News


గేరు మార్చు... స్పీడు పెంచు

Friday 5th July 2019
news_main1562317185.png-26822

- భారత్‌ టేకాఫ్‌కు ఇదే సరైన సమయం
- నిలకడగా 8 శాతం వృద్ధి సాధించాలి
- ఇందుకు సంస్కరణల ఊతం కావాలి
- అప్పుడే 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ సాధ్యం
- ప్రైవేట్‌ పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాలే కీలకం
- ఈసారి వృద్ధి రేటు మాత్రం 7 శాతంగా ఉండొచ్చు
- చమురు ధరలు మరింత తగ్గే అవకాశముంది
- పెరగనున్న డిమాండ్, బ్యాంక్‌ రుణాలు
- చిన్న సంస్థలు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలి
- ఎకానమీపై ఆర్థిక సర్వే సూచనలు

న్యూఢిల్లీ: అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం మళ్లీ పుంజుకోనుంది. అయితే, 2024–25 నాటికి నిర్దేశించుకున్న 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్‌ ఎదగాలంటే మాత్రం... ఇటు పెట్టుబడులకు, అటు సంస్కరణలకు తోడ్పడేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. తద్వారా నిలకడగా 8 శాతం స్థాయిలో అధిక వృద్ధి సాధిస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోగలిగే పరిస్థితి లేదు. ఈ దిశగా ప్రైవేట్‌ పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాల కల్పన పెరగటమనేది చాలా కీలకంగా నిలవనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ అంశాలను వెల్లడించింది. బడ్జెట్‌కు ముందురోజు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే...  ఇటు ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించడంతో పాటు భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలకు కూడా దిశానిర్దేశం చేసేదిగా ఉంటుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం (నేడు) పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎకనమిక్‌ సర్వేకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. 
పుంజుకోనున్న పెట్టుబడులు .. 
ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం 2018-19లో 6.8 శాతానికి క్షీణించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2019–20లో 7 శాతం స్థాయిలో నమోదు కానుంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు అయిదేళ్ల కనిష్ట స్థాౖయి అయిన 5.8 శాతానికి పడిపోయింది. ఇది చైనా నమోదు చేసిన 6.4 శాతం వృద్ధి కన్నా తక్కువ కావడం గమనార్హం.  ఇక 2011–12 నుంచి క్రమంగా తగ్గుతున్న పెట్టుబడుల రేటు.. ప్రస్తుతం కనిష్ట స్థాయికి చేరుకుందని, ఇక నుంచి మళ్లీ పుంజుకోగలదని ఆర్థిక సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే వినియోగదారుల డిమాండ్, బ్యాంకుల రుణాలు సైతం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని సర్వే తెలియజేసింది. అయితే, పన్ను వసూళ్లు, వ్యవసాయ రంగంపై పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాల కారణంగా ద్రవ్యపరమైన ఒత్తిళ్లు తప్పకపోవచ్చని వివరించింది. ప్రస్తుతం 2.7 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో భారత ఎకానమీ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. వచ్చే ఏడాది బ్రిటన్‌ను దాటేసి అయిదో స్థానానికి చేరొచ్చన్న అంచనాలున్నాయి. 
రుతుపవనాలు కీలకం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు ధరలు తగ్గవచ్చని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ జీడీపీలో దాదాపు 60 శాతంగా ఉన్న వినియోగానికి ఇది ఊతమివ్వగలదని పేర్కొంది. కాకపోతే వినియోగం మందగించే రిస్కులున్నాయని హెచ్చరించింది. "వ్యవసాయ రంగం రికవరీ, వ్యవసాయోత్పత్తుల ధరలే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగానికి కీలకం కానున్నాయి. రుతుపవనాల పరిస్థితి వీటన్నింటినీ నిర్దేశిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ స్థాయికన్నా తక్కువగా వర్షపాతం నమోదు కావొచ్చు. ఇది పంటల దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు" అని సర్వే పేర్కొంది.
కార్మిక సంస్కరణలు ప్రధానం ...
డిమాండ్‌కు ఊతమివ్వాలన్నా, సామర్ధ్యాన్ని మెరుగుపర్చుకోవాలన్నా, కార్మిక ఉత్పాదకత పెరగాలన్నా ప్రైవేట్‌ పెట్టుబడులు కీలకమని సర్వే తెలిపింది. ఇవే కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టేందుకు, ఉద్యోగాల కల్పనకు తోడ్పడగలవని వివరించింది. ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్మిక రంగం మొదలైన వాటిల్లో వ్యవస్థాగత సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఇక లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు ప్రధానంగా ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఈ రంగం నుంచే వృద్ధికి మరింత ఊతం లభించగలదని ఆర్థిక సర్వే వివరించింది. "దేశీయంగా రాజకీయ స్థిరత్వం నెలకొనడంతో ఎకానమీ వృద్ధికి ఊతం లభించగలదు. సామర్ధ్యాలను సమర్ధంగా వినియోగించుకోవడం, వ్యాపార అవకాశాలు మెరుగుపడటం వంటి అంశాలు 2019–20లో పెట్టుబడుల కార్యకలాపాలు పెరగడానికి దోహదపడగలవు" అని సర్వే నివేదిక పేర్కొంది. 
ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి: సీఈఏ సుబ్రమణియన్‌
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే రూపకర్త, ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్‌ స్పష్టం చేశారు. అలా కాకుండా ప్రభుత్వమే భారీగా రుణాలు సమీకరిస్తూ పోతే పెట్టుబడులకు అవకాశాలు దెబ్బతింటాయని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. "అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. నిధుల లభ్యత బాగుంది. కాబట్టి ఇటు ప్రైవేట్‌ సంస్థలు, అటు ప్రభుత్వం రుణాల సమీకరణ కోసం అటువైపు దృష్టి పెట్టొచ్చు. అలాగే, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు కూడా తీసుకోవచ్చు. 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే జీడీపీలో పెట్టుబడులనేవి 30 శాతానికి పైగా ఉండాలి. చైనాలో ఇది 50 శాతానికి చేరింది. ప్రస్తుతం మన దగ్గర 29.6 శాతంగా ఉన్న పెట్టుబడుల రేటును 35 శాతం దాకానైనా పెంచుకోవాలి" అని సుబ్రమణియన్‌ చెప్పారు. "మన వృద్ధి రేటు బాగానే ఉంది. కానీ నిలకడగా 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే మనం గేర్లు మార్చాలి. టేకాఫ్‌ తీసుకోవడానికి ఇదే సరైన సమయం" అని ఆయన పేర్కొన్నారు. 
నిరాశావాద సర్వే: చిదంబరం
రంగాల వారీగా వృద్ధి అంచనాలను ఆర్థిక సర్వేలో పొందుపర్చలేదంటూ మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలపై ప్రభుత్వం నిరాశాపూరితంగా ఉన్నట్లుగా అనిపిస్తోందన్నారు. "ఆర్థిక సర్వేలో ప్రధానంగా కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయన్నారు. 1. మందగిస్తున్న వృద్ధి 2. ఆదాయం తగ్గుదల 3. ద్రవ్య లోటు లక్ష్య సాధనలో రాజీపడకుండా వనరులు వెతుక్కోవాల్సిన పరిస్థితి 4. కరెంటు ఖాతాపై చమురు ధరల ప్రభావం 5. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సులు. వీటిల్లో ఏ ఒక్కటీ కూడా ఆశావహంగానూ, సానుకూలంగానూ లేవు. ఆర్థిక సర్వే ద్వారా ఎకానమీ చాలా నిరాశాపూరితంగా ఉందని ప్రభుత్వం చెప్పదల్చుకున్నట్లుగా అనిపిస్తోంది" అని చిదంబరం వ్యాఖ్యానించారు. 

సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలివీ..
– ఒప్పందాలు సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు న్యాయవ్యవస్థలో సంస్కరణలు తేవాలి. పెట్టుబడులను ఆకర్షించే విధంగా సంస్కరణలు ఉండాలి.
– 2018–19లో ద్రవ్య లోటు 3.4 శాతంగా నమోదు కావొచ్చు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ద్రవ్య లోటు 5.8 శాతంగా ఉండొచ్చని అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 6.4 శాతంగా నమోదైంది.
– రాజకీయ స్థిరత్వం వృద్ధి అవకాశాలకు సానుకూలాంశం. పెట్టుబడులు, వినియోగమే ఎకానమీ వృద్ధికి ఊతమివ్వనున్నాయి. 
– 2024–25 నాటికి భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే (ప్రస్తుత స్థాయికి రెట్టింపు) నిలకడగా 8 శాతం వృద్ధి రేటు నమోదు చేయాల్సి ఉంటుంది. పొదుపు, పెట్టుబడులు, ఎగుమతుల ద్వారానే ఇది సాధ్యపడగలదు.
– చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) మరింత ఎదిగేందుకు, ఉద్యోగాలు కల్పించేందుకు, ఉత్పాదకత పెంచుకునేందుకు అనువైన విధానాలు ఉండాలి. ఎప్పటికీ చిన్న స్థాయిలోనే ఉండిపోయే సంస్థల కన్నా భవిష్యత్‌లో భారీగా ఎదిగే సత్తా ఉన్న అంకుర సంస్థలను ప్రోత్సహించాలి.
– వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్యంపై పెట్టుబడులు పెంచాలి. రిటైర్మెంట్‌ వయస్సును కూడా దశలవారీగా పెంచాలి.
– తక్కువ జీతభత్యాలు, వేతనాల్లో అసమానతలే సమ్మిళిత వృద్ధి సాధనకు అవరోధాలుగా ఉంటున్నాయి. వీటిని సరి చేసేందుకు చట్టపరమైన సంస్కరణలు, స్థిరమైన విధానాలు అవసరం. 
– కాంట్రాక్టుల అమలయ్యేలా చూసేందుకు సరైన వ్యవస్థ లేకపోవడమే వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో ర్యాంకులను మెరుగుపర్చుకోవడానికి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. You may be interested

ఆర్‌బీఐ ముందే మేల్కొని ఉండాల్సింది

Friday 5th July 2019

ప్రభుత్వం, బ్యాంకులు సైతం విఫలమయ్యాయి బ్యాంకింగ్‌ సమస్యలపై ఉర్జిత్‌ పటేల్‌ వ్యాఖ్యలు ముంబై: దేశ బ్యాంకింగ్‌ రంగంలో ప్రస్తుతం నెలకొన్న భారీ మొండి బకాయిల (ఎన్‌పీఏలు) సమస్య వెనుక బ్యాంకులు, ప్రభుత్వంతో పాటు భారతీయ రిజర్వు బ్యాంకు వైఫల్యం కూడా ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అంగీకరించారు. బ్యాంకులు పెద్ద మొత్తాల్లో రుణాలను ఇచ్చేశాయని, ఈ విషయంలో ప్రభుత్వం సైతం తన పాత్రను సమర్థంగా పోషించలేకపోయిందని చెప్పారాయన. ‘‘ఆఖరుకు ఆర్‌బీఐ

మార్కెట్లో నెగిటివ్‌ రియాక‌్షన్‌

Friday 5th July 2019

కొత్త బడ్జెట్‌ పూర్తయిన తర్వాత దేశీయ మార్కెట్లు నెగిటివ్‌ మూడ్‌లోకి మారాయి. ఒక దశలో సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 11800 పాయింట్ల దిగువన 11798 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 11840 పాయింట్ల వద్ద నిఫ్టీ, 39600 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ కదలాడుతున్నాయి. అడ్వాన్స్‌, డిక్లైన్‌ నిష్పత్తి 845:1298గా ఉంది. ఐబీహౌసింగ్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌ లాభాల్లో ఉండగా, యస్‌బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీలు నష్టాల్లో ఉన్నాయి. రంగాల

Most from this category