News


అన్నం లేదు.. ఆవకాయ మాత్రమే!!

Sunday 2nd February 2020
news_main1580622956.png-31438

 • ఆదాయపు పన్ను రేట్లు తగ్గించిన ఆర్థికమంత్రి
 • నాలుగు శ్లాబుల స్థానంలో కొత్తగా ఏడు శ్లాబులు
 • కానీ కొత్త విధానంలో 70 రకాల మినహాయింపులు తొలగింపు
 • దీంతో పన్ను రేటు తగ్గినా భారం మాత్రం తగ్గదంటున్న నిపుణులు
 • పాత విధానమా? కొత్త విధానమా? అనేది చెల్లింపుదారు ఇష్టం
 • రెండు విధానాల్లోనూ రూ.5 లక్షల లోపు ఆదాయానికి పన్ను లేదు
 • కొత్త విధానంలో రూ.5- 7.5 లక్షల ఆదాయం ఉంటే 20 నుంచి 10 శాతానికి
 • 10-12.5 లక్షల ఆదాయం ఉన్న వారికి రేటు 30 నుంచి 20 శాతానికి

ఏ బడ్జెట్లో అయినా అందరినీ ఆకర్షించేది ఆదాయపు పన్నే!!. ఎందుకంటే అంతిమంగా తన జేబులో ఎంత మిగులుతుందన్నదే వేతనజీవి వెదుక్కుంటాడు. అలాంటి వేతనజీవికి... పన్ను రేట్లు తగ్గిస్తున్నామంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటన చక్కని విందు భోజనంలా కనిపించింది. ఎంత మమకారమో... అనుకున్నాడు. కానీ... తగ్గింపు రేట్లు కావాలనుకునేవారికి పన్ను మినహాయింపులేవీ ఉండవని ఆమె చెప్పేసరికి... అన్నం లేకుండా ఆవకాయ వడ్డించినట్లయింది. అమ్మో... కారం!!...

పన్ను రేట్లును తగ్గిస్తున్నట్లు ఒక పక్కన ప్రకటిస్తూనే.. మరో పక్క పన్ను మినహాయింపులను భారీగా తొలగించడం ద్వారా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వేతనజీవుల్ని దొంగ దెబ్బ తీశారు. కొన్ని ఆదాయవర్గాలకు సగానికి సగం పన్ను తగ్గినట్లు చూపించినా.. స్టాండర్డ్‌ డిడక్షన్‌, ఇంటి అద్దె అలవెన్స్‌, చాప్టర్‌ 6A కింద లభించే సెక‌్షన్‌ 80-సీ వంటి మినహాయింపులు, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ వంటి కీలక మినహాయింపులను తొలగించారు. శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ఆదాయ పన్ను శ్లాబుల్లో భారీ మార్పులను ప్రతిపాదించారు. రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను రేట్లు తగ్గిస్తూ ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో ఏడు శ్లాబుల విధానాన్ని ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో రూ.2.5 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను ఉండదని, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి గతంలో మాదిరే 5 శాతం పన్ను ఉన్నా దానిపై పూర్తిస్థాయి పన్ను రిబేటు లభిస్తుందని సీతారామన్‌ తెలిపారు. ఈ కొత్త విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి... పాత విధానం ప్రకారం వివిధ సెక‌్షన్ల కింద లభించే మినహాయింపు ప్రయోజనాలు ఉండవని ఆర్థికమంత్రి స్పష్టంచేశారు. అయితే కొత్త విధానానికి మారాలా? లేక పాత విధానంలోనే కొనసాగాలా? అన్నది పన్ను చెల్లింపుదారుల ఇష్టమంటూ... నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా వారికే వదిలిపెట్టారు. 


ఆదాయపు పన్ను చట్టాన్ని సరళతరం చేసే విధానంలో భాగంగా ప్రస్తుతం ఉన్న సుమారు 100 మినహాయింపుల్లో 70 తొలగించినట్లు మంత్రి ప్రకటించారు. పన్ను రేట్లు తగ్గింపు వల్ల ప్రభుత్వం రూ.40,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నట్లు తెలియజేశారు. ‘‘పన్ను మినహాయంపులు వేటినీ లెక్కించకపోతే రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారికి కొత్త పన్ను విధానంలో రూ.78,000 ప్రయోజనం లభిస్తోంది. పాత విధానంలో వారు రూ.2.73 లక్షల పన్ను కట్టాల్సి వస్తే కొత్త విధానంలో రూ.1.95 లక్షలు కడితే సరిపోతుంది’’ అని నిర్మల చెప్పారు. కానీ వాస్తవంగా పాత విధానంలో మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే కత్త విధానంలో అధిక పన్ను చెల్లించాల్సి వస్తుందని ట్యాక్సేషన్‌ నిపుణులు స్పష్టం చేస్తుండటం గమనార్హం. 


తొలగించిన కొన్ని ముఖ్యమైన మినహాయింపులివే...
ఆదాయ పన్ను తగ్గించుకోవడానికి చట్టంలో సుమారు 100కు పైగా మినహాయింపులు ఉండేవి. ఇప్పుడు వీటిలో 70 మినహాయింపులను తొలగిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. క్రమేపీ మిగిలిన మినహాయింపులను కూడా పూర్తిగా తొలగించే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. ఇలా తొలగించిన మినహాయింపుల్లో ముఖ్యమైనవి చూస్తే...

 •  రూ.50,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌
 • పిల్లల ట్యూషన్‌ ఫీజు
 • బీమా ప్రీమియం
 • ప్రావిడెంట్‌ ఫండ్‌
 • ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్స్‌
 • లీవ్‌ ట్రావెల్‌ అలవెన్స్‌
 • ఇంటి అద్దె అలవెన్స్‌
 • 80సీసీసీ కింద చెల్లించే పెన్షన్‌ పథకాలు
 • ఉన్నత విద్యకు తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీ
 • ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ
 • ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు వెచ్చించిన మొత్తం, 
 • గుర్తింపు పొందిన సంస్థలకు ఇచ్చే విరాళాలు
 • ఎంపీ, ఎమ్మెల్యేలు పొందే కొన్ని అలవెన్సులు
 • ఉద్యోగ సంస్థలు ఇచ్చే ఆహార కూపన్లు


వివాద్‌ సే విశ్వాస్‌
ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో ఉన్న లక్షలాది కేసులను పరిష్కరించడానికి ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పేరుతో ప్రత్యేక ప్రథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆదాయ పన్నుకు సంబంధించి 4.83 లక్షల కేసులు వివాదాల్లో ఉన్నాయని, వీటిని పరిష్కరించుకోవాలనుకునే వారు ఈ పథకం కింద వివాదంలో ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే చాలునని స్పష్టంచేశారు. ‘‘మార్చి 31, 2020లోగా చెల్లించేవారికి పెనాల్టీలు, వడ్డీలు వంటివేమీ ఉండవు. అప్పటి నుంచి జూన్‌ 30, 2020లోగా చెల్లించే వారు మాత్రం కొంత మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరవాత మాత్రం ఈ పథకం అమల్లో ఉండదు’’ అని మంత్రి స్పష్టంచేశారు. గతేడాది బడ్జెట్‌లో పరోక్ష పన్నుల విధానంలో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి సబ్‌కా వికాస్‌ పేరుతో ప్రవేశపెట్టిన పథకం ద్వారా 1.89 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని, వీటి ద్వారా రూ.39,000 కోట్ల బకాయిలను వసూలు చేశామని వివరించారు. 

 You may be interested

పేదవిద్యార్థులకు ఆన్‌లైన్‌ డిగ్రీ

Sunday 2nd February 2020

దేశంలోని 100 అగ్ర విద్యాసంస్థల్లో అమలు త్వరలో నూతన విద్యా విధానం ప్రారంభం విద్యారంగానికి రూ.99,300 కోట్లు నిధులు  నైపుణ్యాభివృద్ధికి మరో రూ.3000 కోట్లు   విదేశీ విద్యార్థులకు ఇండ్‌-సాట్‌ పరీక్ష, ఉపకార వేతనాలు యువ ఇంజినీర్లకు ఇంటర్న్‌షిప్‌, విద్యా‍ర్థుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట జాతీయ పోలీస్‌, ఫోరెన్సిక్‌ వర్సిటీల ఏర్పాటు బడ్జెట్‌లో ప్రకటించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభించనున్న నూతన విద్యావిధానంలోని పలు అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పార్లమెంటులో ప్రకటించారు. దానిప్రకారం.. ఉన్నతవిద్యలో

బడ్జెట్‌- డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం రూ. 1.2 లక్షల కోట్లు

Sunday 2nd February 2020

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2020-21) డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 1.2 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా సమీకరించనున్న రూ. 65,000 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపుకావడం గమనార్హం! కాగా.. నిజానికి ప్రభుత్వం ఈ ఏడాది ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా రూ. 1.05 లక్షల కోట్లను సమీకరించాలని భావించింది. అయితే ఇప్పటివరకూ

Most from this category