News


ఆర్థిక గణాంకాల నిరాశ!

Friday 13th September 2019
news_main1568347973.png-28341

  • పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం
  • జూలైలో ఉత్పత్తి వృద్ధి 4.3 శాతం
  • గత ఏడాది ఇదే నెల్లో 6.5 శాతం వృద్ధి
  • అదుపులోనే ఉన్నా... 
  • రిటైల్‌ ద్రవ్యోల్బణం పైకే!
  • ఆగస్టులో 3.21 శాతం
  • ఆహార ఉత్పత్తుల ధరలు పైకి

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గురువారం వెలువడిన కీలక గణాంకాలు నిరాశపరిచాయి. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 4.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 6.5 శాతం. అయితే నెలవారీగా చూస్తే మాత్రం కొంత బెటర్‌. 2019 జూన్‌లో ఈ వృద్ధి రేటు అతి తక్కువగా 1.2 శాతంగా నమోదయ్యింది. కాగా రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా, (ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 4 శాతం లోపు) ఆగస్టులో ఇది అప్‌ట్రెండ్‌లోనే ఉంది. 3.21 శాతంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో నమోదయ్యింది. ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...

తయారీ రంగం పేలవం...
- మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం జూలైలో నిరాశ కలిగించింది.  తయారీ రంగం 4.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటే, 2018 ఇదే నెలలో ఈ రేటు 7 శాతంగా ఉంది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 13 జూలైలో సానుకూలంగా ఉంటే, మిగిలినవి నేలచూపులు చూశాయి. ఇందులో పేపర్‌, పేపర్‌ ఉత్పత్తుల తయారీ పారిశ్రామిక గ్రూప్‌ భారీగా -15.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. మోటార్‌ వెహికిల్స్‌ తయారీ విభాగంలో రేటు -13.3 శాతంగా ఉంది. ప్రింటింగ్‌, రీప్రొడక‌్షన్‌ విభాగంలో క్షీణత రేటు -10.9 శాతంగా ఉంది. 
- క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సంకేతంగా ఉన్న క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో అసలు వృద్ధి లేకపోగా - 7.1 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ విభాగంలో వృద్ధి రేటు కనీసం 2.3 శాతంగా ఉంది. 
- విద్యుత్‌: ఈ రంగంలో కూడా వృద్ధి రేటు 6.6 శాతం నుంచి 4.8 శాతానికి పడింది. 
- కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: ఫ్రిజ్‌లు, టీవీల వంటి ఈ విభాగంలో అసలు వృద్ధి లేదు. - 2.7 క్షీణత నమోదయ్యింది.
-  మైనింగ్‌: ఈ రంగం మాత్రం కొంచెం మెరుగుపడింది. వృద్ధి రేటు 3.4 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది. 
- కన్జూమర్‌ నాన్‌-డ్యూరబుల్స్‌: సబ్బులు ఇతర ప్యాకేజ్డ్‌ గూడ్స్‌ వంటి  ఫాస్ట్‌ మూవింగ్‌ వినియోగ వస్తువుల విభాగంలో మాత్రం వృద్ధి రేటు 8.3 శాతంగా ఉంది. 

నాలుగు నెలల్లోనూ నేలచూపే...
- ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో (ఏప్రిల్‌-జూలై) పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5.4 శాతంగా ఉంది. 
10 నెలల గరిష్టానికి రిటైల్‌ ధరల స్పీడ్‌
రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.21 శాతానికి పెరిగింది. గడచిన పది నెలల కాలంలో ఇంత అధిక రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. మాంసం, చేపలు, కూరలు, పప్పు దినుసుల వంటి ఆహార ఉత్పత్తుల అధిక ధరలు రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం పెరగడానికి కారణమని గణాంకాలు వివరిస్తున్నాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2తో 2 శాతంగా ఉండాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కు నిర్దేశిస్తోంది. ఈ లెక్కన ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. అందువల్ల ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు- రెపోను (ప్రస్తుతం 5.4 శాతం) మరో పావుశాతం తగ్గించే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వృద్ధే లక్ష్యంగా గడచిన నాలుగు త్రైమాసికాల్లో రెపో రేటును ఆర్‌బీఐ 1.1 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. సామాన్యునికి సంబంధించి రిటైల్‌ గణాంకాలను చూస్తే... ఆగస్టులో ఫుడ్‌ బాస్కెట్‌ ధరల స్పీడ్‌ 2.36 శాతం (జూలైలో) 2.99 శాతానికి పెరిగింది. చేపలు, మాంసం బాస్కెట్‌ ధర 8.51 శాతం పెరిగితే, పప్పు ధాన్యాల ధరలు 6.94 శాతం ఎగశాయి. కూరగాయల ధరలు ఆగస్టులో 6.9 శాతం పెరిగాయి. కాగా గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.18 శాతం ఉంటే, పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 4.49 శాతంగా నమోదయ్యింది. You may be interested

26, 27 సమ్మెచేస్తాం

Friday 13th September 2019

 బ్యాంక్‌ ఆఫీసర్ల యూనియన్ల నోటీస్‌ నవంబర్‌ రెండవ వారంలో నిరవధిక సమ్మెకూ హెచ్చరిక న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో విలీనాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో రెండు రోజులు సమ్మె చేస్తామని ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫీసర్ల యూనియన్లు నాలుగు హెచ్చరించాయి. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగుగా మార్చుతూ  విలీన పర్వానికి ఆగస్టు 30వ తేదీన  కేంద్రం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో తాజా సమ్మె హెచ్చరిక వెలువడింది. ఇండియన్‌ బ్యాంక్‌ ఆఫీసర్ల యూనియన్లు  ఒక

స్వల్పలాభాలతో ప్రారంభం

Friday 13th September 2019

క్రితం రోజు నష్టాల పాలైన దేశీయ మార్కెట్‌ శుక్రవారం స్వల్పలాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ కిత్రం ముగింపు(37,104)తో పోలిస్తే 73 పాయింట్ల లాభంతో 37,175.86 వద్ద, నిఫ్టీ గతముగింపు(10,983)తో పోలిస్తే 4 పాయింట్లు పెరిగి 10,987 వద్ద ప్రారంభమైంది. నిన్న నిర్వహించిన సమావేశంలో యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంక్‌(ఈసీబీ) మరో విడత ఉద్దీపన చర్యలు ప్రకటించింది. మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు బ్యాంకు నెలకు 20 బిలియన్‌ యూరోల విలువైన బాండ్లను కొనుగోలు చేయడంతో పాటు వడ్డీరేట్లను తగ్గించింది.

Most from this category