News


ఆర్‌బీఐని ‘నిధులు’ అడుగుతాం..!

Thursday 20th December 2018
news_main1545283363.png-23100

న్యూఢిల్లీ:  మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)ను కేంద్రం అడుగుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గర్గ్‌ బుధవారం స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి ఆర్‌బీఐ రూ.10,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించింది. ఈ ఏడాదీ మధ్యంతర డివిడెండ్‌ను కోరుతున్నట్లు పేర్కొన్న గార్గ్‌ దీనిపై మరింత లోతుకు వెళ్లలేదు. బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదనపు మూలధనాన్ని అందించాలనీ కేంద్రం భావిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పాలరు. జూలై-జూన్‌ మధ్య పన్నెండు నెలల కాలాన్ని ఆర్‌బీఐ తన ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తోంది. పీహెచ్‌డీ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి చూస్తే...
♦ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద మూలధన నిల్వల నిర్వహణ ఎంత ఉండాలన్న అంశానికి సంబంధించి పరిశీలించడానికి కమిటీ ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. త్వరలో ఒక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నాం. కేంద్రం-ఆర్‌బీఐ మధ్య పరస్పర విభేదిత అంశాలుసహా, ఆర్‌బీఐ మూలధన నిర్వహణ అవసరాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నవంబర్‌ 19 నాటి సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశంలో ఆర్‌బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 
♦  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) లక్ష్యాలను ఎదుర్కొనడానికి ఆర్‌బీఐ లేదా మరే ఇతర సంస్థ నుంచి  ప్రభుత్వం అదనపు నిధులను ఏమీ కోరుకోవడం లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. గార్గ్‌ కూడా గతంలో​ ఒక ట్వీట్‌లో​ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద మూలధన నిల్వల నిర్వహణ అంశాన్ని పరిశీలించాలన్నదే కేంద్రం ఉద్దేశమని గార్గ్‌ స్పష్టం చేశారు.
♦ ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదనపు మూలధనాన్ని అందించే వీలుంది. గురువారమే ఈ నిధుల ప్రకటన చేసే అవకాశం ఉంది.  గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం ప్రకటించిన మూలధన కల్పన నిధులకు (రూ.1.35 లక్షల కోట్లు) ఇది అదనం. మూలధనానికి సంబంధించి అంతర్జాతీయ బాసెల్‌ 3 ప్రమాణాలను సాధించడానికి బ్యాంకింగ్‌కు అదనపు మూలధన కల్పన అవసరం.
♦ ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌ నుంచి నిధులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న బ్యాంకులకు తానే అదనపు నిధులు సమకూర్చాలని క్రేంద భావిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాల సమాచారం. రూ.30,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల మధ్య ఈ నిధులు ఉండవచ్చని అంచనా. గత ఏడాది అక్టోబర్‌ 2017లో ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం, బ్యాంకులు 2019 మార్చి నాటికి రూ. 58,000 కోట్ల నిధులను స్టాక్‌ మార్కెట్ల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంది. ఇది సాధ్యంకాకపోగా, బ్యాంకింగ్‌ లాభాలపై మొండిబకాయిల సెగ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ ప్రకటన ప్రకారం- రెండేళ్లలో బ్యాంకులకు కావాల్సిన మూలధన నిధులు మొత్తం రూ.2,11,000 కోట్లు. ఇందులో​ బడ్జెటరీ మద్దతు ద్వారా కేంద్రం రూ. 18,139 కోట్లు సమకూర్చుతుంది. రీక్యాపిటలైజేన్స్‌ బాండ్స్‌ ద్వారా రూ. 1,35,000 కోట్లు లభిస్తాయి.
♦ ఈ ఏడాది మొదట్లో ప్రభుత్వం ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎన్‌బీ, అలహాబాద్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌) మొత్తం రూ.11,336 కోట్ల మూలధనాన్ని సమకూర్చింది. 
 అదనపు నిల్వలపై నిర్ణయం ఆర్‌బీఐదే కావాలి: కౌశిక్‌ బసు
తన వద్ద ఉన్న అదనపు నిల్వలపై నిర్ణయం తీసుకునే తుది నిర్ణయం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాత్రమే తీసుకునేలా ఉండాలని ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్‌ బసు స్పష్టం చేశారు. ఆర్‌బీఐ స్వతంత్రతకు దెబ్బతగిలే చర్యలు ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల్లోకి నెడతాయని కూడా ఆయన స్పష్టంచేశారు. ఆర్‌బీఐ వద్ద అధికంగా ఉన్న నిధులను కేంద్ర ప్రభుత్వానికి గనక బదిలీ చేస్తే అది కేంద్ర బ్యాంకు రేటింగ్‌ తగ్గడానికి దారితీస్తుందని మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఇటీవలే పేర్కొన్న నేపథ్యంలోనే కౌశిక్‌ బసు ప్రకటన వెలువడ్డం గమనార్హం. ‘‘ఆర్‌బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను కేంద్రానికి బదలాయించే వెసులుబాటు ఉంది. అయితే ఇది ఆర్‌బీఐ నిర్ణయం అయి ఉండాలి. ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరితో అటువంటి చర్యలకు దిగిపోకూడదు. ఆర్‌బీఐ కాదు కూడదు అంటే, అత్యున్నత సంస్థ అలా ఎందుకు అన్నదన్న అంశాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి’’ అని బసు పేర్కొన్నారు. ఆర్‌బీఐ వద్ద జూన్‌ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలు ఉన్నాయి. నగదు, బంగారం రీవ్యాల్యూషన్‌ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్‌ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఈ నిధులను ప్రభుత్వం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో- డిసెంబర్‌ 10వ తేదీన   వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్‌ 19న జరిగిన ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం నిర్ణయించింది. 
 బ్యాంక్‌ చీఫ్‌లతో ఆర్‌బీఐ చీఫ్‌ భేటీ
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశమయ్యారు. దిద్దుబాటు చర్యల చట్రంలో (పీసీఏ) ఉన్న పదకొండు బ్యాంకుల్లో కొన్నింటికి మినహాయింపు, లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు, ద్రవ్య లభ్యత వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే ఇది మామూలుగా జరిగే సమావేశమేనని ఒక బ్యాంకర్‌ తెలిపారు.  దాస్‌ ప్రమాణ స్వీకారం తరువాత బ్యాంక్‌ చీఫ్‌లతో సమావేశం కావడం ఇది రెండవసారి. తాజాగా జరిగిన సమావేశంలో పాల్గొన్న వారిలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, అలహాబాద్‌ బ్యాంక్‌, ఇండియన్ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యుకో బ్యాంక్‌ చీఫ్‌లు ఉన్నారు.  మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో​ తీవ్ర మొండిబకాయిల  భారంతో కూరుకుపోయిన 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు 2016 సెప్టెంబర్‌ 16 నుంచీ ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యల ప్రక్రియ (పీసీఏ) కిందకు వెళ్లాయి. వీటిలో అలహాబాద్‌ బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, యుకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, దేనా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలు ఉన్నాయి. మొత్తం రుణ మార్కెట్‌లో ఈ బ్యాంకుల వాటా 20 శాతం.   ఈ పరిధి నుంచి త్వరలో తొలి దశగా కార్పొరేషన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహబాద్‌ బ్యాంక్‌లకు తొలగిస్తారని వార్తలు వస్తున్నాయి.You may be interested

ఆర్‌ఐఎల్ గ్యాస్ ప్రాజెక్టు వ్యయాలపై పీఏసీ దృష్టి

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో నాలుగు అనుబంధ గ్యాస్ నిక్షేపాలను అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.52 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలకు డీజీహెచ్‌ కమిటీ ఆమోదముద్ర వేయడాన్ని పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) తప్పుపట్టింది. స్వతంత్ర థర్డ్ పార్టీ ధృవీకరణ లేకుండా ఆమోదం తెలపడంపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే దీనికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు బుధవారం రెండో

మారుతీ విక్రయ అంచనాల్లో కోత

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వాహన విక్రయ అంచనాలను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు 10-12 శాతం రేంజ్‌లో వృద్ధి చెందగలవని ఈ కంపెనీ గతంలో అంచనా వేసింది. ఇప్పుడు ఈ అంచనాలను 8 శాతానికి తగ్గిస్తున్నామని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌.సి. భార్గవ వెల్లడించారు. వడ్డీరేట్లు అధికంగా ఉండటం, బీమా వ్యయాలు పెరగడం వంటివి దీనికి కారణాలని చెప్పారు. అమ్మకాలు బాగా

Most from this category