News


క్రెడిట్‌ స్కోరును గుడ్డిగా అనుసరించొద్దు : కేంద్ర ఆర్థిక మంత్రి

Friday 28th February 2020
news_main1582860139.png-32150

  • శాఖల స్థాయిలో అనుసంధానత పెంచుకోవాలి
  • బ్యాంకులకు ఆర్థిక మంత్రి సీతారామన్‌ సూచన

న్యూఢిల్లీ/గువహటి: రుణ గ్రహీతలకు సంబంధించి క్రెడిట్‌ స్కోరు (రుణ చెల్లింపుల చరిత్ర)ను గుడ్డిగా నమ్మవద్దని, కేవలం ఓ సూచికగానే పరిగణించాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. కస్టమర్లతో శాఖల స్థాయిలో అనుసంధానత పెంపుపై దృష్టి పెట్టాలని కోరారు. ‘‘శాఖా బ్యాంకింగ్‌కు మళ్లీ మళ్లాలి. గతంలో మాదిరిగా శాఖల స్థాయిలో కస్టమర్లతో అనుసంధానత ఇప్పుడు లేదు. డేటా విశ్లేషణ, బిగ్‌ డేటా వినియోగాన్ని కోరుకుంటున్నప్పటికీ.. శాఖల స్థాయిల్లో కస్టమర్లు మీ నుంచి వ్యక్తిగత స్పందనను కోరుకుంటారు’’ అని ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో గురువారం జరిగిన సమావేశంలో మంత్రి పేర్కొన్నారు. ఆర్‌బీఐ కానీ, ప్రభుత్వం కానీ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలను గుడ్డిగా అనుసరించాలంటూ ఎటువంటి ఆదేశాన్ని జారీ చేయలేదన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కస్టమర్లతో వ్యక్తిగత అనుసంధానత, డేటాను వినియోగించుకోవడం అవసరమన్నారు. శాఖల స్థాయిల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనలను విని, వారిలో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచాలని బ్యాంకు  ఉన్నతోద్యోగులను ఆమె కోరారు. సిబ్బందితో మాట్లాడి, వారు చెప్పేది వినకపోతే, రుణ వితరణ పెరగదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఈ రంగం, బ్యాంకింగ్‌ అంశాలపై మంత్రి గురువారం రెండు వేర్వేరు భేటీలు నిర్వహించారు.  
రుణ వితరణను పెంచాలి...
రుణాల పంపిణీని మరింత పెంచాలని బ్యాంకుల చీఫ్‌లను మంత్రి సీతారామన్‌ కోరారు. వ్యవస్థలో తగినంత డిమాండ్‌ లేదంటూ వారు చెప్పినప్పటికీ.. రుణ వితరణ పెంపు దిశగా తగిన విధానాలను చేపట్టాలని ఆమె కోరడం గమనార్హం. 
పెట్టుబడులపై సీఏఏ ఆందోళనల ప్రభావం ఉండదు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు, ఢిల్లీలో జరిగిన హింసాత్మక చర్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయలేవని మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో ఇటీవల తాను భేటీ అయిన ఇన్వెస్టర్లు భారత్‌లో మరిన్ని పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారన్నారు. ఇప్పటికైతే కరోనా వైరస్‌ ప్రభావం మన దేశంపై లేదన్నారు. వచ్చే రెండు నెలల్లో పరిస్థితి మెరుగుపడకపోతే పరిశ్రమకు చేదోడుగా పరిష్కార చర్యలపై దృష్టి సారిస్తామని చెప్పారు.
 


1.18 లక్షల రుణ దరఖాస్తులను పరిష్కరించాలి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద పెండింగ్‌లో ఉన్న 1.18 లక్షల దరఖాస్తులను మార్చి 15వ తేదీలోగా పరిష్కరించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. రుణ సాయంతో స్వయం ఉపాధి కింద వ్యాపార సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడమే పీఎంఈజీపీ పథకం ఉద్దేశ్యం. ఎంఎస్‌ఎంఈ రంగ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఎంఎస్‌ఎంఈ రుణాల పునరుద్ధరణపై కూడా చర్చించారు. 
 



You may be interested

నెలకు 11 జీబీ డేటా!!

Friday 28th February 2020

- భారతీయుల సగటు వినియోగం - చౌక డేటా ప్లాన్లు, హ్యాండ్‌సెట్స్‌ ఊతం - నోకియా నివేదిక న్యూఢిల్లీ: చౌక డేటా ప్లాన్లు, అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్లు, వీడియో సేవలు, 4జీ నెట్‌వర్క్‌ విస్తరించడం తదితర అంశాల ఊతంతో దేశీయంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం నెలకు సగటున 11 జీబీ స్థాయిలో వినియోగం ఉంటోంది. టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా రూపొందించిన వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్

డెట్‌ ఫండ్స్‌లోనూ ఈక్విటీల మాదిరి రిస్క్‌

Friday 28th February 2020

డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు ఇక మీదట అయినా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాలని ఇటీవలి పరిణామాలు సూచిస్తున్నాయి. ఇటీవలి క్రెడిట్‌ సంక్షోభం మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు, ఇన్వెస్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు లేదా క్రెడిట్‌ ఏజెన్సీలకు ఒక పాఠం వంటిదని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.   ‘‘గడిచిన 18 నెలల్లో చాలా వరకు రుణ ఎగవేతలు వ్యాపారణ కారణాల వల్ల కాకుండా పాలనా నిర్వహణ కారణాలతో జరగడాన్ని చూశాం. మ్యూచువల్‌ ఫండ్స్‌ వీటిని

Most from this category