News


కరోనాపై ఆర్‌బీఐ యుద్ధం!!

Monday 23rd March 2020
news_main1584931484.png-32620

  • ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చర్యలు
  • వ్యాపార విపత్తు ప్రణాళిక అమలు
  •  వార్‌ రూమ్ ఏర్పాటు

ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రిజర్వ్ బ్యాంక్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. మార్చి 19 నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక (బీసీపీ)ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో వార్ రూమ్ అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన 90 మంది కీలక సిబ్బందితో పాటు ఇతరత్రా విభాగాలకు చెందిన 60 మంది ముఖ్యమైన ఉద్యోగులు, ఫెసిలిటీ స్టాఫ్‌ 70 మంది ఇందులో విధులు నిర్వర్తిస్తుంటారని పేర్కొన్నారు. ఈ వార్‌ రూమ్‌ .. ప్రత్యేకంగా డెట్ నిర్వహణ, రిజర్వుల నిర్వహణ, ద్రవ్యపరమైన కార్యకలాపాలు పర్యవేక్షిస్తుందని అధికారి తెలిపారు. బీసీపీ కింద నగదు బదిలీ లావాదేవీ సేవలైన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్‌), స్ట్రక్చర్డ్‌ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ (ఎస్‌ఎఫ్ఎంఎస్‌) మొదలైనవి పర్యవేక్షిస్తారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలకు సంబంధించిన ఈ-కుబేర్‌, ఇంటర్‌బ్యాంక్ లావాదేవీల్లాంటివి కూడా వీటిలో ఉంటాయని అధికారి వివరించారు. 

ప్రపంచంలోనే తొలిసారి...
"ఒక కేంద్రీయ బ్యాంకు ఇలాంటి బీసీపీని అమలు చేయడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. చరిత్రలో కూడా ఇదే తొలిసారి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఇలాంటివి ఏర్పాటు కాలేదు" అని అధికారి వివరించారు. "సాధారణంగా సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సమస్యలు, అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులు మొదలైన వాటికి మాత్రమే బీసీపీ లాంటిది ఉంటుంది. కానీ కరోనా వైరస్ మహమ్మారితో యుద్ధంలో ఆర్‌బీఐ ప్రకటించిన బీసీపీ లాంటిది మరెక్కడా లేదు" అని చెప్పారు. దేశవ్యాప్తంగా 31 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయంలో 14,000 మంది పైగా సిబ్బంది ఉన్నారు. అత్యంత కీలక కార్యకలాపాలను 1,500 మంది దాకా సిబ్బంది నిర్వహిస్తుంటారు. ప్రధాన కార్యాలయంలో 2,000 దాకా సిబ్బంది ఉండగా.. గత వారం రోజులుకాగా కేవలం 10 శాతం మందే విదులకు హాజరవుతున్నారు. 

ఇలా ఏర్పాటు చేశారు...
వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన తీరుతెన్నులను అధికారి వివరించారు. 150 మంది ఆర్‌బీఐ సిబ్బంది, 60 మంది సర్వీస్ ప్రొవైడర్లు, 70 శాతం మంది ఫెసిలిటీ స్టాఫ్ (మెయింటెనెన్స్‌, సెక్యూరిటీ, కిచెన్‌, ఫ్రంట్ డెస్క్‌, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల వారు)కి సరిపడే ఒక భవంతిని ఆర్‌బీఐ తీసుకుంది. ఈ సిబ్బంది అందరూ నిరంతరం ఆ భవంతిలోనే ఉంటారు. తీవ్ర విపత్తు పరిస్థితులైతే తప్ప బైటికి రావడానికి ఉండదు. వారందరికీ అవసరమైన వాటిని అత్యంత పరిశుభ్రత ప‍్రమాణాలను పాటిస్తూ, సరఫరా చేసేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు. రెండు బ్యాచ్‌ల కింద వార్ రూమ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. సరిగ్గా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో కరోనా వైరస్‌ రావడంతో.. లావాదేవీలన్నీ సక్రమంగా జరిగేలా చూడాల్సి రావడం మరింత ప్రాధాన్యతాంశంగా మారింది. 

నోట్లను ముట్టుకుంటే చేతులు కడుక్కోండి: ఐబీఏ సూచన
కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరెన్సీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నోట్లను లెక్కపెట్టిన తర్వాత, ముట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలంటూ సూచించింది. సాధ్యమైనంత వరకూ బ్యాంకు శాఖలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌, మొబైల్ బ్యాంకింగ్ మార్గాలను ఉపయోగించుకోవాలని కోరింది. ఇందుకు సంబంధించి "కరోనా సే డరో న, డిజిటల్ కరో నా" (కరోనాతో భయం వద్దు .. డిజిటల్ సర్వీసులు ఉపయోగించుకోండి) అనే పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ఐబీఏ ఆవిష్కరించింది. చెల్లింపుల కోసం కరెన్సీ నోట్లకు బదులు క్రెడిట్‌, డెబిట్ కార్డులను ఉపయోగించడం శ్రేయస్కరమని పేర్కొంది. 



You may be interested

మూడేళ్ల కనిష్టస్థాయికి ఏటీఎఫ్‌ ధరలు

Monday 23rd March 2020

12 శాతం తగ్గుదల న్యూఢిల్లీ: విమాన ఇంధన (ఏటీఎఫ్) ధర 12 శాతం తగ్గింది. కోవిడ్–19 (కరోనా వైరస్) పాజిటివ్ నిర్థరణ కేసులు పెరిగిపోతుండడం, ఈ వైరస్‌ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్‌ ధరను కిలోలీటర్‌కు రూ. 6,688 మేర తగ్గించినట్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో కిలోలీటర్‌ ధర

వాహనాల తయారీకి కరోనా బ్రేక్‌..

Monday 23rd March 2020

ఉత్పత్తి నిలిపివేస్తున్న ఆటోమొబైల్ కంపెనీలు జాబితాలో మారుతీ, హోండా, ఫియట్‌ తదితర సంస్థలు న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యల్లో భాగంగా ఆటోమొబైల్ దిగ్గజాలు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) గురుగ్రామ్‌, మానెసర్‌లోని (హర్యానా) తమ ప్లాంట్లలో తక్షణం ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ రెండు ప్లాంట్లలో ఏటా 15.5 లక్షల వాహనాలు ఉత్పత్తవుతాయి. అటు రోహ్‌తక్‌లోని పరిశోధన, అభివృద్ధి

Most from this category