News


వాణిజ్య రియల్టీ మీద కరోనా ప్రభావం

Saturday 14th March 2020
news_main1584158366.png-32473

  • ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో లావాదేవీల వాయిదా
  • తగ్గిన సైట్‌ విజిట్స్‌; పెట్టుబడుల్లోనూ పునరాలోచన


సాక్షి, హైదరాబాద్‌: దేశీయ వాణిజ్య స్థిరాస్తి రంగానికి కరోనా వైరస్‌ సోకింది. ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో బహుళ జాతి కంపెనీలు సైట్‌ విజిట్స్‌ తగ్గించేశాయి. తుది దశకు చేరుకున్న లావాదేవీలను, విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నాయి. ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లతో పాటూ హెచ్‌ఎన్‌ఐ, ఎన్నారైలూ రియల్టీ పెట్టుబడులకు పునరాలోచనలో పడ్డారు. సింపుల్‌గా చెప్పాలంటే 2019లో రికార్డ్‌ స్థాయిలో జరిగిన కమర్షియల్‌ స్పేస్‌ లావాదేవీలు.. కోవిడ్‌ దెబ్బకు 2020లో జరగవనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం!


ట్రావెల్‌కు, ట్రేడ్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే ప్రయాణాలు ఎంత ఎక్కువ జరిగితే.. దాని అనుసంధానంగా వ్యాపారమూ అంతే బాగా జరుగుతుందని దానర్థం. దీనికి రియల్‌ ఎస్టేట్‌ మినహాయింపేం కాదు. తాజాగా కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో చాలా వరకు దేశాలు ప్రయాణ ఆంక్షలను విధించాయి. దీంతో విమానయానం, పర్యాటకంతో పాటూ రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా దెబ్బతింటోంది. మరీ ముఖ్యంగా ఆఫీస్, హాస్పిటాలిటీ, రిటైల్‌ రియల్టీ విభాగాల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2019లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కొత్తగా 6.13 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ సప్లయి జరిగింది. 6,221 మిలియన్‌ డాలర్ల ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వచ్చాయి. ఇందులో ఆఫీస్‌ స్పేస్‌ వాటా 47 శాతం ఉందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. 2018లో హైదరాబాద్‌లో 3.93 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ సప్లయి జరగగా.. 2019 నాటికి 1.28 కోట్ల చ.అ.లకు వృద్ధి చెందింది.


5 లక్షల చ.అ. 3 డీల్స్‌ వాయిదా..
కమర్షియల్‌ రియల్టీ లావాదేవీల్లో ప్రధాన వాటాదారు ఐటీ రంగమే. కొత్త కంపెనీలతో పాటూ, ఇప్పటికే ఉన్న కంపెనీలు మన దేశంలో కార్యకలాపాలను విస్తరణకు ఆసక్తిగా ఉన్నాయి. ఆఫీస్‌ లొకేషన్స్, భవనాలు, వసతులు, పరిసర ప్రాంతాలు, ఉద్యోగుల భద్రత వంటి అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసేందుకు సైట్‌ విజిట్స్‌ చేస్తుంటాయి. ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో చాలా వరకు ఎంఎన్‌సీ కంపెనీలు సైట్‌ విజిట్స్‌ చేయడం లేదు. గతంలోనే విజిట్‌ చేసిన కంపెనీలేమో.. తుది నిర్ణయాలను వాయిదా వేస్తున్నాయని, వచ్చే 3–9 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో తుది దశకు చేరుకున్న 5 లక్షలకు పైగా స్థల లావాదేవీలు ప్రస్తుతం వాయిదా పడ్డాయని తెలిపింది. మార్చిలో ముగియాల్సిన ఈ మూడు డీల్స్‌.. 3 నెలలు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న కన్సల్టెన్సీ తెలిపింది. వైరస్‌ ప్రభావం, స్థానిక ప్రభుత్వం, ప్రజల ప్రతిస్పందనలు వంటి అంశాలను పరిశీలించేందుకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
 

తక్షణ అవసరాల కోసం కో–వర్కింగ్‌..
కమర్షియల్‌ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ముందస్తు లీజు లావాదేవీలకే ఇష్టపడతారు. ఎందుకంటే భవిష్యత్తుల్లో అద్దె పెంపు ఇబ్బందులుండవని. జేఎల్‌ఎల్‌ నివేదిక ప్రకారం 2016లో దేశంలో 56.4 లక్షల చ.అ.లుగా ఉన్న ముందస్తు ఆఫీస్‌ స్థల లీజు లావాదేవీలు.. 2019 నాటికి మూడు రెట్లు వృద్ధి చెంది 1.84 కోట్ల చ.అ.లకు చేరింది. పలు కార్పొరేట్‌ కంపెనీలు తమ తక్షణ కార్యకలాపాల నిర్వహణకు శాశ్వత స్థల లావాదేవీలకు బదులుగా కో–వర్కింగ్‌ స్పేస్‌లను వినియోగించుకోవాలని నిర్ణయించుకుంటున్నాయి. గతేడాది దేశంలోని ప్రధాన నగరాల్లో 80 లక్షల చ.అ. కో–వర్కింగ్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయి.


డెవలపర్లేం చేయాలంటే?
రియల్టీ రంగం మీద కరోనా ప్రభావాన్ని ఇప్పుడే ఊహించడం కష్టమని క్రెడాయ్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు శేఖర్‌ రెడ్డి అన్నారు. కాకపోతే ట్రావెల్‌ ఆంక్షల నేపథ్యంలో కొద్ది నెలల పాటు కొనుగోలు నిర్ణయాలు వాయిదా పడే అవకాశముంది. కాబట్టి కొత్త ప్రాజెక్ట్‌లు లాంచింగ్స్‌ను కాస్త పునరాలోచన చేసి చేయడం మంచిదని ఆయన సూచించారు. గతంలో మాదిరిగా ఇతర నగరాల ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రవాసులు కొంటారమోనని ముందస్తు అంచనాలతో ప్రాజెక్ట్‌లను ప్రారంభించకూడదు. సంస్థాగత, బయటి ఇన్వెస్ట్‌మెంట్స్‌ మీద కాకుండా చేతిలో ఉన్న నిధులతోనే ప్రాజెక్ట్‌లను ప్రారంభించడం ఉత్తమమని సూచించారు.


తగ్గిన ఫర్నీచర్, ఇంటీరియర్‌ దిగుమతులు..
కరోనా వైరస్‌ కారణంగా చాలా వరకు దేశాల్లో ఉత్పత్తి కేంద్రాలను మూసేశారు. దీంతో ఇండియాకు దిగుమతులు తగ్గిపోయాయి. సాధారణంగా చైనా, జపాన్, జర్మనీ వంటి వంటి దేశాల నుంచి ఇండియాకు ఫర్నీచర్, లైటింగ్స్, ఎలక్ట్రికల్స్, కర్టెన్స్, వాల్‌ పేపర్స్, ప్రొఫైల్‌ విండోస్, మోడ్రన్‌ కిచెన్స్, లగ్జరీ శానిటరీ వేర్స్‌ దిగుమతి అవుతుంటాయి. గత కొంత కాలంగా ఆయా ఉత్పత్తుల రావటం లేదని.. దీంతో లగ్జరీ గృహాల ఇంటీరియర్‌ పనులు కొంత ఆలస్యమయ్యే అవకాశముందని.. లేకపోతే స్థానికంగా ఉన్న ఉత్పత్తులతోనే పూర్తి చేయాల్సి ఉంటుందని ఓ డెవలపర్‌ తెలిపారు. 


తాబేలుకు టైమొచ్చింది!
చైనా, ఇండియా అభివృద్ధిని కుందేలు, తాబేలుతో పోస్తుంటారు. ఆయా దేశ ప్రభుత్వ విధానాలు, నైపుణ్యత, స్థానిక వాతావరణాలతో చైనా శరవేగంగా అభివృద్ధి చెందింది. కరోనా కారణంగా చైనాలో తయారీ కేంద్రాలు మూతపడ్డాయి. ఇండియాకు దిగుమతులూ తగ్గిపోయాయి. దీంతో చాలా వరకు అంతర్జాతీయ కంపెనీలు గ్లోబల్‌ తయారీ కేంద్రానికి ఇండియానే కరెక్ట్‌ అని భావిస్తున్నాయి. దేశంలోని నైపుణ్యత, సాంకేతికత, అందుబాటు ధరలు, స్థానిక వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకరమైన విధానాలతో అదనపు ప్రయోజనాలను కల్పిస్తే.. ప్రపంచ మార్కెట్లకు ఇండియా తయారీ కేంద్రంగా మారుతుంది. కోవిడ్‌ వైరస్‌తో తాత్కాలికంగా తయారీ రంగం మీద ప్రభావం పడినప్పటికీ.. దీర్ఘకాలంలో మాత్రం ఇండియాకు శుభపరిణామమే.
– కె. ఇంద్రసేనా రెడ్డి, ఎండీ, గిరిధారి హోమ్స్‌
 

 You may be interested

ఆరు నెలల క్షీణతకు తెర!

Saturday 14th March 2020

ఫిబ్రవరి ఎగుమతుల్లో 2.91 శాతం వృద్ధి దిగుమతులూ వృద్ధిబాటలోకి...  వాణిజ్యలోటు 9.85 బిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు ఆరు నెలల తర్వాత ఫిబ్రవరిలో 2.91 శాతం స్వల్ప వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి. అంటే 2019 ఫిబ్రవరితో పోల్చితే 2020 ఫిబ్రవరిలో ఎగుమతులు 2.91 శాతం పెరిగాయన్నమాట. విలువ రూపంలో 27.65 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్‌, కెమికల్స్‌ వంటి రంగాల ఎగుమతుల్లో వృద్ధి నమోదుకావడం దీనికి కారణం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తాజా

రూపాయికి ఆర్‌బీఐ బూస్ట్‌

Saturday 14th March 2020

48 పైసలు పురోగమనం 73.80 వద్ద ముగింపు ముంబై: ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విషయంలో భయాందోళన పడాల్సింది ఏదీ లేదని, ఇందుకు తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటున్నామనీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇచ్చిన హామీ శుక్రవారం రూపాయికి వరమయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 48 పైసలు బలపడి 73.80 వద్ద ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... రూపాయి గురువారం ముగింపు

Most from this category