News


ప్రభుత్వ బ్యాంకులకు హోల్డింగ్‌ కంపెనీ

Friday 28th June 2019
news_main1561709052.png-26653

  • ఏటా బడ్జెట్లో దీనికి నిధుల కేటాయింపు
  • క్రమంగా ఈ వాటాలు ప్రైవేటు చేతికి!
  • 2014 నాటి సిఫారసులపై మళ్లీ అధ్యయనం

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు ఒక హోల్డింగ్‌ కంపెనీని ఏర్పాటు చేయాలన్న గత ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం మళ్లీ తెరమీదికి తెచ్చింది. బ్యాంకులకు అవసరమైన నిధుల సమీకరణకు ఈ ప్రణాళిక అనువైనదిగా భావిస్తోంది. వెటరన్‌ బ్యాంకర్‌ పీజే నాయక్‌ ఆధ్వర్యంలోని కమిటీ 2014లో చేసిన సిఫారసులకు అనుగుణంగా ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సూచించింది. మరోవైపు బలహీనంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీలు) వాటాలను విక్రయించాలన్న ప్రతిపాదనను కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఆయా బ్యాంకుల ఆర్థిక పరిస్థితుల మెరుగునకు ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించడమే సరైనదన్న ఆలోచనతో ఉంది. అయితే, దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని, ఈ ప్రతిపాదనపై అధ్యయనానికి మరింత సమయం కావాలని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
క్రమంగా వాటాల బదలాయింపు...
పీఎస్‌బీల్లో ఈక్విటీ వాటాలను కలిగి ఉండేందుకు బ్యాంకు ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీని (బీఐసీ) కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేయాలని పీజే నాయక్‌ కమిటీ అప్పట్లో సూచించింది. పీఎస్‌బీల్లోని వాటాలను క్రమంగా బీఐసీకి బదలాయించాలని పేర్కొంది. ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలో ఇది కోర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీగా ఉండాలని సూచించింది. అంతేకాదు, పీఎస్‌బీలను ఏ చట్టాల కింద అయితే ఏర్పాటు చేశారో వాటిని రద్దు చేసి, తగిన వాటాదారుల ఒప్పందం, ఆర్టికల్‌ ఆఫ్‌ అసోసియేషన్‌తో పీఎస్‌బీలపై సంపూర్ణ అధికారాలను బీఐసీకి బదలాయించాలని సిఫారసు చేసింది. ‘‘పీఎస్‌బీలకు రీక్యాపిటలైజేషన్‌ సాయానికి ఈ నాన్‌ ఆపరేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ ఉపయోగపడుతుంది. డివిడెండ్‌లతోపాటు, కాలక్రమేణా వాటాల విక్రయ రూపంలో హోల్డింగ్‌ కంపెనీకి ఆదాయం సమకూరుతుంది’’ అని అశ్విన్‌ పరేఖ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ ఎండీ అశ్విన్‌ పరేఖ్‌ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు హల్డింగ్‌ కంపెనీ అంటూ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని 2011లో ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ సైతం సిఫారసు చేసింది. హోల్డింగ్‌ కంపెనీకి ఏటా బడ్జెట్‌ నుంచి నిధుల సహకారం కూడా అందించాలని సూచించింది. కాకపోతే ఆర్థిక సేవల విభాగం ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేదు. పీజే నాయక్‌ సిఫారసులను ముందుకు తీసుకెళ్లాలంటూ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్టమూర్తి సుబ్రమణియన్‌ సైతం ఈ ఏడాది ఫిబ్రవరిలో సూచించారు. ఈ తరహా సంస్కరణలను అమలు చేయకపోతే బ్యాంకింగ్‌ రంగంలో రిస్క్‌లు ఇలానే కొనసాగుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. You may be interested

ఫుడ్‌ ప్యాకెట్లపై ‘రెడ్‌ సిగ్నల్‌’

Friday 28th June 2019

అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉంటే ఎర్ర కోడ్‌  కొత్త లేబులింగ్‌, డిస్‌ప్లే నిబంధనలు అమల్లోకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు న్యూఢిల్లీ: మీరు ప్యాకేజ్డ్‌ ఆహార ఉత్పత్తులు తింటారా? ఒకవేళ వాటి ముందు భాగంలోనే ఎర్ర రంగు కోడ్‌ కనిపించిందనుకోండి!! అందులో అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర పరిమాణాలున్నాయని భావించాల్సిందే!!. ఎందుకంటే ఆహార భద్రత, ప్రమాణాల విభాగం (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తాజాగా నూతన లేబులింగ్‌, డిస్‌ప్లే నిబంధనలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం అధిక పరిమాణంలో ఫ్యాట్‌, చక్కెర,

బ్యాంకు నిఫ్టీ అరశాతం డౌన్‌

Friday 28th June 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం అరశాతానికి నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,281.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యస్‌బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు షేర్లు పతనంతో 0.70శాతం నష్టపోయి(200 పాయింట్లు) నష్టపోయి 31,281.00ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు(31060.60)తో పోలిస్తే దాదాపు

Most from this category