాలర్లుగా ఉండేదని.. ప్రస్తుతం ఇది 3 ట్రిలియన్‌ డాలర్లకు ఎగిసిందని ముకేశ్‌ అంబానీ చెప్పారు. టెక్నాలజీ ఊతంతోనే ఇది సాధ్యపడిందన్నారు. అప్పట్లో ఆర్థిక సంస్కరణలు, టీసీఎస్, ఇన్ఫోసిస్‌ వంటివి సాంకేతిక రంగాన్ని ముందుండి నడిపించాయన్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టాక పురోగతి మరింత వేగవంతం అయిందన్నారు. టెక్నాలజీపరంగా దేశ పురోగతిలో తమ గ్రూప్‌ సంస్థ రిలయన్స్‌ జియో .. ఉడతా సాయంగా తన వంతు పాత్ర పోషిస్తోందని అంబానీ చెప్పారు.  ‘జియో రాక ముందు దేశీయంగా డేటా ఖరీదు జీబీకి రూ. 300 నుంచి రూ. 500 దాకా ఉండేది. 2జీ ఫోను ఉపయోగించే అత్యంత సామాన్యుడికైతే ఏకంగా రూ. 10,000 దాకా జీబీ ధర ఉండేది. కానీ జియో వచ్చిన తర్వాత ఇది జీబీకి రూ. 12–14 స్థాయికి తగ్గిపోయింది. గడిచిన మూడేళ్లలో 38 కోట్ల మంది కస్టమర్లు 4జీ టెక్నాలజీకి మారారు. సగటు నెట్‌ స్పీడ్‌ 256 కేబీపీఎస్‌ నుంచి ఇప్పుడు 21 ఎంబీపీఎస్‌కు చేరింది‘ అని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో గేమింగ్‌దే భవిష్యత్తు అని అంబానీ చెప్పారు. పాటలు, సినిమాలు, టీవీషోలు అన్నింటినీ మించి ఈ విభాగం భారీ స్థాయిలో ఉండబోతోందని తెలిపారు.

ట్రంప్‌ చూస్తున్నది.. నవ భారతం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనను కూడా అంబానీ ప్రస్తావించారు. గతంలో వచ్చిన అమెరికా అధ్యక్షులు కార్టర్‌ గానీ బిల్‌ క్లింటన్‌.. ఆఖరుకు ఇటీవలి బరాక్‌ ఒబామా కూడా చూడని ఒక కొత్త భారత్‌ను ట్రంప్‌ నేడు చూస్తున్నారని ఆయన చెప్పారు. రిలయన్స్‌ వ్యవస్థాపకుడు, తండ్రి ధీరుభాయ్‌ అంబానీ అప్పట్లో ఒక టేబులు, కుర్చీ, చేతిలో రూ. 1,000 పెట్టుబడితో ప్రారంభించిన స్టార్టప్‌ సంస్థ నేడు దిగ్గజంగా వృద్ధి చెందిందని తెలిపారు. చిన్న వ్యాపారస్తులైనా.. ధీరుభాయ్‌ లేదా బిల్‌ గేట్స్‌ స్థాయికి ఎదిగేందుకు భారత్‌లో పుష్కలమైన అవకాశాలు, సామర్థ్యాలు ఉన్నాయని తెలియజెప్పడానికి ఇది నిదర్శనంగా అంబానీ వివరించారు.

నాదెళ్లపై ప్రశంసలు..
మైక్రోసాఫ్ట్‌కి సత్య నాదెళ్ల సారథ్యం వహించడం ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమని అంబానీ చెప్పారు. పటిష్టమైన భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడం, విశ్వాసాన్ని చూరగొనడం, తప్పిదాలు చేసినా.. వాటిని పాఠాలు నేర్చుకునే అవకాశాలుగా పరిగణించడం, సంస్థలకు సిబ్బందే కీలకమని భావించే సత్య నాదెళ్ల ధోరణి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. 



You may be interested

సొంత సాంకేతిక సామర్ధ్యాలను పెంచుకోవాలి

Tuesday 25th February 2020

సమ్మిళిత వృద్ధిపై దృష్టి పెట్టాలి దేశీ సంస్థలకు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల సూచన ముంబై: సమ్మిళిత వృద్ధి సాధనపై మరింతగా దృష్టి పెట్టాలని, సొంతంగా సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల భారతీయ సంస్థలకు సూచించారు. గత దశాబ్దంలో మొబైల్‌ ద్వారా స్మార్ట్‌ టెక్నాలజీలు విరివిగా వాడకంలోకి వచ్చాయన్నారు. అయితే, అగ్రిగేటర్‌ సంస్థలు మాత్రమే దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందాయని పేర్కొన్నారు. మూడు రోజుల

అద్భుతమైన వాణిజ్య ఒప్పందం

Tuesday 25th February 2020

అతి పెద్ద డీల్ అవుతుంది ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన అహ్మదాబాద్‌: ఓ అద్భుతమైన, ఇప్పటి వరకు చరిత్రలో అతిపెద్దది అయిన వాణిజ్య ఒప్పందంపై భారత్‌, అమెరికా చర్చలు నిర్వహిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. భారత పర్యటనలో తొలి రోజు సోమవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం నుంచి ఆయన ప్రసంగించారు. పెట్టుబడులకు అవరోధాలను తగ్గించే దిశగా అద్భుతమైన వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఆరంభ దశలో ఉన్నాయని

Most from this category