News


వ్యవసాయానికి పెద్దపీట

Saturday 6th July 2019
news_main1562398818.png-26863

  •  రైతు ఆదాయం రెట్టింపుపై కేంద్రం దృష్టి
  • వ్యవసాయం, ఆధారిత రంగాల్లో భారీగా పెట్టుబడులు
  •  ప్రైవేటు పెట్టుబడులకు ‍ప్రోత్సాహం ఇస్తామన్న కేంద్ర మంత్రి
  • అన్నదాత వెలుగు ప్రదాతంటూ ప్రశంస
  • మత్స్యకార, పాడిపరిశ్రమలకూ భారీగా ప్రోత్సాహకాలు
  • జీరో బడ్జెట్‌ వ్యవసాయంపై దృష్టిపెడతాన్న సీతారామన్‌

న్యూఢిల్లీ: 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే.. వ్యవసాయ రంగంలో భారీ పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. దీంతోపాటుగా వ్యవసాయాధారిత రంగాల్లో మౌలికసవతుల కల్పనను ప్రోత్సహించే చర్యలకు ఆమోదం తెలిపింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్లు స్పష్టం చేసింది. 2019-20 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తమ ప్రభుత్వం ‘గావ్‌, గరీబ్‌ ఔర్‌ కిసాన్‌’పై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు. వ్యాపారానుకూల వాతావరణం, సరళీకృత జీవనం వంటి అంశాలు వ్యవసాయం, రైతులకు కూడా అమలయ్యేలా చర్యలు చేపట్టనున్నామన్నారు. 

‘వ్యవసాయ మౌలికవసతుల రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాం. రైతుల వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడం, ఇతర వ్యవసాయాధారిత అంశాల్లో ప్రైవేటు పెట్టుబడులకు సంపూర్ణ సహకారం అందిస్తాం. వెదురు, కలప సద్వినియోగం, పునరుత్పాదక విద్యుదుత్పత్తి తదితర అంశాల్లోనూ ప్రైవేటు రంగానికి తమ మద్దతుంటుందన్నారు. అన్నదాత అనంత శక్తిప్రదాత అని చెబుతూ.. సహకార సంఘాల ద్వారా పాల ఉత్పత్తిని పెంచేందుకు పశువులకు దాణా, పాల సేకరణ, మార్కెటింగ్‌ తదితరాంశాలకు అవసరమైన వసతుల కల్పనను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

మత్స్యకార రంగంలో నెలకొన్న అపారమైన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకాన్ని ప్రారంభిచంనున్నట్లు మంత్రి వెల్లడించారు. తద్వారా ఈ రంగంలో మరింత పురోగతిని పెంచడంతోపాటు ఇప్పటికే ఉన్న వ్యవస్థలోని లోటుపాట్లను పూడుస్తామని ఆమె పేర్కొన్నారు. ‘చేపలు పట్టడం కూడా వ్యవసాయమే. మత్స్యకార కుటుంబాలన్నీ గ్రామీణ భారతంలో భాగమే. అందుకే పీఎంఎంఎస్‌వై ద్వారా మత్స్యకార రంగం ఆధునీకరణ, ఉత్పత్తి పెంచడం, నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచడం, సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుల జాడను గుర్తించడం తదితర అంశాల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం’ అని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

దిగుమతి వ్యయం తగ్గించిన రైతన్న
ధాన్యం ఉత్పత్తిలో భారత్‌ స్వయంసమృద్ధిని సాధించడంలో అన్నదాత పాత్రను ప్రశంసిస్తూ.. ‘నూనె గింజల ఉత్పత్తిలోనూ మన రైతులు ఇవే ఫలితాలను పునరావృతం చేస్తారని భావిస్తున్నాం. అన్నదాతల సేవల కారణంగానే భారత దిగుమతి వ్యయాన్ని తగ్గించుకోగలిగాం’ అని అన్నారు. 10వేల కొత్త ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌పీవోలు) ఏర్పాటుచేయడం ద్వారా.. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తామని ఆమె పేర్కొన్నారు. రైతులకు అసలైన మద్దతు ధర అందిచేందుకు.. ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈనామ్‌)ల ద్వారా రైతులు లబ్ధిపొందేలా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని మంత్రి తెలిపారు.

జీరో బడ్జెట్‌పై..
జీరో బడ్జె్ట్‌ వ్యవసాయాన్ని అమలుచేసే అంశాన్నీ మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇప్పటికే ఈ దిశగా పలు రాష్ట్రాల్లోని రైతులకు శిక్షణనిచ్చామన్నారు. ‘75వ స్వాతంత్ర్య దినోత్సవం (2022) నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడంలో జీరో బడ్జెట్‌ వ్యవసాయం కీలకపాత్ర పోషిస్తుందని మేం సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం’ అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.You may be interested

గ్రామీణం 2.0

Saturday 6th July 2019

పల్లె అభివృద్ధికి మరింత జోష్‌ పలు కీలక పథకాలకు నిధుల జోరు స్వచ్ఛ భారత్, గ్రామీణ రోడ్ల లక్ష్యాలు పూర్తి మూడేళ్లలో మరో 1.95 కోట్ల గ్రామీణ ఇళ్ల నిర్మాణం న్యూఢిల్లీ: బంపర్‌ విజయంతో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మోదీ సర్కారు.. రెట్టించిన ఉత్సాహంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. పల్లెవాసులకు ఇళ్లు, రోడ్లు ఇతరత్రా మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో మొదలైన ప్రతిష్టాత్మక పథకాల్లో కొన్నింటి లక్ష్యాలు సాకారమయ్యాయి. దీంతో

ఎక్సైజ్‌, సర్వీస్‌ ట్యాక్స్‌ కేసులకు క్షమాపణ పథకం

Saturday 6th July 2019

రూ.3.75 లక్షల కోట్ల పెండింగ్‌ కేసుల పరిష్కారానికి చర్యలు న్యూఢిల్లీ: సేవల పన్ను, ఎక్సైజ్‌ సుంకాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న రూ.3.75 లక్షల కోట్ల విలువకు సంబంధించి కేసుల పరిష్కారానికి ప్రభుత్వం ‘సబ్‌కా విశ్వాస్‌ లెగసీ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ స్కీమ్‌ 2019’ అనే పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద పన్ను బకాయిల్లో 40 నుంచి 70 శాతం వరకు ఉపశమనం లభించనుంది. స్వచ్చందంగా వెల్లడించిన కేసులు కాకుండా ఇతర కేసులకు

Most from this category