News


ఆ మూడు లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!!

Wednesday 26th June 2019
news_main1561534531.png-26584

  • నిధుల బదిలీ మూడేళ్లపాటు జరగొచ్చు
  • కేంద్రానికి ఆర్‌బీఐ నిధులపై నొముర అంచనా
  • బ్యాంకులకిస్తేనే బాగుంటుందన్న బీఓఏ-ఎంఎల్‌

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి కేంద్రానికి బదలాయింపులు జరుగుతాయని భావిస్తున్న రూ.3 లక్షల కోట్ల వినియోగంపై అంచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిమాణంలో అధిక భాగం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ- నోమురా అంచనా వేసింది. నోమురా దీనిపై ఒక నివేదిక విడుదల చేస్తూ, ఆర్‌బీఐ నుంచి నిధుల బదలాయింపు ఒకేసారి జరక్కపోవచ్చని, వరుసగా మూడేళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అందివచ్చే నిధుల్లో 45 శాతం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని, 20 శాతాన్ని బ్యాంకుల మూలధన పెట్టుబడులకు వినియోగించుకునే వీలుందని నోమురా పేర్కొంది. ప్రభుత్వ రుణభారం 25 శాతానికి తగ్గించుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. వచ్చిన మొత్తంపై ఆధారపడి మిగిలిన 10 శాతం వ్యయాలు ఉంటాయని పేర్కొంది. 
బ్యాంకులకు ఇస్తే బాగుంటుంది: బీఆఫ్‌ఏ-ఎంఎల్‌
ఆర్‌బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ‘మూలధనం కొరతతో ఒబ్బందులు పడుతున్న’ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అందించేలా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ- బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా- మెరిలించ్‌ (బీఆఫ్‌ఏ-ఎంఎల్‌) ఇప్పటికే అభిప్రాయపడింది. ఆర్‌బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ప్రభుత్వానికి బదలాయించే అంశంపై సిఫారసులకు గత ఏడాది డిసెంబర్‌లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే కమిటీ సభ్యుల్లో వ్యక్తమవుతున్న విభేదాల కారణంగా నివేదిక ఆలస్యం అవుతోందని వార్తలు వస్తున్నాయి. జూలైలో నివేదిక సమర్పించవచ్చని సమాచారం. ‍ఆర్‌బీఐ వద్ద ఉన్న నిధుల్లో మూడు లక్షల కోట్లను కేంద్రానికి బదలాయించవచ్చని ఈ కమిటీ సిఫారసు చేయవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ తాజా నివేదిక అంచనా వేసింది. 
ఆర్‌బీఐ నిధులపై ఆధారపడక తప్పదా?
కేంద్రం ద్రవ్యలోటును ఎలా పూడ్చుకుంటుందనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్‌బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్‌బీఐ వద్ద జూన్‌ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్‌ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్‌ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో- డిసెంబర్‌ 10న వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకు ముందు నవంబర్‌ 19న జరిగిన ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం నిర్ణయించింది. శక్తికాంత్‌ దాస్‌ గవర్నర్‌ అయ్యాక డిసెంబర్‌లో జలాన్‌ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ కమిటీ కూడా ఏర్పాటయ్యింది. 
ఇప్పటికే మూడు కమిటీలు...
గతంలోనూ ఆర్‌బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్‌ (2004), వైహెచ్‌ మాలేగామ్‌ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్‌బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉఫా థోరట్‌ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. ఆర్‌బీఐ థోరట్‌ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్‌ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్‌బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. 



You may be interested

ఎస్‌బీఐ లైఫ్‌ ఓఎఫ్‌ఎస్‌లో పాల్గొంటారా?

Wednesday 26th June 2019

ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సూరెన్స్‌  ఆఫర్‌ ఫర్‌సేల్‌ ప్రకటించింది. ఈ ఓఎఫ్‌ఎస్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఒక్క షేరు రూ. 670 చొప్పున ఇస్తామని తెలిపింది. ఈ ధర సంస్థ ఐపీఓ ధర రూ. 700 కన్నా రూ. 30 తక్కువ. రెండేళ్ల క్రితం సంస్థ ఐపీఓకి వచ్చింది. ఇప్పుడు ఐపీఓ ధర కన్నా తక్కువకు షేరు లభించనుండడంతో పలువురు ఈ ఓఎఫ్‌ఎస్‌లో పాల్గొనాలని భావిస్తుంటారు. అయితే అనలిస్టులు

నేను చేసిన పెద్ద తప్పు అదే !

Wednesday 26th June 2019

ఆండ్రాయిడ్‌కు ధీటైన ఓఎస్ తేలేకపోయా  మైక్రోసాఫ్ట్‌ బిల్‌గేట్స్‌ వాషింగ్టన్‌: ఆండ్రాయిడ్‌ను అభివృద్ధి చేసే అవకాశం గూగుల్‌కు దక్కేలా చేయడం, ఆండ్రాయిడ్‌కు ధీటైన మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయారు చేసుకోలేకపోవడం తాను చేసిన అతి పెద్ద తప్పు అని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు. ఫలితంగా తమ కంపెనీకి 40,000 కోట్ల డాలర్ల నష్టం వచ్చిందని వివరించారు. ఆండ్రాయిడ్‌ను 5 కోట్ల డాలర్లకే ఎగరేసుకుపోయిన గూగుల్‌ నిజమైన విజేతగా నిలిచిందని పేర్కొన్నారు. వెంచర్‌

Most from this category