News


మేకిన్‌ ఇండియా దిశగా మోదీ 2.0 బడ్జెట్‌

Saturday 6th July 2019
news_main1562393257.png-26842

లోక్‌సభలో 2019-20 బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
సుదీర్ఘ ప్రసంగంతో ఆకట్టుకున్న మహిళా ఆర్థిక మం‍త్రి
మొత్తం రూ. 27,86,349 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదన
స్టార్టప్‌లకు, కార్పొరేట్లకు ప్రోత్సాహకాలు
అత్యంత అధిక ఆదాయం ఉన్న వారికి సర్‌ ‘చార్జ్‌’
విద్యుత్‌ వాహనాల వినియోగానికి ప్రోత్సాహకాలు
తొలిసారి ఇల్లు కొంటే మరో రూ. 1.5 లక్షల లబ్ధి
పైపైకి ఎగబాకుతున్న పసిడి ధరలు
సుంకాల పెంపుతో పెరిగిన పెట్రో రేట్లు

 
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే-2 ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం సభలో సుదీర్ఘంగా చదివి వినిపించారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా రికార్డు సృష్టించిన నిర్మల.. సందర్భోచితంగా చిన్న చిన్న సూక్తులు వినిపిస్తూ.. సభికులను ఆకట్టుకున్నారు. బడ్జెట్‌లో తమ ప్రభుత్వ కేటాయింపులను, ప్రాధాన్యాలను స్పష్టంగా ప్రకటించారు. ప్రసంగానికి ముందు ఆర్థిక మంత్రికి స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని మోదీ, ఇతర సహచర మంత్రులు అభినందనలు తెలిపారు. సుమారు 2 గంటల 15 నిమిషాలకుపైగా ఆమె బడ్జెట్‌ ప్రసంగం చేశారు. ఇంగ్లీష్‌లో ఆమె ప్రసంగించినా.. మధ్య, మధ్యలో హిందీ, తమిళం, ఉర్దు, సంస్కృత పదాలను సమయానుకూలంగా వాడారు. ఆమె కీలకమైన ప్రకటనలు చేసినప్పుడల్లా సహచర సభ్యులు బల్లలు చరుస్తూ సంతోషం వెలిబుచ్చారు. మొత్తం రూ. 27,86,349 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మేకిన్‌ ఇండియా దిశగా పలు రాయితీలు ప్రకటించారు. విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ప్రోత్సాహకాలు ఇచ్చారు. స్టార్టప్‌లను మరిన్ని నెలకొల్పే దిశగా చర్యలు తీసుకున్నారు. అలాగే కార్పొరేట్లకు పన్నుల్లో ఊరట కలిగించారు. కానీ సుంకం పెంపుతో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. డజన్ల కొద్దీ వస్తువులపైన దిగుమతి సుం‍కాన్ని విధించారు. అత్యంత సంపాదనాపరులకు సర్‌చార్జ్‌ భారీగా వడ్డించారు. అయితే స్టార్టప్‌లకు, గృహనిర్మాణం, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం ద్వారా దేశాభివృద్ధిని పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. విమానయానం, బీమా రంగం, మీడియాలో మరింతగా విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రకటించారు. 
ధనవంతులకు సర్‌ చార్జ్‌...
ఈ ఏడాది బడ్జెట్‌లో ఆదాయ పన్ను స్లాబ్‌ల్లో ఏ విధమైన మార్పులు చేయలేదు. కానీ ధనవంతుల ఆదాయానికి మాత్రం సర్‌చార్జ్‌ పెంచారు. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకూ పన్ను పరిధిలోని ఆదాయానికి 39 శాతం, రూ. 5 కోట్లు పైబడిన ఆదాయం సంపాదించే వారికి 42.47 శాతం సర్‌చార్జ్‌ విధించారు. దీనిపై ఆర్థిక మంత్రి మాట్లాడుతు.. దేశాభివృద్ధికి అత్యంత ధనవంతులు మరింత తోడ్పాటు అందించాలని చెప్పారు. ఇక రూ. కోటి పైబడిన నగదు ఉపసంహరణపై 2 శాతం టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది. 
బంగారంపై కస్టమ్స్‌ సుంకం పెంపు...
పన్ను ఆదాయంలో పెరుగుదలకు, లోటును తగ్గించడానికి ప్రభుత్వరంగ సంస్థల్లోని​వాటాలను విక్రయించడానికి ఆర్థిక మంత్రి ప్రణాళికలు ప్రకటించారు. అలాగే ఆర్బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, కంపెనీల నుంచి మరింత డివిడెండ్‌ వచ్చేలా చూడాలన్నారు. ఇక పెట్రోల్‌, డీజిల్‌పై రూ. 2 ఎక్సైజ్‌ డ్యూటీ, సెస్‌ విధించారు. బంగారం నుంచి ఆటోమొబైల్‌ పరికరాలు, పొగాకు ఉత్పత్తుల వరకూ డజన్ల కొద్దీ వస్తువులపై దిగుమతి సుంకాలను విధించారు. పసిడిపై కస్టమ్స్‌ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. 
కార్పొరేట్‌లకు ఊరట...
కార్పొరేట్‌ కంపెనీలకూ ఆర్థిక మంత్రి ఊరట నిచ్చారు. రూ. 400 కోట్లు వరకూ ఆదాయం ఉన్న కంపెనీలకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం రూ. 250 కోట్లు ఆదాయం ఉన్న కంపెనీలకు ఈ ట్యాక్స్‌ విధిస్తుండగా.. దాని పరిమితిని రూ. 400 కోట్లకు పెంచారు. దాదాపు 99.3 శాతం కంపెనీలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

విద్యుత్‌ వాహనాలకు ప్రోత్సాహకాలు...
మేకిన్‌ ఇండియాకు ప్రోత్సాహం దిశగా కొన్ని పెట్టుబడులు, ముడిసరుకులపై రాయితీలు ఇచ్చారు. అదేవిధంగా కొన్ని వస్తువులపై సుంకాలను పెంచారు. విద్యుత్‌పై నడిచే వాహనాలను ప్రోత్సహించేందుకు ఆ వాహనాల తయారీకి కావాల్సిన పరికరాలపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించారు. అలాగే ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉపయోగించే కొన్ని విడిభాగాలపై కస్టమ్స్‌ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేశారు. వీటిపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేయడానికి తీసుకున్న అప్పునకు సంబంధించిన వడ్డీపై అదనంగా రూ. 1.5 లక్షల ఆదాయపు పన్నును తగ్గిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ల అమెరికన్‌ డాలర్లకు చేరుకుంటుందని, ఇది ఆరో అతిపెద్ద వ్యవస్థ అని సీతారామన్‌ పేర్కొన్నారు. వచ్చే సంవత్సారాల్లో దీనిని 5 ట్రిలియన్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సమాజంలోని ప్రతి రంగానికి ఓ విజన్‌ను, లక్ష్యాన్ని ఈ బడ్జెట్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. 

తొలిసారి ఇల్లు కొంటే...
రైతులకు నగదు సహాయం పెంపుతో పాటు ఒక కొత్త పింఛన్‌ పథకం తీసుకొచ్చారు. చిన్న మొత్తంలో పన్నులు కట్టేవారికి ఉపశమనం కలిగించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70 వేల కోట్ల మూలధన నిధిని ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. తొలిసారి రూ. 45 లక్షల లోపు ఇల్లు కొంటే వారికి రూ. 1.5 లక్షలను అదనంగా వడ్డీ చెల్లింపులో తగ్గించాలని ప్రతిపాదించారు. 

రక్షణ పరికరాలకు ‘కస్టమ్స్‌’మినహాయింపు...
నాన్‌ బ్యాంక్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) నుంచి అత్యధిక రేట్లు ఉన్న ఆస్తులు సేకరించడానికి స్టేట్‌ బ్యాంకులకు రూ. లక్ష కోట్ల రూపాయల వరకూ ప్రభుత్వం పాక్షిక గ్యారెంటీ ఇవ్వనుంది. అలాగే నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు స్థానంలో రెగ్యులేటర్‌గా ఆర్‌బీఐ ఉంటుందని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. గత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసిన నిర్మల.. ఈసారి బడ్జెట్‌లో కొన్ని రక్షణ పరికరాలకు ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయించారు. ఇక నిధుల సేకరణ కోసం తొలి గ్లోబల్‌ బాండ్‌ను ప్రభుత్వం విక్రయించనుంది. 
ఇక స్టార్టప్స్‌ కోసం ఈ-వెరిఫికేషన్‌ మెకానిజంను ప్రవేశపెడతామని, స్టార్టప్స్‌ నిధుల సేకరణ విషయంలో ఎలాంటి ట్యాక్స్‌ స్క్రూటినీ అవసరం లేదని ఆర్థిక మంత్రి తెలిపారు. వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ. 100 కోట్లు వెచ్చించనున్నామని ఆమె చెప్పారు. You may be interested

పెట్రోల్‌, బంగారం మరింత ప్రియం

Saturday 6th July 2019

-పొగాకు ఉత్పత్తులు, విదేశీ కార్లు, ఏసీ, జీడిపప్పు ధరలు పైపైకి -తగ్గనున్న ‘ఎలక్ట్రిక్‌’ విడి భాగాలు, కెమెరా పరికరాల ధరలు -ఫోన్‌ చార్జర్లు, సెట్‌ టాప్‌ బాక్సులు తక్కువ ధరలకే.. ఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌, బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయి. ఇటు సిగరెట్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు, ఏసీల ధరలు సైతం అధికమవనున్నాయి. పన్నులు పెరుగుతుండటంతో వీటి ధరలు కూడా పెరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌

‘సీత’మ్మ నష్టాలు!

Saturday 6th July 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. అందరి మాటలు విన్నారు. కానీ ఎవ్వరి మాటను మన్నించినట్లు కనిపించలేదు. భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం నుంచి భారీ సంస్కరణలే ఉంటాయనుకున్న మార్కెట్‌ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. నిధుల కొరతతో ఎన్‌బీఎఫ్‌సీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, వినియోగం రంగంలో మందగమనం చోటు చేసుకొని వాహన ఇతర కంపెనీలన్నీ కుదేలై ఉండగా, ఆదుకునే చర్యలుంటాయని అందరూ అంచనా వేశారు. ఈ అంచనాలకు భిన్నంగా సీతమ్మ బడ్జెట్‌

Most from this category