News


మరింత సరళంగా జీఎస్టీ

Tuesday 25th December 2018
news_main1545722432.png-23221

మరింత సరళంగా జీఎస్టీ!
12, 18 శాతం శ్లాబులను కలిపేయాలన్న జైట్లీ
క్రమబద్ధీకరణ అవసరమని అభిప్రాయం
31 శాతం పన్నుతో దేశాన్ని కాంగ్రెస్‌ అణిచేసిందని విమర్శ

న్యూఢిల్లీ: త్వరలో జీఎస్టీ మరింత సరళంగా మారనున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంకేతాలిచ్చారు. జీఎస్టీలో 12, 18 శాతం పన్ను శ్లాబులను ఒక్కటి చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘ఆదాయం పెరుగుదల నేపథ్యంలో సాధారణ వినియోగ వస్తువులకు 12- 18 శాతం మధ్య ఒక్కటే ప్రామాణిక పన్ను రేటును భారత్‌ కలిగి ఉండాలి. కనీస అవసరాలపై సున్నా శాతం, ఐదు శాతం పన్నుతోపాటు, లగ్జరీ ఉత్పత్తులపై ఉన్న 28 శాతం పన్ను రేటు కూడా ఉంటాయి’’ అని జైట్లీ చెప్పారు. ఈ మేరకు ‘18 నెలల జీఎస్టీ’ పేరుతో ఫేస్‌బుక్‌లో మంత్రి ఓ పోస్ట్‌ పెట్టారు. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘‘1216 కమోడిటీలు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. ఇందులో 183పై సున్నా పన్ను రేటు అమలవుతోంది. 308 కమోడిటీలపై 5 శాతం, 178పై 12 శాతం, 517పై 18 శాతం రేటుంది. సంపన్న, హానికారక వస్తువులు, ఆటో విడిభాగాలు, డిష్‌ వాషర్లు, ఎయిర్‌ కండీషనర్లు (ఏసీలు), సిమెంట్‌పై 28 శాతం పన్ను ఉంది. జీఎస్టీకి మారడం పూర్తవడంతో మొదటి విడత రేట్ల క్రమబద్ధీకరణకు చేరువయ్యాం. సంపన్న, హానికారక వస్తువులపై తప్పు మిగిలిన వాటిపై 28 శాతం పన్ను రేటు తొలగిస్తాం’’ అని అరుణ్‌ జైట్లీ తన పోస్ట్‌లో వివరించారు. 28 శాతం రేటులో సాధారణంగా వినియోగించే సిమెంట్‌, ఆటో విడిభాగాలే ఉన్నాయని, తదుపరి సమావేశంలో సిమెంట్‌ను 28 శాతం నుంచి మార్చుతామని చెప్పారు. 12, 18 శాతం పన్ను రేట్ల స్థానంలో మధ్యస్థంగా ఒకటే రేటు ఏర్పాటుకు రోడ్‌మ్యాప్‌ రూపొందించాల్సి ఉందని, ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. పన్ను ఆదాయం గణనీయంగా పెరగాల్సి ఉందన్నారు.
పన్నులు తగ్గాయి
జీఎస్టీపై వస్తున్న విమర్శలను జైట్లీ తిప్పికొట్టారు. నూతన పన్ను చట్టంతో పన్ను రేట్లు దిగిరావడంతోపాటు, ద్రవ్యోల్బణం, ఎగవేతలు తగ్గుముఖం పట్టాయన్నారు. ‘‘పన్ను రేట్లు తగ్గాయి. పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగింది. అధిక వసూళ్లు, వ్యాపారం సులభతరం అయ్యాయి. పన్ను క్రమబద్ధీకరణ అధిక భాగం పూర్తయింది. వృద్ధి శాతం రానున్న సంవత్సరాల్లో పెరుగుతుంది’’ అని జైట్లీ చెప్పారు. గత శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం 23 వస్తువులపై జీఎస్టీ రేటును తగ్గిస్తూ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో పలు వస్తువులను 28 శాతం రేటు నుంచి తక్కువ రేటు పరిధిలోకి తీసుకొచ్చింది. జీఎస్టీకి ముందు అధిక శాతం కమోడిటీలపై పరోక్ష పన్నులు అన్నీ కలిపి 31 శాతం వరకు ఉండేవన్న విషయాన్ని జైట్లీ గుర్తు చేశారు. ‘‘దేశాన్ని 31 శాతం పరోక్ష పన్ను రేటుతో అణిచేసిన వారు జీఎస్టీని తప్పకుండా పరిశీలించి ఉండాల్సింది. బాధ్యతలేని రాజకీయాలు, బాధ్యతారాహిత్య ఆర్థిక విధానాలు పతనానికే దారితీస్తాయి’’ అంటూ కాంగ్రెస్‌ను విమర్శించారు. జీఎస్టీ ఆదాయం గురించి వివరిస్తూ... ఆరు రాష్ట్రాలు ఆదాయ వృద్ధి లక్ష్యాలను చేరుకున్నాయని, ఏడు రాష్ట్రాలు లక్ష్యానికి సమీపంలో ఉన్నాయని చెప్పారు. ఇక ఆదాయ వసూలు లక్ష్యాలకు 18 రాష్ట్రాలు దూరంలో ఉండిపోయినట్టు పేర్కొన్నారు. మొదటి ఏడాదిలో జీఎస్టీ వసూళ్లు నెలవారీ సగటున రూ.89,700 కోట్లుగా ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.97,100 కోట్లకు పెరుగుతాయని చెప్పారు.You may be interested

గవర్నర్‌ తన ధర్మాన్ని పాటించాలి

Tuesday 25th December 2018

ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడాలి: సి.రంగరాజన్‌ ముంబై: ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడే విషయంలో నూతన గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తన ధర్మాన్ని అనుసరించాలని మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌ సూచించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులైన తొలి ప్రభుత్వ అధికారి శక్తికాంతదాస్‌ కాదని చెప్పారాయన. ‘‘చాలా మంది ఢిల్లీ అధికారులు ఆర్‌బీఐలోకి వచ్చారు. ఇదే తొలిసారి కాదు. ఒక్కసారి వారు బాధ్యతలు చేపట్టాక ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడేందుకే కృషి చేశారు’’ అని రంగరాజన్‌ వ్యాఖ్యానించారు. ఇది ధర్మం

రెడియంట్‌ లైఫ్‌ కేర్‌ చేతికి మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌...

Tuesday 25th December 2018

విలీన కంపెనీ విలువ రూ.7,242 కోట్లు దేశవ్యాప్తంగా 16 ఆస్పత్రులు, 3,200 బెడ్స్‌ న్యూఢిల్లీ: హాస్పిటల్ చెయిన్ మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ను ఆస్పత్రుల నిర్వహణ సంస్థ రేడియంట్ లైఫ్‌కేర్‌ కొనుగోలు చేయనుంది. ఈ రెండింటి విలీనం ద్వారా ఏర్పడే సంస్థ విలువ సుమారు రూ.7,242 కోట్లుగా ఉండనుంది. పలు లావాదేవీలతో ఈ డీల్‌ జరగనుంది. ప్రస్తుతం రేడియంట్ లైఫ్‌ కేర్‌కు దన్నుగా ఉంటున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్... ఇకపై విలీన సంస్థలో మెజారిటీ

Most from this category