News


ఎకానమీకి వైరస్‌!!

Thursday 13th February 2020
news_main1581565043.png-31738

  • ప్రపంచ వృద్ధి రేటు అంచనాలు కట్‌
  • 2.2 శాతానికి కుదించిన ఈఐయూ
  • కరోనా భయాలే కారణం

న్యూఢిల్లీ: చైనాలో బైటపడిన కరోనా వైరస్‌ ధాటికి ఈ ఏడాది ప్రపంచ ఎకానమీ వృద్ధి కుంటుపడనుంది. 2020లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 2.3 శాతం నుంచి 2.2 శాతానికి కుదిస్తున్నట్లు ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఒక నివేదికలో వెల్లడించింది. "ప్రపంచ ఎకానమీకి కరోనా వైరస్‌ ముప్పుగా పరిణమించింది. ఇది మరింతగా ప్రబలకుండా నివారించేందుకు చైనా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రిస్కులు పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వృద్ధి అంచనాలను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది" అని ఈఐయూ పేర్కొంది. వాణిజ్య యుద్ధ భయాల మూలంగా 2019లో ప్రపంచ వృద్ధి మందగించిన సంగతి తెలిసిందే. యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాల్లో రాజకీయ అనిశ్చితి, అమెరికా.. చైనాలతో పాటు భారత్‌లోనూ స్థూల దేశీయోత్పత్తి మందగించింది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తగ్గి, కొత్త ఏడాదిలో పరిస్థితులు చక్కబడవచ్చని సర్వత్రా ఆశాభావం వ్యక్తమవుతున్న తరుణంలో హఠాత్తుగా కరోనా వైరస్‌ తెరపైకి రావడం గమనార్హం. చైనా హుబెయ్‌ ప్రావిన్స్‌లోని వుహాన్ నగరంలో బైటపడిన ఈ వైరస్‌ ఆ దేశంతో పాటు ఇతరత్రా పలు దేశాలకు కూడా విస్తరించడం ప్రస్తుతం అందర్నీ కలవరపెడుతోంది. వైరస్ ప్రతికూల ప్రభావాల కారణంగా చైనా వృద్ధి రేటు అంచనాలను కూడా ఈఐయూ తగ్గించింది. "మార్చి ఆఖరు నాటికల్లా వైరస్‌ వ్యాప్తి.. అదుపులోకి రాగలదని భావిస్తున్నాం. దీనికి అనుగుణంగా 2020లో చైనా వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలను ముందుగా పేర్కొన్న 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిస్తున్నాం" అని ఈఐయూ తెలిపింది. 

భారత్‌పై బుల్లిష్‌...
ప్రపంచ ఎకానమీ, చైనా విషయంలో నిరుత్సాహపర్చే అంచనాలు ప్రకటించిన ఈఐయూ.. భారత్‌పై మాత్రం బులిష్‌ ధోరణి కనపర్చింది. కరోనా వైరస్‌ తాకిడి భారత్‌లో గణనీయంగా విస్తరించని పక్షంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు చాలా మెరుగ్గా ఉండగలదని పేర్కొంది. "అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో జీ7, బ్రిక్స్ కూటమి దేశాల్లో భారత వృద్ధి రేటు అత్యుత్తమంగా, జపాన్‌ వృద్ధి కనిష్టంగా ఉంది. భారత్‌ విషయానికొస్తే.. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు, చౌక వడ్డీ రేట్లతో 2020లో డిమాండ్‌, పెట్టుబడులకు ఊతం లభించవచ్చు. ఫలితంగా జీడీపీ వృద్ధి కోలుకుని 6.1 శాతంగా ఉండొచ్చు. (2019లో ఇది 4.9 శాతంగా ఉండొచ్చని అంచనా). కరోనా వైరస్‌.. భారత్‌లో విస్తరించకపోతే ఇది సాధ్యమే" అని ఈఐయూ తెలిపింది. 


మిగతా దేశాలకు ముప్పు...
వైరస్‌ ప్రబలకుండా సమర్ధంగా అరికట్టగలిగే వనరులు లేని దేశాలకు కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే రిస్కులు ఉన్నాయని ఈఐయూ హెచ్చరించింది. 2002-03లో ఇదే తరహాలో సార్స్ వైరస్ వచ్చినప్పుడు చేసిన శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. మరోవైపు, కరోనావైరస్‌ సంబంధిత భయాల కారణంగా జనవరి మధ్య నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 10 డాలర్ల పైగా పడిపోయాయని ఈఐయూ వివరించింది. ఈ నేపథ్యంలో 2020లో ముడి చమురు సగటు ధరలను బ్యారెల్‌కు 65 డాలర్ల నుంచి 63 డాలర్లకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. పరిస్థితులు మరింత దిగజారిన పక్షంలో బ్రెంట్‌ బ్లెండ్ రేట్లు.. బ్యారెల్‌కు మరో 3-5 డాలర్ల దాకా పడిపోవచ్చని ఈఐయూ పేర్కొంది. 
 You may be interested

యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులకు పీఈ సంస్థల ఆసక్తి- షేరు జూమ్‌

Thursday 13th February 2020

4.5 శాతం జంప్‌చేసిన షేరు 14న క్యూ3 ఫలితాల విడుదల పెట్టుబడులకు 3 పీఈ సంస్థల ఆసక్తి నిధుల సమీకరణ సన్నాహాలలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలను ఈ నెల 14(శుక్రవారం)కల్లా విడుదల చేయనున్నట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌) ఫలితాలతోపాటు.. తొమ్మిది నెలల(ఏప్రిల్‌-డిసెంబర్‌) పనితీరును సైతం వెల్లడించనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు

ధరలు పైపైకి..!

Thursday 13th February 2020

వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం చూస్తే, 2020 జనవరిలో భారీగా 7.59 శాతం పెరిగింది. అంటే 2019 జనవరితో పోల్చితే నిత్యావసర వస్తువుల బాస్కెట్‌ రిటైల్‌ ధర భారీగా 7.59 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఆరేళ్లలో (2014 మేలో 8.33 శాతం) ఈ స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి.  కట్టుదాటి...! రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్‌ 2’

Most from this category