News


ఎనానమీపై ‘కరోనా’ ఎటాక్‌!

Wednesday 29th January 2020
news_main1580267384.png-31278

  • ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా వైరస్‌
  • ఆర్థిక వ్యవస్థలకు మరింత ముప్పు వృద్ధి భయాలతో కుప్పకూలుతున్న స్టాక్‌ మార్కెట్లు
  • సురక్షిత పెట్టుబడి సాధనాలవైపు ఇన్వెస్టర్ల చూపు
  • ఎగబాకుతున్న పుత్తడి... చల్లారుతున్న చమురు
  • తక్షణం వ్యాక్సిన్‌ కనుగొనకపోతే తంటాలేనంటున్న ఆర్థికవేత్తలు
  • మన ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం

(సాక్షి, బిజినెస్‌ విభాగం): అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచమంతటికీ తుమ్ములొస్తాయన్నది నానుడి!! అయితే, ఇప్పుడు చైనాకు వచ్చిన ‘కరోనా’ జలుబుకు ప్రపంచదేశాలన్నీ గజగజ వణుకుతున్నాయి. చైనా ‘వూహాన్‌’ నగరంలో మొదలైన కరోనా వైరస్‌ ముసలం.. దావానలంలా మరిన్ని దేశాలకు విస్తరిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారినపడి చైనాలో 100 మందికిపైగానే మరణించగా... మరో 4,500 మందికి వైరస్‌ సోకినట్లు అంచనావేస్తున్నారు. అక్కడి ఆర్థిక వ్యవస్థ వృద్ధి పాతాళానికి పడిపోతున్న తరుణంలో కరోనా రూపంలో మరో ముప్పు ముంచెత్తుతోంది. ప్రపంచ ఎకానమీకి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మరోపక్క, స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తుతున్నారు. అసలు ఈ వైరస్‌ వల్ల ఆర్థిక వ్యవస్థకు ఏంటి లింకు? స్టాక్‌ మార్కెట్లతో దీనికి సంబంధమేంటి? గతంలో ఇలాంటి వైరస్‌లు దాడిచేసినప్పుడు ఎంత నష్టం వాటిల్లింది? ఇప్పుడు పరిస్థితేంటి? ఇవన్నీ వివరించే ‘సాక్షి బిజినెస్‌’ ప్రత్యేక కథనమిది... 

మొదట్లో ఒక్క చైనాకే పరిమితం అనుకున్న కరోనా వైరస్‌ ఇప్పుడు దాని సమీపంలోని దేశాలకూ వేగంగా విస్తరిస్తోంది. థాయ్‌లాండ్, వియత్నాం, సింగపూర్, మలేసియా, దక్షిణ కొరియా, నేపాల్, జపాన్‌లతో పాటు ఎక్కడో దూరంగా ఉన్న ఫ్రాన్స్, అమెరికా, కెనడా, జర్మనీ ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా కరోనా సోకిన కేసులు నమోదవడంతో ప్రపంచమంతా బిక్కుబిక్కుమంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చైనాలో ఆరోగ్య ఎమర్జెన్సీకి ఇప్పటికే పిలుపునిచ్చింది. వైరస్‌ దెబ్బకు చైనాలో అనేక నగరాల్లో రాకపోకలను నిషేధించి తలుపులేసేశారు.

స్కూళ్లు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించేస్తున్నారు. చివరికి స్టాక్‌ మార్కెట్లకు కూడా సెలవులను పొడిగించేయడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు కూడా చైనాకు రాకపోకలను నిలిపేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులనూ తాత్కాలికంగా ఆపేస్తున్నాయి.  తాజా గణాంకాల ప్రకారం చూస్తే... 2019లో చైనా వార్షిక స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు  6.1 శాతానికి పడిపోయింది. ఇది 29 ఏళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం.

మరోపక్క, పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.7 శాతానికి, రిటైల్‌ విక్రయాల వృద్ధి 8 శాతానికి దిగజారింది. కాగా, ఇప్పుడు కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు రవాణా వ్యవస్థను నిలిపేయడంతో ఫ్యాక్టరీలకు సరఫరాలు ఆగిపోతున్నాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకపోవడంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. టూరిజం పూర్తిగా దెబ్బతింది. వెరసి ఆర్థిక కార్యకలాపాలు నిస్తేజంగా మారుతున్నాయి. ఇవన్నీ చూస్తే... అక్కడి ఎకానమీ మరింత పతనం కావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

 

ప్రపంచ ఎకానమీపై ప్రభావం ఎంత... 
అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా. అంతేకాదు, ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా ప్రధాన వృద్ధి చోధకం కూడా. గ్లోబలైజేషన్‌తో ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిన ప్రస్తుత తరుణంలో చైనాలాంటి భారీ ఎకానమీల్లో ఏదైనా కుదుపులు వస్తే.. ఆ ప్రకంపనలు కచ్చితంగా అన్నిదేశాలనూ వణికిస్తాయనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే చైనాతో ప్రపంచదేశాలకు వాణిజ్య సంబంధాలు చాలా ఎక్కువ. తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనా, ఇతర దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులకు తాత్కాలికంగా బ్రేక్‌ పడటం ఆయా ఎకానమీలకు నష్టం చేకూరుస్తుంది. అంతేకాదు టూరిజం, విమానయానంతో పాటు ఇంకా అనేక వ్యాపార రంగాలు దెబ్బతింటాయి.

అయితే, దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం వాటిల్లుతుందనే తక్షణం అంచనాకు రాలేమని, వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగితే నష్టం తీవ్రత ఇంకా పెరగడం ఖాయమని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.  2019 ఏడాదికి ప్రపంచ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) తాజాగా 2.9%కి తగ్గించింది. అదేవిధంగా 2020 అంచనాను కూడా 6.7% నుంచి 5.9%కి కోతపెట్టింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా ఇటీవలే బ్రేక్‌ పడటం, ఇరాన్‌–అమెరికా మధ్య యుద్ధ వాతావరణం సద్దుమణగడం, జర్మనీ ఆర్థిక వ్యవస్థ మాంద్యం ముప్పు నుంచి తప్పించుకోవడం వంటి పరిణామాలతో స్టాక్‌మార్కెట్లు తాజాగా ర్యాలీ చేశాయి. ఇలాంటి తరుణంలో కరోనా రూపంలో హఠాత్తుగా మరో ముప్పు ముంచుకొచ్చింది. ఈ వైరస్‌కు త్వరగా పరిష్కారం కనుగొనకపోతే వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉంది. కరోనాకు ఎంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చి, వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తారనేదానిపైనే ప్రపంచ ఎకానమీకి తలెత్తే నష్టం ఆధారపడి ఉంటుం దని నిపుణులు చెబుతున్నారు.

ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించే సంఘటనలేవైనా జరిగితే.... తక్షణం స్పందించేది స్టాక్‌మార్కెట్టే!! కరోనా వైరస్‌ బయటపడినప్పటినుంచీ చైనా మార్కెట్లు కుప్పకూలుతూనే ఉన్నాయి. అక్కడి ప్రధాన స్టాక్‌ సూచీ ‘షాంఘై కాంపొజిట్‌’ 5.5 శాతం మేర పతనమైంది. వాస్తవానికి ఈ నెల 24 నుంచి 30 వరకూ చైనా క్యాలెండర్‌ ప్రకారం కొత్త ఏడాది సెలవులు ప్రకటించడంతో మార్కెట్లు కొంత ఊపిరిపీల్చుకున్నాయి. వైరస్‌ ముప్పు తీవ్రతతో చైనాలో ఈ సెలవులను ఫిబ్రవరి 2 వరకూ పొడిగించారు.

షాంఘై స్టాక్‌ మార్కెట్‌ సెలవును ఏకంగా ఫిబ్రవరి 9 వరకూ పొడిగించడం గమనార్హం. వాస్తవానికి వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లోని ఫైనాన్షియల్‌ మార్కెట్లోనే ఎక్కువ ప్రతికూలత ఉంటుంది. అయితే, చైనాలాంటి కీలకమైన, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఈ ఉపద్రవం చోటుచేసుకోవడం, మరణాలు అంతకంతకూ పెరగడం, ఇతర దేశాలకూ వైరస్‌ విస్తరించడంతో మొత్తం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిని... భారత్‌ సహా ప్రపంచ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. కరోనా ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ఉండొచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో అమ్మకాలకు తెగబడుతున్నారు. దీంతో ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు భారీగా పడిపోయాయి.

మరోపక్క, ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనాలైన పుత్తడి, కరెన్సీల(జపాన్‌ యెన్, అమెరికా డాలర్‌ వంటివి)లోకి నిధులను మళ్లిస్తున్నారు. దీంతో బంగారం రేటు మళ్లీ పుంజుకుంటోంది. మరోపక్క, ఆర్థిక మందగమనం తీవ్రమైతే డిమాండ్‌ పడిపోవచ్చన్న భయాలతో  అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర మళ్లీ నేలచూపులు చూస్తోంది. ఇటీవలి గరిష్ట స్థాయి(బ్యారెల్‌కు సుమారు 65.65 డాలర్లు) నుంచి ఏకంగా 20 శాతం (13.5 డాలర్లు) కుప్పకూలడం గమనార్హం. అయితే, సార్స్‌ వైరస్‌ దాడి సమయంలో కూడా చైనా మార్కెట్లు తీవ్రంగా కుప్పకూలినప్పటికీ.. ఆరు నెలల్లోనే మళ్లీ కోలుకున్న సంగతిని కొంతమంది మార్కెట్‌ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అయితే, తాజా కరోనా వైరస్‌కు గనుక త్వరలోనే వ్యాక్సిన్‌ కనుగొని... వ్యాప్తి తగ్గుముఖం పడితే మార్కెట్లపై ప్రభావం స్వల్పకాలికంగానే ఉండొచ్చనేది నిపుణుల అభిప్రాయం. అలాకాకుండా మరిన్ని దేశాలకు ఇది విస్తరించి.. మరణాలు పెరిగితే గ్లోబల్‌ మార్కెట్లలో పతనం తీవ్రతరం కావొచ్చని వారు పేర్కొంటున్నారు.

ఏ రంగాలపై అధిక ప్రభావం... 
వైరస్‌ల ముప్పు సమయంలో టూరిజం, ట్రావెల్‌ రంగాలకు చెందిన హోటళ్లు, ఎయిర్‌లైన్స్‌ కంపెనీలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ప్రజల వినియోగ వ్యయం తగ్గిపోవడం వల్ల లగ్జరీ, కన్సూమర్‌ గూడ్స్‌ రంగాలు కూడా దెబ్బతింటాయి. సహజంగానే ఆయా రంగాల స్టాక్స్‌ తీవ్ర నష్టాలను చవిచూస్తాయి. సార్స్‌ ఎటాక్‌ సమయంలో చైనాలో రిటైల్‌ అమ్మకాలు తీవ్రంగా పడిపోయిన విషయం గమనార్హం. అయితే, ఫార్మా రంగం మాత్రం ఇలాంటి తరుణంలో ప్రయోజనం పొందుతుంది. వైరస్‌కు తగిన వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తీసుకురావడం, ఔషధాలు, ఇతరత్రా సామగ్రి అమ్మకాలు పెరగడమే కారణం.

జపాన్‌కు ‘ఒలింపిక్స్‌’ గుబులు!

కరోనా వైరస్‌ కల్లోలానికి చైనా కంటే జపాన్‌కే ఎక్కువ భయం పట్టుకుంది. జపాన్‌ అత్యధికంగా ఎగుమతులు చేసే దేశాల్లో చైనా రెండో స్థానంలో ఉంది. అంతేకాదు.. జపాన్‌కు వచ్చే మొత్తం పర్యాటకుల్లో 30 శాతం చైనీయులే. అక్కడి పారిశ్రామిక సర్వే ప్రకారం గతేడాది విదేశీ పర్యాటకులు జపాన్‌లో వెచ్చించిన మొత్తంలో 40 శాతం చైనావాళ్లదే కావడం విశేషం. ఇప్పుడు కరోనా కారణంగా పర్యాటకానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. పరిస్థితి మరికొంతకాలం ఇలాగే కొనసాగితే తమ కంపెనీ కార్పొరేట్‌ కంపెనీల లాభాలతో పాటు పారిశ్రామికోత్పత్తి కూడా దెబ్బతినే అవకాశం ఉందని జపాన్‌ ఆర్థిక మంత్రి యసుతోషి నిషిమురా హెచ్చరించారు.

ఈ ప్రభావంతో జపాన్‌ స్టాక్‌ మార్కెట్లు కూడా తీవ్రంగానే పతనమవుతున్నాయి. ఇదిలాఉంటే.. ఈ ఏడాది జూలై–ఆగస్టు నెలల్లో జపాన్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్‌ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పుడు కరోనా ప్రభావం ఇంకొన్నాళ్లు కొనసాగి.. వ్యాక్సిన్‌ గనుక అందుబాటులోకి రాకపోతే టూరిస్టులు తగ్గిపోయే ప్రమాదం ఉందని జపాన్‌కు దిగులు పట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్‌కు అత్యధికంగా చైనా నుంచే టూరిస్టులు వస్తారని జపాన్‌ అంచనా వేస్తోంది. ఒకవేళ చైనా పర్యాటకుల సంఖ్య తగ్గినట్లయితే జపాన్‌ జీడీపీ వృద్ధి 0.2% తగ్గొచ్చనేది దైచి లైఫ్‌ రీసెర్చ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ హీడో కుమానో అంచనా.

భారత్‌ సంగతేంటి..?
కరోనా ముప్పు భారత్‌నూ వెంటాడుతోంది. చైనాతో మనకు వాణిజ్యం చాలా ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. చైనా ఆర్థిక వ్యవస్థగనుక మరింత పతనమైతే డిమాండ్‌ మందగించి మన ఎగుమతులు పడిపోతాయి. మరీ ముఖ్యంగా ఖనిజాలు, లోహాలు, జౌళి తదితర ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అంతేకాదు చైనా నుంచి మనకు వచ్చే భారీస్థాయి దిగుమతులకూ బ్రేక్‌ పడితే.. దానిపై ఆధారపడిన పారిశ్రామిక రంగాల్లో ఉత్పాదకత దిగజారుతుంది. 2018–19లో చైనా, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 87 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

ఇందులో భారత్‌ నుంచి ఎగుమతులు 30 శాతం ఎగబాకి 16.7 బిలియన్‌ డాలర్లకు చేరగా.. చైనా ఎగుమతులు 9 శాతం తగ్గి 70.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో(2019–20, క్యూ2) భారత్‌ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి(4.5 శాతం) పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూర్తి ఏడాది వృద్ధికి అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలు కోత పెడుతున్నాయి. తాజాగా ఐఎంఎఫ్‌ 2019–20 భారత్‌ జీడీపీ అంచనాలను 6.1 శాతం నుంచి ఏకంగా 4.8 శాతానికి తగ్గించడం గమనార్హం.

ఇప్పుడు కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా మందగించి... చైనాతో వాణిజ్యం గనుక దిగజారితే.. భారత్‌ ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణించడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఇక భారత్‌లో ప్రస్తుతానికి కరోనా వైరస్‌కు సంబంధించి ఒక్క కేసూ అధికారికంగా నమోదు కాలేదు. ఒకవేళ మనదగ్గర కూడా ఇది వ్యాపించి తీవ్రరూపం దాల్చితే అత్యంత దుర్భర పరిణామాలకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

సార్స్, ఎబోలా ఏం చెబుతున్నాయి..

2002–03లో ప్రపంచాన్ని వణికించిన సార్స్‌(సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) వైరస్‌ కూడా చైనాలోనే వెలుగుచూసింది. దీని ప్రభావంతో ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర నష్టాన్నే చవిచూశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ఈ ప్రభావం భారీగానే పడింది. దాదాపు 40 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.85 లక్షల కోట్లు) మేర ప్రపంచ  ఎకానమీకి ‘సార్స్‌’తో నష్టం వాటిల్లినట్లు అప్పట్లో లెక్కగట్టారు. 2003 ఏడాది రెండో క్వార్టర్‌లో ప్రపంచ వృద్ధి రేటుకు ఏకంగా 1 శాతం కోత పడిందని.. దీనికి అధికంగా సార్స్‌ ప్రభావమే కారణమని లండన్‌కు చెందిన క్యాపిటల్‌ ఎకనామిక్స్‌ అనే కన్సల్టెన్నీ ప్రతినిధి జెన్నిఫర్‌ మెక్‌క్యూన్‌ పేర్కొన్నారు. అయితే, ఆతర్వాత రికవరీ చాలా వేగంగానే జరిగిందని కూడా ఆమె గుర్తుచేశారు. మరోపక్క, 2014లో ఆఫ్రికా దేశాలను వణికించిన ఎబోలా వైరస్‌ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావాన్ని చూపింది. ఎబోలా దాటికి లైబీరియా, సియెర్రా లియోన్, గినియాల్లో 10 వేల మందికిపైగానే చనిపోయారు. ఈ దేశాల 2015 ఏడాది జీడీపీల్లో 2.2 బిలియన్‌ డాలర్ల నష్టానికి ఎబోలా కారణమైందని ప్రపంచ బ్యాంక్‌ లెక్కతేల్చింది.

►2017లో ప్రఖ్యాత ఆర్థికవేత్తలు విక్టోరియా ఫాన్, జీన్‌ జేమిసన్, లారెన్స్‌ సమర్స్‌ విడుదల చేసిన ఒక పరిశోధన పత్రం ప్రకారం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రమాదకరమైన వైరస్‌ల కారణంగా అధిక దేశాలకు అంటువ్యాధులు ప్రబలితే(పాండెమిక్‌ రిస్క్‌)... దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వార్షికంగా సుమారు 500 బిలియన్‌ డాలర్లు (రూ.35.5 లక్షల కోట్లు) నష్టపోవచ్చని అంచనా.
►గ్లోబల్‌ హెల్త్‌ రిస్క్‌ ఫ్రేమ్‌వర్క్‌పై 2016లో ఏర్పాటైన కమిషన్‌ అధ్యయనం ప్రకారం.. వివిధ దేశాల్లో తలెత్తే అంటువ్యాధుల వల్ల 21వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లే నష్టం 6 ట్రిలియన్‌ డాలర్లకు పైగానే(ఒక ట్రిలియన్‌ అంటే లక్ష కోట్లు) ఉండొచ్చని అంచనా. మన కరెన్సీలో చూస్తే నష్టం విలువ రూ.426 లక్షల కోట్ల కింద లెక్క!!

 

యాపిల్‌కూ దెబ్బ...

కరోనా.. టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌నూ వెంటాడుతోంది. ఎందుకంటే వైరస్‌ ఎక్కడైతే మొదలైందో ఆ వుహాన్‌ నగరంలోనే యాపిల్‌ ఫోన్ల కాంట్రాక్టు తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌కు అతిపెద్ద ప్లాంట్‌ ఉంది. చైనా కొత్త సంవత్సరం సెలవులపై చుట్టుపక్కల తైవాన్‌ ఇతరత్రా దేశాలకు వెళ్లిన ప్లాంట్‌ సిబ్బందిని ఇప్పుడప్పుడే వెనక్కిరావద్దని ఫాక్స్‌కాన్‌ హెచ్చరించింది.  కొద్దిరోజులు ఇక్కడిప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోనుంది. ఇక యాపిల్‌ ఉత్పత్తుల తయారీపై చైనాలో 50 లక్షల ఉద్యోగులు ఆధారపడ్డారు.

యాపిల్‌కు సొంత సిబ్బందే చైనాలో 10 వేల మందికిపైగా ఉన్నారు. అంతేకాదు యాపిల్‌ ఉత్పత్తుల్లో 90% చైనాలోనే తయారవుతున్న నేపథ్యంలో వైరస్‌ సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించకపోతే ప్లాంట్ల మూసివేతతో తీవ్ర నష్టమే తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోపక్క, ఐఫోన్‌ అమ్మకాలకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలో రిటైల్‌ సేల్స్‌ పడిపోవచ్చని అంటున్నారు. ఇక తమ ప్రజలు చైనాకు వెళ్లే విషయంలో పునరాలోచించుకోవాలంటూ అమెరికా ప్రభుత్వం సహా అనేక కంపెనీలు ట్రావెల్‌ అలెర్ట్‌ను కూడా ప్రకటించాయి.You may be interested

లాభాల ఓపెనింగ్‌ నేడు?!

Wednesday 29th January 2020

రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌? ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 34 పాయింట్లు ప్లస్‌ లాభాల్లో అమెరికా, ఆసియా మార్కెట్లు కరోనా భయాల నుంచి బయటపడ్డ ఇన్వెస్టర్లు  నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 34 పాయింట్లు పుంజుకుని 12,109  వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,075 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌

మార్కెట్లోకి టాటా నెక్సాన్‌ ఈవీ

Tuesday 28th January 2020

మార్కెట్లోకి టాటా నెక్సాన్‌ ఈవీ ప్రారంభ ధర రూ.13.99 లక్షలు ముంబై: పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు కరెంటుతో నడిచే వాహనాలు అందుబాటులోకి తెచ్చేందుకు అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌  కార్‌ ‘నెక్సాన్‌ ఈవీ’ని మంగళవారం మార్కెట్‌లో విడుదల చేసింది. జిపట్రాన్‌ టెక్నాలజీ కలిగిన ఈ కారు ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 312 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంతేగాక ఇందులో 35 కనెక్టెడ్‌

Most from this category