News


ఆరవ నెలా ‘ఎగుమతుల’ ఆందోళన!

Saturday 15th February 2020
news_main1581737166.png-31809

  • వృద్ధిలేకపోగా -1.66 శాతం క్షీణత
  • 25.97 బిలియన్‌ డాలర్లుగా నమోదు
  • దిగుమతుల ఎనిమిది నెలల క్షీణబాట 
  • విలువలో 41.14 బిలియన్‌ డాలర్లు
  • వాణిజ్యలోటు 15.17 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: దేశం నుంచి జరుగుతున్న ఎగుమతులపై ఆందోళన కొనసాగుతోంది. ఆరు నెలల నుంచీ వృద్ధిలేకపోగా జారుడు బల్లపై (క్షీణ బాటన) ఎగుమతులు కొనసాగుతుండడం దీనికి కారణం. తాజా సమీక్షా నెల- 2020 జనవరిని చూస్తే, 2019 ఇదే నెలతో పోల్చి ఎగుమతులు 1.66 శాతం క్షీణించాయి. విలువలో ఎగుమతుల విలువ 25.97 బిలియన్‌ డాలర్లు. ఇక దేశంలో ఆర్థిక మందగమనాన్ని సూచిస్తూ, దిగుమతులూ వరుసగా ఎనిమిదవ నెల క్షీణ బాటన నిలిచాయి. 0.75 శాతం క్షీణతతో 41.14 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు-దిగుమతుల విలువల మధ్య నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు 15.17 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...

 

  • పెట్రోలియం ప్రొడక్ట్స్ (-7.42 శాతం), ప్లాస్టిక్‌ - 10.62 శాతం), కార్పెట్‌ (-5.19 శాతం), రత్నాలు (-6.89 శాతం), ఆభరణాలు (-7.5 శాతం) , తోలు ఉత్పత్తుల (-7.4 శాతం) ఎగుమతులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. 
  • ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో దాదాపు 18 ప్రతికూల ఫలితాలనే నమోదుచేసుకున్నాయి. 
  • పసిడి దిగుమతులు దాదాపు 9 శాతం పడిపోయి 1.58 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 
  • చమురు దిగుమతుల విలువ 15.27 శాతం పెరిగి 12.97 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. చమురేతర దిగుమతుల విలువ 6.72 శాతం పడిపోయి 28.17 బిలయన్‌ డాలర్లకు చేరింది. 


10 నెలల్లోనూ క్షీణతే...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019 ఏప్రిల్‌ నుంచి 2020 జనవరి వరకూ చూస్తే, ఎగుమతులు 1.93 శాతం పడిపోయి 265.26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులూ క్షీణబాటలోనే పయనించి 8.12 శాతం పతనంతో 398.53 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 133.27 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 


డిసెంబర్‌లో సేవల ఎగుమతులు విలువ 20 బిలియన్‌ డాలర్లు...
మరోవైపు డిసెంబర్‌ దేశ సేవల ఎగుమతుల గణాంకాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. జనవరిలో సేవల ఎగుమతుల విలువ 20 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇదే నెల్లో సేవల దిగుమతుల విలువ 12.56 బిలియన్‌ డాలర్లు. 



You may be interested

భారత సీఈఓలతో 25న ట్రంప్‌ భేటీ

Saturday 15th February 2020

ఢిల్లీలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ఇరు దేశాల వాణిజ్య బంధం మరింత బలపడటం కోసం ఫిబ్రవరి 25న ఢిల్లీలో ఆయన కార్పొరేట్‌ ప్రముఖులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన్ను కలిసేందుకు సిద్దంగా ఉన్న దిగ్గజ సీఈఓల జాబితాలను భారత పరిశ్రమల

ఉల్లి, ఆలూ ధరలు ప్రియం

Saturday 15th February 2020

టోకు ధరల సూచీపై ఆహార ధరల ఎఫెక్ట్‌ జనవరిలో డబ్ల్యూపీఐ 3.1 శాతం మందగమనాన్ని సూచిస్తున్న తయారీ పెరుగుదల కేవలం 0.34 శాతం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి గణాంకాలు ఒకవైపు ఆహార ధరల తీవ్రతను, మరోవైపు కీలక తయారీ రంగంలో మందగమనాన్ని సూచించాయి. 2020 జనవరిలో సూచీ రేటు మొత్తంగా 3.1 శాతంగా నమోదయితే, ఒక్క తయారీ రంగంలో ధరల పెరుగుదల రేటు 0.34 శాతంగా ఉంది. కాగా

Most from this category