News


డిమాండ్‌, వృద్ధికి బలం

Saturday 2nd February 2019
news_main1549097704.png-23962

వినియోగానికి భారీ ఊతం
వేతనజీవులు, రైతులకు ఎంతో మేలు
గ్రామీణ ఆర్థిక రంగానికి చేయూత
పన్ను మినహాయింపు పెంపు, రైతులకు ఆదాయం ఆహ్వానించతగినవి
ఆరోగ్య రంగానికి మరిన్ని కేటాయింపులు అవసరం
పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు

న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన నిర్ణయాలు డిమాండ్‌కు ప్రేరణనివ్వడంతోపాటు దేశ వృద్ధి రేటుకు బలాన్నిస్తాయని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలు అభిప్రాయపడ్డాయి. మధ్య తరగతి, రైతులకు ఇచ్చిన ప్రయోజనాలు వారు మరింత మొత్తంలో ఖర్చు చేసేందుకు వీలు కల్పిస్తాయని పేర్కొన్నాయి. రైతులు, అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులు, మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన అంశాలను ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలగని రీతిలో పరిష్కరించినట్టు ప్రముఖ పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ, ఆనంద్‌ మహీంద్రా, ఐటీసీ ఎండీ సంజయ్‌పూరి, వాల్‌మార్ట్‌ ఇండియా సీఈవో క్రిష్‌అయ్యర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘దేశ ఆర్థిక వృద్ధికి మధ్యతరగతి వర్గాలు, చిన్న వర్తకులు, రైతులు జీవనాడి వంటివారు. బడ్జెట్‌ 2019లో ప్రకటించిన నిర్ణయాలు లక్షలాది మంది కలలు’’
- గౌతం అదానీ, అదానీ గ్రూపు చైర్మన్‌

‘‘ఆర్థిక రంగ దివాలా పరిస్థితి రాకుండా కీలకమైన మధ్యతరగతి, రైతాంగ విభాగాలకు ఇచ్చిన ఉపశమన నిర్ణయాలు గొప్పగా ఉన్నాయి. నియంత్రణతో కూడిన, ప్రేరణనిచ్చే కసరత్తు ఇది. ఆదాయాన్ని స్థిరీకరించి, ఒత్తిడిని ఎదుర్కొంటున్న వర్గాలకు రిస్క్‌ను తగ్గిస్తాయి’’
- ఆనంద్‌ మహీంద్రా, మహీంద్రా గ్రూపు చైర్మన్‌

‘‘దేశంలో వినియోగాన్ని భారీగా పెంచేందుకు ప్రోత్సాహకంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి.. ఇవి సమీప కాలంలో వృద్ధిని పెంచుతాయి’’
చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ ప్రెసిడెంట్‌

‘‘మధ్యతరగతి ప్రజలు, గ్రామీణరంగం, రైతుల ఆదాయాన్ని పెంచడంపై బడ్జెట్‌ బాగానే దృష్టి సారించింది’’
- క్రిష్‌ అయ్యర్‌, వాల్‌మార్ట్‌ ఇండియా సీఈవో

‘‘గ్రామీణ ప్రజలకు ఉపశమనం కలిగించే, వినియోగానికి ప్రేరణనిచ్చేలా బడ్జెట్‌ ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వృద్ధికి ఊతమిచ్చేలా, ద్రవ్య క్రమశిక్షణతో, అదే సమయంలో ప్రభుత్వ ఖజానాపై పెద్ద భారం పడకుండా బడ్జెట్‌ను ప్రకటించినందుకు నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని అభినందించాలి’’
- అనిల్‌ అగర్వాల్‌, వేదాంత రీసోర్సెస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌

‘‘వినియోగాన్ని పెంచడం, వ్యవసాయం, గ్రామీణ వర్గాలు, అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ప్రయోజనాలు కల్పించే సమగ్ర కార్యాచరణ వృద్ధికి ప్రేరణనిస్తుంది. బడ్జెట్‌ నిర్ణయాలు దేశ ఆర్థిక రంగానికి మంచి చేస్తాయి’’
- సంజయ్‌పూరి, ఐటీసీ ఎండీ

‘‘ఇది ఎన్నికల సంవత్సరం బడ్జెట్‌. అందరికీ ఉద్దేశించినది. రైతుల నుంచి వర్తకుల వరకు, అవ్యవస్థీకృత రంగంలోని పనివారి నుంచి మధ్యతరగతి వేతన జీవుల వరకు అందరికీ ఏదో ఒకటి ఉంది. ప్రభుత్వం చాలా సమతూకం పాటించింది. ద్రవ్యలోటుకు కట్టుబడి ఉంటామన్న సంకేతాన్నిచ్చింది. అయితే, ఆరోగ్య రంగానికి అదనపు కేటాయింపుల్లేకపోవడం లేదా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగానికి ప్రోత్సాహకాలు లేకపోవడం నిరాశ కలిగించింది’’
- కిరణ్‌ మజుందార్‌షా, బయోకాన్‌ సీఎండీ

‘‘వ్యవసాయం, మధ్యతరగతి వర్గాలే స్పష్టమైన లక్ష్యంతో బడ్జెట్‌ ​ఉంది. నేరుగా నగదు ప్రయోజనం, పన్ను మినహాయింపుతో లబ్ధిదారులకు రూ.93,000 కోట్ల మేర వెసులుబాటు కలిగిస్తుంది. ఈ పథకాలు వినియోగాన్ని పెంచుతాయి. గ్రామీణ ఆర్థిక రంగానికి మేలు చేస్తాయి’’
- పవన్‌ ముంజాల్‌, హీరోమోటోకార్ప్‌ చైర్మన్‌

‘‘ఒత్తిడిలో ఉన్న రైతాంగానికి ప్రభుత్వ నిర్ణయాలు మేలు చేస్తాయి. సామాన్యులు, వేతన జీవులు, రైతుల అంచనాలను చేరుకునేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయి. భారత్‌లో తయారీని ప్రపంచ ఆర్థిక రంగానికి చోదకంగా చేయాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ఉంది’’
- అశోక్‌ హిందుజా, హిందుజా గ్రూపు చైర్మన్‌

‘‘ప్రతీ రంగంలో, ప్రతీ వర్గంలో కొనుగోలు శక్తిని పెంచే విధంగా బడ్జెట్‌ ఉంది. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచడం చారిత్రక నిర్ణయం. దీంతో వారు ఖర్చు చేసేందుకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. మరింత మంది ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తారని, పరిశ్రమ వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్నాం’’
- వేణు శ్రీనివాసన్‌, టీవీఎస్‌ మోటార్‌ చైర్మన్‌

‘‘చిన్న, మధ్య స్థాయి రైతులకు ఆదాయాన్నిచ్చే పథకం ఎంతో ఆహ్వానించతగినది. పశు సంరక్షణ, చేపల పెంపకం కోసం వడ్డీ రాయితీతో కూడిన రుణాలు ఆయా రంగాలకు చేయూతనిస్తుంది. ఆదాయపన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచడం, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్‌ పరిమితిని రూ.40,000కు పెంచడం కొత్త డిపాజిట్లను ఆకర్షించేందుకు తోడ్పడతాయి’’
- రజనీష్‌ కుమార్‌, ఎస్‌బీఐ చైర్మన్‌

‘‘ఈ బడ్జెట్‌ మొత్తం మీద వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. బ్రాండెడ్‌ ఆహార ఉత్పత్తులు, కన్జ్యూమర్‌ ఉత్పత్తుల డిమాండ్‌కు ఊపునిస్తుంది. ద్రవ్యలోటును 3.4 శాతానికి సవరించడం కొంచెం ఆందోళన కలిగించే అంశం’’
- సునీల్‌ దుగ్గల్‌, డాబర్‌ ఇండియా సీఈవో

‘‘కనీస మద్దతు ధరలు, రైతులకు సంబంధించిన పథకంలో పెట్టుబడులు పెంచడం ద్వారా ఆర్థిక రంగానికి బలాన్నివ్వడం ఆహ్వానించతగినది. చిన్న రైతులకు కచ్చితంగా మేలు చేస్తుంది. పన్ను మినహాయింపు పెంచడం, పన్ను రిటర్నుల ప్రక్రియను సులభతరం చేయడం అన్నవి పన్నుల భారాన్ని తగ్గించడమే కాకుండా పన్నులు చెల్లించే వారి సంఖ్యను కూడా పెంచుతుంది’’
- సౌగత గుప్తా, మారికో ఎండీ, సీఈవో

‘‘ఇది వినియోగ ఆధారిత బడ్జెట్‌. ఎఫ్‌ఎంసీజీ రంగానికి తగిన వృద్ధి అవకాశాలను కల్పిస్తుంది’’
- వివేక్‌ గంభీర్‌, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ఎండీ, సీఈవో

‘‘ముందుచూపుతో కూడిన బడ్జెట్‌ ఇది. వినియోగదారుల చేతుల్లో ఖర్చు చేసేందుకు మరిన్ని నిధులు ఉండేలా చేస్తుంది. వీటికితోడు ఇటీవల పలు గృహోపకరణాలపై జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగదారులు చేసే ఖర్చు కూడా పెరుగుతుంది. ఇది మా రంగంలో డిమాండ్‌ పెంచుతుంది’’
- సునీల్‌ డిసౌజ, వర్ల్‌పూల్‌ ఇండియా ఎండీ

‘‘మధ్యంతర బడ్జెట్‌ మధ్యతరగతి, రైతులపై దృష్టి పెట్టింది. ఇది వినియోగాన్ని పెంచుతుంది. మంత్రి ప్రకటించిన గ్రామీణ విద్యుదీకరణ గ్రామీణ ప్రాంతంలోనూ డిమాండ్‌ను పెంచుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలు వృద్ధి క్షీణతను కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ ఎదుర్కొన్నది. పన్ను మినహాయింపు నిర్ణయంతో సెంటిమెంట్‌ మెరుగుపడి కన్జ్యూమర్‌ డ్యురబుల్‌ ఉత్పత్తుల డిమాండ్‌ పెరుగుతుంది’’
- కమల్‌నంది, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ సంఘం ప్రెసిడెంట్‌

‘‘ఆదాయపన్ను మినహాయింపు పెంపుతో సగటు మధ్య తరగతి వ్యక్తికి రూ.15,000-20,000 వరకు ఆదా అవుతుంది. ఇది గృహోపకరణాల వినియోగాన్ని పెంచుతుంది’’
- మనీష్‌ శర్మ, ప్యానాసోనిక్‌ ఇండియా సీఈవో

‘‘పరిశ్రమకు కచ్చితంగా సానుకూల బడ్జెట్‌. చేతిలో వినియోగానికి మరిన్ని నిధులు ఉంటే అది టీవీలు, ఏసీలు, వాషింగ్‌ మెషిన్లు వంటి డ్యురబుల్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతుంది’’
- విజయ్‌ మన్‌సుఖాని, మిర్క్‌ ఎలక్ట్రానిక్స్‌ ఎండీ

ఆరోగ్య రంగానికి మరిన్ని నిధుల అవసరం
రానున్న దశాబ్ద కాలానికి టాప్‌-10 ప్రాధాన్య అంశాల్లో ఆరోగ్య భారత్‌ను కూడా చేర్చడాన్ని దేశ హెల్త్‌కేర్‌ పరిశ్రమ స్వాగతించింది. ఈ రంగానికి అధిక బడ్జెట్‌ కేటాయింలను ఆశిస్తు‍న్నట్టు పేర్కొంది. సమగ్రమైన, విస్తృత, సమతుల్యతతో 2019-20 మధ్యంతర బడ్జెట్‌ ఉందని, ఆరోగ్య రంగానికి సంబంధించి ఎన్నో సానుకూలతలు ఉన్నాయని భారత హెల్త్‌కేర్‌ ఫెడరేషన్‌(నాట్‌హెల్త్‌) పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ రంగానికి ప్రాధాన్య రంగం హోదా విషయంలో అసంపూర్ణ అజెండాను ప్రభుత్వం సమీక్షించాలని సూచించింది.

‘‘సంక్షోభం లేని ఆరోగ్య వ్యవస్థకు, ఆరోగ్య భారత్‌ విషయంలో ప్రభుత్వ కట్టుబాటును మధ్యంతర బడ్జెట్‌ తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో నివసించే ప్రజల మధ్య ప్రయోజనాల పరంగా అంతరాన్ని తొలగించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని బడ్జెట్‌ ఎత్తి చూపింది. ప్రభుత్వ చర్యల్లో ఆరోగ్య సంరక్షణ చాలా కీలకంగా ఉండాలి. ఆరోగ్య సదుపాయాల విషయంలో పల్లెలు, పట్టణాల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు అవకాశాలను కోల్పోకూడదు. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే విధానాలు అవసరం’’
- సంగీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు జాయింట్‌ ఎండీ

‘‘2030 నాటికి సమగ్ర ఆరోగ్య, చక్కని ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ‘ఆరోగ్య భారత్‌’ లక్ష్యాన్ని బడ్జెట్లో పేర్కొనడం ఆసక్తికరం. అయితే, ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపును పెంచకపోవడం లోటు’’
- అజాద్‌మూపెన్‌, ఆస్గర్‌ డీఎం హెల్త్‌కేర్‌ చైర్మన్‌, ఎండీ

‘‘హెల్త్‌కేర్‌ పరిశ్రమ ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంపై అధిక నిధుల కేటాయింపును ఆశిస్తోంది. కానీ, ప్రస్తుత పెంపు తగినంత లేదు. ఒకవైపు దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యయాలను తగ్గించాలని ప్రభుత్వం కోరుకుంటుండగా, మరోవైపు వైద్య పరికరాల స్థానిక తయారీకి ప్రయోజనాలు కల్పించే ఒక్క పథకం లేదు’’
- గనేశ్‌ సబత్‌, షాజనాద్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ సీఈవో

‘‘దేశంలో సాయం ఆశించే వర్గానికి ఆయుష్మాన్‌ భారత్‌ చేదోడుగా నిలుస్తుంది. ఇది దేశ ఆరోగ్య రంగాన్ని పటిష్టంగా మారుస్తుంది. అయితే, ఇటుంటి భారీ పథకాన్ని అమలు చేయడం పెద్ద సవాలు. ప్రధానంగా భారీ ఎత్తున సదుపాయాలు, ఆరోగ్య రంగ సిబ్బంది, నిధులు అవసరం అవుతాయి. ప్రభుత్వం కొంత కేటాయింపులు చేసినా, ఇంకా ఎక్కువ కేటాయింపులు భవిష్యత్తులో అవసరం అవుతుంది’’
- సుదర్శన్‌ భల్లాల్‌, మణిపాల్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌

అందరికీ ఏదో ఒకటి ఇస్తూ బడ్జెట్‌లో సమతూకం పాటించారు. ఇది ఎన్నికల సంవవత్సరం బడ్జెట్‌. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు ప్రకటించారు. 2020 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 3.4 శాతం అన్నది పెద్ద క్రమశిక్షణ వైఫల్యం కాదు. ప్రభుత్వం ఏ విధంగా దీన్ని సాధిస్తోందో చూడాలి. రైతులకు కనీస ఆదాయం ఇచ్చే పీఎం కిసాన్‌ సన్మాన్‌ నిధి మంచి నిర్ణయం. దీనికి అయ్యే రూ.75,000 కోట్ల వ్యయం జీడీపీలో 0.26 శాతానికి సమానం.
- మహేష్‌ బాలసుబ్రమణ్యం, కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో

‘‘గ్రామీణ, పట్టణాల్లో పేదలను పైకి తీసుకొచ్చే లక్ష్యంతో బడ్జెట్‌ ఉంది. రైతుల ఆదాయాన్ని పెంచే పథకాలు, పన్నుల తగ్గింపు నిర్ణయాలు వినియోగాన్ని పెంచుతాయి’’
- భార్గవ్‌ దాస్‌గుప్తా, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

‘‘బడ్జెట్లో పెద్దగా నిరాశ కలిగించేది ఏదీ లేదు. సహజంగా ఇది మధ్యంతర బడ్జెట్‌. ఈ బడ్జెట్‌ చాలా వరకు విశ్లేషకుల అంచనాలను మించి ఉంది. రైతులకు ఆదాయాన్నిచ్చే పథకానికి వార్షికంగా రూ.75,000 కోట్ల వ్యయం అంచనాల కంటే చాలా తక్కువే ఉంది. ఆర్‌బీఐ నుంచి నగదు బదిలీ కూడా అసాధారణ అధికంగా అయితే ఏమీ లేదు. రైతులు, మధ్యతరగతి వర్గాలకు ఇచ్చిన ప్రయోజనాల వల్ల ఆటో, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో కొనుగోలు ఉండొచ్చు’’
- ధీరజ్‌ రెల్లి, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో

‘‘ఇదొక మంచి మధ్యంతర బడ్జెట్‌. వినియోగదారులు, రైతులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు ఉన్నాయి. వేతన జీవులకు రూ.5 లక్షలకు పన్ను మినహాయింపునివ్వడం చాలా పెద్ద ప్రభావమే చూపిస్తుంది. దీనివల్ల బీమా పథకాల కొనుగోళ్లు పెరుగుతాయి. ఆయుష్మాన్‌ భారత్‌కు ప్రభుత్వ ప్రాధాన్యంతో భవిష్యత్తులో ఆరోగ్య బీమా, హెల్త్‌కేర్‌ సదుపాయాలు విస్తరణ కూడా పెరుగుతుంది’’
- తపన్‌సింఘాల్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో

‘‘పన్ను పరిధిలోని మధ్యతరగతి ప్రజల చేతుల్లో ఖర్చు చేసేందుకు మరింత డబ్బులను మిగిల్చేలా బడ్జెట్‌ నిర్ణయాలు ఉన్నాయి. ప్రామాణిక తగ్గింపును రూ.40,000 నుంచి రూ.50,000వేలకు పెంచడం, రూ.5 లక్షల ఆదాయానికి పన్ను మినహాయింపు పెంచడం చేశారు. దీనికి తోడు సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షలు, ఎన్‌పీఎస్‌లో రూ.50,000, సెక్షన్‌ 24 కింద ఇంటి రుణంపై వడ్డీకి మినహాయింపు రూ.2,00,000ను కూడా కలిపి చూస్తే వాస్తవ పన్ను లేని ఆదాయం రూ.9,50,000. ఆదాయపన్ను పరంగా ఇది నిజంగా చెప్పుకోతగిన బడ్జెట్‌’’
- వైభవ్‌ అగర్వాల్‌, యాంజెల్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ హెడ్‌

‘‘నూతన భారత్‌ కోసం ఉద్దేశించిన బడ్జెట్‌ ఇది. సమాజంలోని పలు వర్గాలకు సంబంధించి ప్రాధాన్యతల విషయంలో తాత్కాలిక ఆర్థిక మంత్రి సమతుల్యం పాటించారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్య అంతరాలను భర్తీ అంశాలను పరిష్కరించేలా ఉంది. పన్ను మినహాయింపులు, తక్కువ ద్రవ్యోల్బణం దేశీయ డిమాండ్‌ను, వినియోగాన్ని పెంచుతాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ పెరుగుతుంది’’
- రితేష్‌ అగర్వాల్‌, ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ వ్యవస్థాపకుడు, గ్రూపు సీఈవో

ఎన్నికల ముందు బడ్జెట్‌ కావడంతో ఆర్థిక మంత్రి ముందు ఎన్నో అవరోధాలు ఉన్నాయి. అయినప్పటికీ ఉన్న పరిమితుల మధ్య నిర్ణయాల పరంగా మధ్యేమార్గాన్ని ఎంచుకున్నారు. పన్నుల భారాన్ని మోస్తున్న వారికి ప్రభుత్వ నిర్ణయాలు సానుకూల ప్రభావం చూపిస్తాయి. వ్యవసాయ రంగం, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడం అన్నది ఎన్నికల తర్వాత ఎలాగూ ప్రాధాన్య అంశాలుగా ఉంటాయి. ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లు, పదేళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు వీలుగా ఆర్థిక మూలాలు ఉన్నాయి.
- బాబా ఎన్‌ కల్యాణి, భారత్‌ ఫోర్జ్‌ చైర్మన్‌, ఎండీ

‘‘అద్భుతమైన బడ్జెట్‌. దేశంలో అతిపెద్ద వర్గమైన మధ్యతరగతి, రైతులకు, అవ్యవస్థీకృత రంగంలోని పనివారికి ఏదైనా చేసేందుకు ఆర్థిక మంత్రి ప్రయత్నించారు. అదే సమయంలో ద్రవ్యలోటు 3.4 శాతం స్థాయిలోనే కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నారు. ఇది ప్రజానుకూల బడ్జెట్‌. ఆర్థిక రంగానికి మేలు చేస్తుంది. ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేసే బడ్జెట్‌’’
- అజయ్‌ సింగ్‌, స్పైస్‌జెట్‌ చైర్మన్‌, ఎండీ

‘‘డిజిటల్‌ ఇండియా ఏర్పాటుకు టెక్నాలజీని ప్లాట్‌ఫామ్‌గా వినియోగించుకునే విషయంలో ప్రభుత్వం తన అంకిత భావాన్ని చాటుకుంది. టెక్నాలజీ రంగానికి సరైన ప్రోత్సాహకాలను ఇచ్చింది. తొమ్మిది ప్రాధాన్య రంగాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా జాతీయ స్థాయిలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌ ఏర్పాటు నిర్ణయం టెక్నాలజీ అంటే ప్రభుత్వానికి ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తోంది’’
- సుమన్‌రెడ్డి ఏదునూరి, పెగాసిస్టమ్స్‌ ఎండీ

‘‘స్టార్టప్‌ల్లో పెట్టుబడులపై ఏంజెల్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలని, జీఎస్టీకి సంబంధించి మరింత స్పష్టత ఇవ్వాలన్న పరిశ్రమ విజ్ఞప్తులకు ఈ బడ్జెట్‌లో చోటు కల్పించలేదు. అయితే, తగిన చర్చల ద్వారా వీటిని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం’’
- ఐటీ తయారీ దారుల సంఘం నాస్కామ్‌

‘‘లక్ష డిజిటల్‌ గ్రామాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం డిజిటల్‌ పరంగా అంతరాలను తగ్గిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్‌ పారిశ్రమలను ప్రోత్సహిస్తుంది’’
- వి.రామకృష్ణన్‌, టీసీఎస్‌ సీఎఫ్‌వో

‘‘2 హెక్టార్ల భూమి (ఐదెకరాల్లోపు) ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 ఇవ్వాలన్న పథకం లక్షలాది మంది పత్తి రైతులకు మేలు చేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం వారికి చేయూతనిస్తుంది’’
- పి.నటరాజ్‌, సదరన్‌ ఇండియా మిల్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌

‘‘బడ్జెట్‌ ప్రకటనలు స్టీల్‌ రంగానికి మొత్తం మీద సానుకూలం. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మధ్యంతర బడ్జెట్‌లోనూ చోటు కల్పించారు. రైల్వేలు, రోడ్లు, జలమార్గాలు వృద్ధికి కీలకం’’
- ఏకే చౌదరి, సెయిల్‌ చైర్మన్‌You may be interested

బేర్‌ మార్కెట్‌ మంచిదే!

Saturday 2nd February 2019

షేర్‌ మార్కెట్లో బుల్స్‌, బేర్స్‌ రెండూ అవసరమేనని ప్రముఖ ఇన్వెస్టర్‌ శంకర్‌ శర్మ చెప్పారు. బేర్‌ మార్కెట్‌ ఎథికల్‌ హ్యాకర్‌ లాంటిదని, దీని కారణంగా వ్యవస్థలో దాగున్న లొసుగులు బయటపడతాయని అభిప్రాయపడ్డారు. బేర్‌ మార్కెట్‌ కారణంగా సిస్టమ్‌ క్లీనవుతుందని, అప్పుడు తిరిగి ర్యాలీకి ఛాన్సులుంటాయని చెప్పారు. పెద్ద పెద్ద స్కామ్‌లు బయటపడాలంటే బేర్‌మార్కెట్‌ తప్పక రావాలన్నారు. ఇలాంటి స్కాములను బుల్‌ మార్కెట్‌ కప్పిపెడుతుందని చెప్పారు. అందువల్ల బేర్స్‌ పాత్ర చాలా

ద్రవ్యబాటలో ఒడిదుడుకులు

Saturday 2nd February 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు కట్టుతప్పనున్న విషయం స్పష్టమైపోయింది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3.4 శాతంగా ఉండే అవకాశం ఉందని స్వయంగా ఆర్థికమంత్రే సూచించడం గమనార్హం. 2018-19  ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ద్రవ్యలోటు ఉండాలని వార్షిక బడ్జెట్‌ నిర్దేశించింది. విలువలో ఇది రూ.6.24 లక్షల కోట్లు. అయితే 2018 నవంబర్‌ పూర్తయ్యే నాటికే ఈ లోటు రూ.7.16 లక్షల కోట్లను తాకింది. అంటే

Most from this category