News


‘పల్లె’కు ఓకే..!

Sunday 2nd February 2020
news_main1580626178.png-31443

 • ఫ్లాగ్‌షిప్‌ పథకాలకు ఈసారీ నిధుల జోరు..
 • ఆర్థిక మందగమనం నేపథ్యంలో గ్రామాలపై దృష్టి...
 • ఇళ్లు, రోడ్ల నిర్మాణానికి కేటాయింపుల జోరు...
 • 2021 మార్చినాటికి మరో లక్ష పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌

ఆర్థిక మందగమనం ప్రభావం నుంచి గ్రామీణ భారతాన్ని గట్టెక్కించేందుకు మోదీ సర్కారు తాజా బడ్జెట్‌లో దండిగానే నిధులను కేటాయించింది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఖర్చుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. అయితే, గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే కొన్ని పథకాలకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. గ్రామీణ ఇళ్ల నిర్మాణం, రోడ్లపై అత్యధికంగా దృష్టిపెట్టింది. ఇప్పటికే కొన్ని పథకాల లక్ష్యాలు పూర్తవడంతో తదుపరి దశలను కూడా వేగంగా అమలు చేయనున్నట్లు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పల్లెల్లో 2022 మార్చినాటికి అదనంగా 1.95 కోట్ల ఇళ్లను నిర్మించేందుకు సుమారు రూ.1,56,634 కోట్లను వెచ్చించనున్నారు. మరో లక్ష గ్రామ పంచాయతీలకు రానున్న ఆర్థిక సంవత్సరం (2020–21)లోనే బ్రాడ్‌బ్యాండ్‌(ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌)ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మొత్తంమీద అటు వ్యవసాయంతో పాటు ఇటు గ్రామీణాభివృద్ధికి కూడా 2020-21 బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

గ్రామీణ సంక్షేమ పథకాలకు ఎంతంటే...
2020–21 కేటాయింపు: రూ.1,20,148 కోట్లు
2019–20 కేటాయింపు: రూ.1,17,647 కోట్లు (సవరించిన అంచనా(రూ.1.22 లక్షల కోట్లు)


‘ఉపాధి’కి హామీ... 
2020–21 కేటాయింపు: రూ.61,500 కోట్లు
2019–20 కేటాయింపు: రూ. 60,000 కోట్లు (సవరించిన అంచనా రూ.71,001 కోట్లు)

 • 2005లో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గతేడాది బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఈసారి స్వల్పంగా 2.5 శాతం పెరిగింది. అయితే, సవరించిన అంచనాలతో పోలిస్తే తగ్గింది భారీగాస్థాయిలోనే తగ్గింది.
 • దీనికి ప్రధాన కారణం చాలా రాష్ట్రాల్లో లక్ష్యాలను మించి ఉపాధి పనులను కల్పించడంతో అధికమొత్తంలో కేంద్రం నిధులను అందించాల్సి వచ్చింది.
 • ఏడాదిలో వందరోజుల పాటు కనీస ఉపాధి హామీని ఇవ్వడమే ఈ పథకం ప్రధానోద్దేశం. దీనిలోభాగంగా నైపుణ్యాల్లేని కార్మికుల ద్వారా ప్రభుత్వ భవనాలు, గ్రామీణ రోడ్ల నిర్మాణం ఇతరత్రా పనులను చేపడతారు. పంచాయతీ రాజ్‌ పటిష్టం చేయడమే పథకం ప్రధానోద్దేశం.


విద్యుత్తుకు మరింత ఊతం...
(దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ్‌ జ్యోతి యోజన)

2020–21 కేటాయింపు: రూ.4,500 కోట్లు
2019–20 కేటాయింపు: రూ.4,066 కోట్లు.

 • వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్‌ వినియోగదారులకు ప్రత్యేక ఫీడర్లు, డిస్కమ్‌లను అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్‌ సబ్‌-ట్రాన్స్‌మిషన్, పంపిణీ మౌలిక సదుపాయాల పెంపు... గ్రామీణ విద్యుదీకరణ కోసం ఈ పథకాన్ని రూపొందించారు.
 • దీనిలో భాగంగా 2017లో ఆరంభించిన సౌభాగ్య పథకం కింద 2.5 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్‌ను అందించారు..
 • ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌కు కేటాయింపులు రూ. 3970 కోట్ల నుంచి రూ. 5280 కోట్లకు పెంచారు.
 • ఉజాల స్కీమ్‌ కింద పేద, మధ్యతరహా కుటుంబాలకు ఉచితంగా 143 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను అందజేయాలని లక్ష్యం. ఇందులో ఇప్పటిదాకా 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను ఇచ్చారు.
 • ఎల్‌ఈడీ బల్బులతో ఏటా రూ.18,341 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు ఆదా అవుతున్నట్లు కేంద్రం చెబుతోంది.


పరుగులు పెడుతున్న పల్లె రోడ్లు..

2020–21 కేటాయింపు: రూ.19,500 కోట్లు
2019–20 కేటాయింపు: రూ. 19,000 కోట్లు (సవరించిన అంచనా రూ.14,071 కోట్లు)

 • 2000 డిసెంబర్‌ 25న దేశం రోడ్డు సదుపాయం లేని ప్రాంతాలకు (మైదాన ప్రాంతాల్లో 500 మించి జనాభా ఉన్నవి, కొండ ప్రాంతాల్లో 250కి మంచి జనాభా) పక్కా రోడ్లను నిర్మించాలని సంకల్పించారు.
 • పథకం ప్రారంభించిననాటి నుంచి ఇప్పటిదాకా 1,67,152 ప్రాంతాలకు దేశవ్యాప్తంగా రోడ్డు కనెక్టివిటీని కల్పించారు. లక్ష్యంలో ఇది 97.33 శాతాన్ని సాధించినట్లు లెక్క.
 • ఇక పీఎంజీఎస్‌వై రెండో దశలో భాగంగా ఇప్పటికే ఉన్న రోడ్లను మెరుగుపరడం, మావోయిస్టుల ప్రభావిత జిల్లాల్లో కల్వర్టులు, ఇతరత్రా సదుపాయాలను కల్పించడం వంటివి కూడా చేర్చారు.
 • మొత్తంమీద చూస్తే, 2019 డిసెంబర్‌ 31 నాటికి మొత్తం రెండు దశలకింద 6,08,899 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం, అప్‌గ్రేడేషన్‌ను పూర్తి చేశారు. ఇందుకు రూ.2,15,932 కోట్ల నిధులను ఖర్చుచేశారు.
 • మొత్తం 17.84 లక్షల ఆవాసాల్లో 15.8 లక్షల ఆవాసాలకు పక్కా రోడ్లు వచ్చాయి.
 • పీఎంజీఎస్‌వై ఫేజ్‌–3ను ఇప్పుడు అమలు చేస్తునానరు. ఆవాసాలను ఆస్పత్రులు, పాఠశాలలు, మార్కెట్లతో కలిపేందుకు లింక్‌ రోడ్ల నిర్మాణాలు, ఇప్పటికే నిర్మాణమైన రోడ్లను మెరుగుపరచడం వంటివి దీనిలో భాగం.
 • ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో 1,25,000 కిలోమీటర్ల రోడ్లను అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. దీనికి రూ.80,250 కోట్లు వెచ్చించనున్నారు. 2019–20లో 13 రాష్ట్రాలను ప్రధానంగా ఇందుకు ఎంపికచేశారు.


స్వచ్ఛ భారత్‌కు దన్ను...
2020–21 కేటాయింపు: రూ.12,300 కోట్లు
2019–20 కేటాయింపు(సవరించిన అంచనా): రూ. 9,638 కోట్లు.
 

 • 2014 అక్టోబర్‌ 2న గాంధీ జయంతి రోజున మొదలైన ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 9.6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు.
 • బహిరంగ మలవిసర్జన(ఓడీఎఫ్‌) అలవాటు దాదాపు కనుమరుగైంది. ఓడీఎఫ్‌ రహిత గ్రామాల సంఖ్య 5.6 లక్షలకు చేరింది.
 • గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98 శాతం శానిటేషన్‌ కవరేజ్‌ కల్పన.
 • పట్టణాల్లో 95 శాతం ఓడీఎఫ్‌ రహితంగా మారినట్లు అంచనా. ఇప్పుడు 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 • దేశవ్యాప్తంగా 1,700 నగరాలు, పట్టణాల్లో 45,000 ప్రజా, కమ్యూనిటీ మరుగుదొడ్లను గుర్తించేందుకు వీలుగా గూగుల్‌ మ్యాప్స్‌కు అనుసంధానించారు.
 • పూర్తిగా ఓడీఎఫ్‌ రహితంగా మారిన గ్రామాలు, పట్టణాల్లో దీన్ని కచ్చితంగా అమలయ్యేవిధంగా చూడటం కూడా ఈ పథకంలో భాగమే.
 • దేశంలోని ప్రతి గ్రామంలో ఘన వర్ధాల(చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా ఈ స్వచ్ఛ భారత్‌ పథకం కిందకు తీసుకొచ్చారు.


గ్రామీణ టెలిఫోనీ...
2020–21 కేటాయింపు: రూ.6,000 కోట్లు
2019–20 కేటాయింపు(సవరించిన అంచనా): రూ. 2,000 కోట్లు

 • భారత్‌ నెట్‌ ఫేజ్‌1 కింద 1,21,652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ పూర్తి. 1.16లక్షల పంచాయతీల్లో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
 • దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్‌బ్యాండ్‌ యాక్సెస్‌ లభించింది. దీన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని(పీపీపీ) జోడించనున్నారు.
 • ఐదు కోట్లమంది గ్రామీణులకు లబ్ది చేకూరేలా 5 లక్షల వైఫై స్పాట్స్‌ ఏర్పాటు లక్ష్యం.
 • 2020–21 ఆర్థిక సంవత్సరంలో మరో 1,00,000 గ్రామ పంచాయతీలకు ఫైబర్‌ ఆఫ్టిక్‌ నెట్‌వర్క్‌ను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్‌లో ప్రకటించారు.


‘జల్‌ జీవన్‌’తో స్వచ్ఛమైన నీరు....
2020–21 కేటాయింపులు: రూ.11,500 కోట్లు
2019–20 కేటాయింపులు: రూ. 10,001 కోట్లు

 • దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని(హ్యాండ్‌ పంపులు, పైపులు ఇతరత్రా మార్గాల్లో) అందించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం.
 • గతేడాది బడ్జెట్‌లో జల్‌ జీవన్‌ మిషన్‌ ను ప్రకటించారు. దీనిలోభాగంగా రూ.3.6 లక్షల కోట్ల నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సీతారామన్‌ బడ్జెట్‌లో తెలిపారు. ఈ ఏడాది రూ.11,500 కోట్లను కేటాయించినట్లు వివరించారు.
 • స్థానిక స్థాయిలో సమీకత డిమాండ్, సరఫరా నిర్వహణ యంత్రాంగం; వర్షపు నీటి ఒడిసిపట్టేందుకు తగిన మౌలిక వసతుల కల్పన, భూగర్భజలాల పెంపు, సముద్రపునీటిని మంచినీరుగా మార్చడం(డీశాలినేషన్‌) కూడా జల్‌జీవన్‌ మిషన్‌లో భాగమే.
 • 10 లక్షల జనాభా దాటిన నగరాలన్నింటినీ దీని అమలు కు ప్రోత్సహించనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.


ఇంటికి ఇంకాస్త ఆసరా...
2020–21 కేటాయింపులు: రూ.19,500 కోట్లు
2019–20 కేటాయింపులు(సవరించిన అంచనా): రూ. 18,475 కోట్లు 

 • ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై)లో భాగంగా 2022 కల్లా దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని బలహీనవర్గాలందరికీ పక్కా ఇళ్లను కట్టిఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ తాజా లక్ష్యం.
 • పీఎంఏవై తొలి దశను 2016–17 నుంచి 2018–19 వరకూ మూడేళ్లపాటు అమలుచేశారు. గడిచిన ఐదేళ్లలో 1.54 కోట్ల ఇళ్లను నిర్మించారు.
 • ఇప్పుడు రెండో దశ కింద 2019–20 నుంచి 2021–22 మధ్య 1.95 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.1,56,634 కోట్లను వెచ్చించనున్నారు.
 • అంతేకాదు ఈ ఇళ్లకు మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్‌ కనెక్షన్లు కూడా ఉచితంగా కల్పించనున్నారు. 

 

డిమాండ్‌ పుంజుకుంటుంది...
‘వృద్ధి మందగమనం నేపథ్యంలో పల్లెల్లో డిమాండ్‌ మందగించింది. దీన్ని చక్కదిద్దేందుకు మోదీ సర్కారు గ్రామీణాభివృద్ధి, మౌలికవసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం మంచి ఫలితాలిస్తుంది. దీనివల్ల ఎఫ్‌ఎంసీజీ రంగంలో కూడా వినియోగ డిమాండ్‌ పుంజుకోవడానికి దోహదం చేస్తుంది’.

 • వరుణ్‌ బెరీ, బ్రిటానియా ఇండస్ట్రీస్‌ ఎండీ  

 You may be interested

ఎన్‌ఆర్‌ఐ నిబంధనల సవరణ

Sunday 2nd February 2020

న్యూఢిల్లీ: విదేశాలలో పన్నులు చెల్లించని ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు) ఇకపై దేశీయంగా ఆదాయ పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇందుకు తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. దేశీయంగా పౌరసత్వం కలిగి ఉన్నప్పటికీ కొన్ని రోజులపాటు విదేశాలలో ఉండటం ద్వారా ఎన్‌ఆర్‌ఐ కేటగిరిలోకి వస్తున్న వ్యక్తులు ఏ దేశంలోనూ పన్నులు చెల్లించని పక్షంలో ఇకపై దేశీయంగా పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇందుకు తాజా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేపట్టారు. వెరసి భారతీయులై

కేంద్ర బడ్జెట్‌పై ‘తెలుగు పలుకులు’

Sunday 2nd February 2020

కేంద్ర ఆర్థిక బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వెల్లడించిన తెలుగు ప్రజలు ఉద్యోగులకు ఊరటనిచ్చినా.. 2 రకాల పన్నుల విధానం గందరగోళంగా ఉందని వ్యాఖ్యలు రియల్టీ రంగంపై పట్టించుకోలేదని, గృహ రుణాలకు రాయితీలు లేవని అసంతృప్తి సాక్షి, ముంబై: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మహారాష్ట్రలో ఉంటున్న తెలుగు ప్రజల్లో భిన్నస్వరాలు విన్పిస్తున్నాయి. అందరికీ ప్రాధాన్యం లభించిందని కొందరు పేర్కొంటుండగా మరోవైపు ఎల్‌ఐసీ వాటాలను విక్రయించేందుకు సిద్దమవడంతోపాటు అటోమొబైల్, టెలికాం రంగాల

Most from this category