News


రియల్టీకి కరోనా కాటు

Wednesday 25th March 2020
news_main1585107033.png-32660

  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో గృహ నిర్మాణాలు ఆలస్యం
  • 8–10 శాతం తగ్గనున్న నిర్మాణ సంస్థల ఆదాయం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ రియల్టీ రంగం మీద కరోనా వైరస్‌ ప్రభావం పడింది. కోవిడ్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ఉన్న కారణంగా గృహాల అమ్మకాలు, నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని హౌజింగ్‌ బ్రోకరేజ్‌ అనరాక్‌ కన్సల్టెన్సీ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 15.62 లక్షలకు పైగా గృహాలు నిర్మాణంలో ఉన్నాయని, ఇవి  2013–19 మధ్య కాలంలో ప్రారంభమైన గృహాలేనని నివేదిక తెలిపింది. 


దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో నిర్మాణ కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రాజెక్ట్‌లలో నిర్మాణ పనులు జరగడం లేదని అనరాక్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ ఠాకూర్‌ తెలిపారు. సాధారణంగా గుడిపడ్వా, అక్షయతృతీయ, నవరాత్రి, ఉగాది వంటి పర్యదినాల్లో గృహ కొనుగోళ్లు జోరుగా ఉంటాయని.. గృహ ప్రవేశాలకు ముందస్తు ప్రణాళికలు చేస్తుంటారని కానీ, కరోనా వైరస్‌ కారణంగా ఈసారి విక్రయాలు సన్నగిల్లాయని, గృహ కొనుగోలుదారులు గృహ ప్రవేశం చేసే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇది డెవలపర్ల ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తుందని తెలిపారు.


హైదరాబాద్‌లో 64,250 గృహాలు...
నగరాల వారీగా నిర్మాణంలో ఉన్న గృహాల సంఖ్యను చూస్తే.. హైదరాబాద్‌లో 64,250 యూనిట్లుండగా.. ఎంఎంఆర్‌లో అత్యధికంగా 4.65 లక్షల గృహాలు, ఎన్‌సీఆర్‌లో 4.25 లక్షలు, పుణేలో 2.62 లక్షలు, బెంగళూరులో 2.02 లక్షలు, కోల్‌కతాలో 90,670, చెన్నైలో 54,200 యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి.


8–10 శాతం ఆదాయం లాస్‌...
నిర్మాణ సంస్థలు ఆదాయం మీద లాక్‌డౌన్‌ ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా కంపెనీల వార్షిక ఆదాయంలో నాల్గో త్రైమాసికం వాటా 30–35 శాతం వరకుంటుందని.. కానీ, ఫోర్త్‌ క్వాటర్‌లో ఆదాయం 8–10 శాతం క్షీణిస్తుందని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. కంపెనీల నెలవారి వ్యయాలు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వంటివి కూడా కంపెనీల ఆదాయం మీద ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. దేశంలో ప్రధాన నగరాల్లో నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయని.. ఈ పరిస్థితి ఏప్రిల్‌లోనూ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే పెద్ద నిర్మాణ సంస్థలు కార్పొరేట్‌ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్‌ ప్రాసెస్‌ను ఎదుర్కొంటున్నాయని.. దీనికి తోడు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయా కంపెనీలు రాబోయే రోజుల్లో భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటాయని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. 
 You may be interested

డోజోన్స్‌- వండర్‌

Wednesday 25th March 2020

1933 తదుపరి డోజోన్స్‌ దూకుడు ఎస్‌అండ్‌పీ -12నాటి ఏళ్ల రికార్డ్‌ భారీ సహాయక ప్యాకేజీ అంచనాలు   ప్రజలకూ, ఆర్థిక వ్యవస్థలకూ పెనునష్టాన్ని కలిగిస్తోన్న కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా అమెరికా ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించనున్న అంచనాలు మంగళవారం ఇన్వెస్టర్లకు ఎక్కడలేని ఉత్సాహాన్నీ ఇచ్చాయి. దీంతో మూకుమ్మడిగా కొనుగోళ్లకు ఎగబడటంతో డోజోన్స్‌ ఇండెక్స్‌ ఏకంగా 2,113 పాయింట్లు (11.4 శాతం) దూసుకెళ్లింది. ఇంతక్రితం 1933లో మాత్రమే ఒకే రోజులో ఇంత అధికంగా

కనీసం రెండు రోజులు ఎక్చ్సేంజీలు మూసేయండి

Wednesday 25th March 2020

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్స్చేంజ్‌లను కనీసం రెండు రోజుల పాటు మూసేయాలని స్టాక్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌, ఏఎన్‌ఎమ్‌ఐ మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీని కోరింది. దేశవ్యాప్తంగా దాదాపు 900కు పైగా స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలకు అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఎక్స్చేంజేస్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎన్‌ఎమ్‌ఐ)లో సభ్యత్వం ఉంది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయని, అయితే స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలను అత్యవసర సంస్థలుగా కొన్ని రాష్ట్రాలు గుర్తంచడం లేదని, దీంతో తమ ఉద్యోగులకు

Most from this category