News


దేశీయ డిమాండ్‌ బలహీనం!

Wednesday 24th July 2019
news_main1563950961.png-27275

  • భారత్‌ ఆర్థిక వ్యవస్థపై 
  • ఐఎంఎఫ్‌ విశ్లేషణ
  • 2019, 2020 వృద్ధి రేట్ల 
  • అంచనాలు 0.3 శాతం కోత
  • ఈ రెండేళ్లలో వృద్ధి 7, 7.2 శాతాలు మాత్రమే
  • అంతర్జాతీయంగానూ వృద్ధి అంతంతే

వాషింగ్టన్‌: భారత్‌ దేశీయ వినియోగ డిమాండ్‌ అవుట్‌లుక్‌​అంచనాలకన్నా బలహీనంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విశ్లేషించింది. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై ఈ ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ కారణంగా 2019, 2020కి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 0.3 శాతం (30 బేసిస్‌ పాయింట్లు) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 2019లో 7 శాతం, 2020లో 7.2 శాతం వృద్ధి రేట్లు మాత్రమే నమోదవుతాయన్నది తమ తాజా అంచనా అని తెలిపింది. అయితే ఈ స్థాయి వృద్ధి నమోదయినా, ప్రపంచంలో వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలుస్తుందని, చైనా తరువాతి స్థానంలోనే ఉంటుందని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ దిగ్గజ ద్రవ్య సంస్థ పేర్కొంది. తన తాజా వరల్ట్‌ ఎకనమిక్‌ అప్‌డేట్‌ నివేదికలో భాగంగా భారత్‌కు సంబంధించి ఐఎంఎఫ్‌ ఈ అంశాలను పేర్కొంది. భారత్‌ సంతతికి చెందిన ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ చిలీ రాజధాని శాంటియాగోలో ఆవిష్కరించిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

- పన్నుల భారాలు పెరగడం, అంతర్జాతీయ డిమండ్‌ బలహీనపడ్డం, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల వంటి అంశాలతో చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూలతలు ఎదుర్కొంటోంది. మందగమనంలో ఉన్న ఆర్థిక​ వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి చైనా పలు విధానపరమైన ఉద్దీపన చర్యలు తీసుకుంటోంది. ఆయా చర్యల ఫలితంగా చైనా 2019లో 6.2 శాతం 2020లో 6 శాతం వృద్ధి రేట్లను నమోదుచేసుకునే అవకాశం ఉంది. (ఏప్రిల్‌లో వెలువడిన వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ అంచనాలకన్నా 10 బేసిస్‌ పాయింట్లు తక్కువ)
- అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక అనిశ్చితి పరిస్థితి ఉంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పనితీరుమీద ప్రధానంగా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల ఆధారపడి ఉంటుంది. 
- ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య ప్రపంచ వాణిజ్యం కూడా నెమ్మదించింది. ప్రపంచ వాణిజ్యం ఈ కాలంలో కేవలం 0.5 శాతం మాత్రమే పురోగమించింది. ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు 2012 తర్వాత ఇదే తొలిసారి. 
- అమెరికా-చైనాల మధ్య సుంకాల పోరు, ఆటో టారిఫ్‌లు, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వెలుపలికి రావడానికి సంబంధించిన బ్రెగ్జిట్‌ అంశాలు అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతాయి. పెట్టుబడులు, సరఫరా చైన్లను ఈ పరిస్థితి దెబ్బతీసే అవకాశం ఉంది. 
- అయితే ఈ పరిస్థితిని ‘అంతర్జాతీయ మాద్యంగా’ మాత్రం ఐఎంఎఫ్‌ పరిగణించబోవడం లేదు. ప్రపంచ వృద్ధికి ‘కీలక అవరోధాలు’గా మాత్రమే దీనిని ఐఎంఎఫ్‌ చూస్తోంది. 
- అమెరికా-చైనా మధ్య వాణిజ్య సవాళ్లు 2020లో ప్రపంచ జీడీపీని 0.5 శాతం మేర తగ్గించే అవకాశం ఉంది. 
- ద్వైపాక్షిక వాణిజ్య సమతౌల్యతలు, వాణిజ్యలోటు సమస్యల పరిష్కారానికి సుంకాలే మార్గమని భావించడం సరికాదు. ఆయా సవాళ్ల పరిష్కారానికి నిబంధనల ఆధారిత బహుళజాతి వాణిజ్య వ్యవస్థ మరింత పటిష్టం కావాలి. డిజిటల్‌ సేవలు, సబ్సిడీలు, సాంకేతిక బదలాయింపుల వంటి అంశాల్లో మరింత విస్తృత అవగాహన కుదరాలి. 

7కు అంటు ఇటుగానే అంచనాలు!
భారత్‌ ఆర్థిక వ్యవస్థ స్పీడు అంచనాలను తగ్గించడానికే పలు ఆర్థిక సంస్థలు మొగ్గుచూపుతుండడం గమనార్హం. ఆయా అంశాలను క్లుప్తంగా చూస్తే...

ఏడీబీ: అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల వృద్ధి మందగమనం... ప్రపంచ వాణిజ్యంపై దీని ప్రభావం వంటి అంశాలు 2019-2020 ఆర్థిక సంవత్సరంలో భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనావేసింది. దీనివల్ల దేశ వృద్ది అంచనాలను 20 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గిస్తున్నామని తెలిపింది. దీనితో 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏడీబీ వృద్ధి అంచనా 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గింది. 
ఫిచ్‌: భారత్‌ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- ఫిచ్‌ వరుసగా రెండవసారి కుదించింది. 2019- 2020లో కేవలం 6.6 శాతమే నమోదవుతుందని ఫిచ్‌ అంచనా వేసింది. తొలుత 7 శాతంగా ఉన్న ఈ అంచనాలను మార్చిలో 6.8 శాతానికి తగ్గించింది. ఆర్థిక మందగమనం దీనికి కారణంగా పేర్కొంది.  జూన్‌లో మరో 20 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) కుదించింది.  గత ఏడాది కాలంగా తయారీ, వ్యవసాయ రంగాల పేలవ పనితీరు తమ తాజా అంచనాలకు కారణమని తెలిపింది. 
గోల్డ్‌మన్‌ శాక్స్‌: దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుదని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందని, ఇందుకు.. తగ్గిన ముడి చమురు ధరలు, రాజకీయ స్థిరత్వం, మౌళికరంగంలోని అవరోధాల తొలగిపోతుండడం వంటి సానుకూల అంశాలు ఊతమివ్వనున్నాయని తన తాజా నివేదికలో పేర్కొంది. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు వల్ల ద్రవ్యలభ్యత పెరిగి వృద్ధి ఊపందుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. 
ప్రపంచబ్యాంక్‌:  ఇక భారత ఎకానమీ వృద్ధిరేటు వచ్చే మూడేళ్ల పాటు 7.5 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. పెట్టుబడులు పెరగడం, ప్రైవేట్‌ వినిమయంలో జోరు కారణంగా ఎకానమీలో వృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది.
డీబీఎస్‌: ప్రముఖ బ్యాంకింగ్‌ సేవల సంస్థ- డీబీఎస్‌ కూడా భారత్‌  వృద్ధిరేటును  జూన్‌లో రెండవసారి కుదించింది. 2019- 2020లో వృద్ధి అంచనాలను 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. 
ఆర్‌బీఐ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు జూన్‌ సమీక్షా సమావేశంలో ప్రకటించింది. 
ఎకనమిక్‌ సర్వే: 2019-20 ఆర్థిక సంవత్సరం వృద్ధి 7 శాతం ఉంటుందని అంచనా వేసింది. 


 You may be interested

2018-2019కు ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

Wednesday 24th July 2019

న్యూఢిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2019-2020 అసెస్‌మెంట్‌ ఇయర్‌) వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్స్‌ (ఐటీఆర్‌) దాఖలుకు గడవును కేంద్రం నెలపాటు పొడిగించింది. నిజానికి అకౌంట్ల ఆడిటింగ్‌ అవసరంలేని వేతన జీవులు, సంస్థలుసహా వ్యక్తిగత ఐటీఆర్‌ దాఖలుకు  గడువు 2019 జూలై 31తో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఆయా వర్గాలకు కొంత వెసులుబాటు లక్ష్యంగా సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌) రిటర్న్‌ దాఖలు గడువును ఆగస్టు

విదేశీ ఇన్వెస్టర్లు అమ్మేస్తున్నారు!

Wednesday 24th July 2019

జూలైలో 120 కోట్ల డాలర్ల విక్రయాలు దేశీయ మార్కెట్లో ఎన్నికల ముందు భారీ కొనుగోళ్లు జరిపిన విదేశీ సంస్థాగత మదుపరులు బడ్జెట్‌ అనంతరం భారీగా అమ్మకాలకు దిగారు. సూపర్‌రిచ్‌పై బడ్జెట్లో విధించిన సర్‌చార్జ్‌పై అసంతృప్తిగా ఉన్న ట్రస్ట్‌ స్ట్రక్చర్‌ ఎఫ్‌ఐఐలు విక్రయాలకు దిగారు. జూలైలో ఇంతవరకు ఎఫ్‌ఐఐలు దాదాపు 120 కోట్ల డాలర్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. ఇదే కొనసాగితే క్షీణత పరంగా గత అక్టోబర్‌ తర్వాత జూలై నెల

Most from this category