News


స్టార్టప్స్‌కు తోడ్పాటు!!

Saturday 6th July 2019
news_main1562391568.png-26838

  •  పన్ను వివాదాల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం
  •  ఏంజెల్‌ ట్యాక్స్‌ విషయంలో ఊరట
  •  స్టార్టప్స్‌ కోసం ప్రత్యేక టీవీ చానల్‌

న్యూఢిల్లీ: స్టార్టప్‌ సంస్థలను ప్రోత్సహించే దిశగా కేంద్రం బడ్జెట్‌లో పలు చర్యలు ప్రతిపాదించింది. పెండింగ్‌లో ఉన్న ఆదాయ పన్ను అసెస్‌మెంట్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అలాగే, ఏంజెల్‌ ట్యాక్స్‌ విషయంలోనూ కొంత ఊరటనిచ్చే చర్యలు ప్రకటించింది. "స్టార్టప్‌ సంస్థలు ప్రస్తుతం వేళ్లూనుకునే దశలో ఉన్నాయి. వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకే ఏంజెల్‌ ట్యాక్స్‌ వివాద పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తమ రిటర్నులు, డిక్లరేషన్‌లో నిర్దేశిత వివరాలను సమర్పించే ఇన్వెస్టర్లు, స్టార్టప్‌ సంస్థలు ఇకపై షేర్ల ప్రీమియంల వేల్యుయేషన్స్‌పై ఎటువంటి స్క్రూటినీ ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు" అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఇన్వెస్టర్లు, వారికి నిధులు వచ్చిన మార్గాలను ధృవీకరించుకునేందుకు ఈ–వెరిఫికేషన్‌ వంటి విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. స్టార్టప్స్‌ ప్రారంభ, వృద్ధి దశలో ఏంజెల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతుంటారు. సాధారణంగా ఏటా 300–400 స్టార్టప్స్‌ ఒక్కోటీ ఈ రూపంలో దాదాపు రూ. 15 లక్షల నుంచి రూ. 4 కోట్ల దాకా నిధులు సమీకరించుకుంటున్నాయి. అయితే, రూ. 25 కోట్ల దాకా ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పన్ను పరమైన మినహాయింపులు ప్రకటించినా.. ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తున్నాయంటూ స్టార్టప్‌ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. 

రెండో కేటగిరీ ఏఐఎఫ్‌లకు కూడా మినహాయింపులు..
ప్రస్తుతం నిర్దిష్ట ఇన్వెస్టర్లతో పాటు మొదటి కేటగిరీలోకి వచ్చే ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్‌ (ఏఐఎఫ్‌1)కు కేటాయించే షేర్ల ప్రీమియం గురించి స్టార్టప్స్‌ ప్రత్యేకంగా వివరణనివ్వక్కర్లేదు. ఈ వెసులుబాటును రెండో కేటగిరీ ఏఐఎఫ్‌లకు కూడా వర్తింపచేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఫండ్స్‌ చేసే పెట్టుబడులకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 56 కింద మినహాయింపు లభిస్తుంది. ఇక స్టార్టప్‌ సంస్థల పెండింగ్‌ అసెస్‌మెంట్లు, వాటి ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)లో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు కానున్నట్లు ఆమె వివరించారు. సూపర్‌వైజరీ అధికారి నుంచి అనుమతి లేకుండా అసెసింగ్‌ అధికారి ఎటువంటి విచారణ జరపడానికి వీల్లేదని తెలిపారు. స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం నివాస గృహాన్ని విక్రయించిన పక్షంలో సదరు నిధులకు క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపునివ్వడాన్ని 2021 మార్చి 31 దాకా పొడిగిస్తున్నట్లు మంత్రి చెప్పారు. నష్టాలను క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోవడం, సెటాఫ్‌ చేసుకోవడానికి సంబంధించిన నిబంధనల సడలిస్తున్నట్లు తెలిపారు. 

వృద్ధి అవకాశాలకు వేదికగా చానల్‌..
స్టార్టప్‌ సంస్థల కోసం ప్రత్యేకంగా టీవీ చానల్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అంకుర సంస్థల వృద్ధి అవకాశాలు, వెంచర్‌ క్యాపిటలిస్టులు మొదలైన వారి వివరాలు తెలుసుకునేందుకు ఇది వేదికగా ఉపయోగపడగలదని ఆమె చెప్పారు. దీన్ని పూర్తిగా స్టార్టప్‌ సంస్థలే రూపొందించి, నిర్వహిస్తాయని వివరించారు. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన స్టార్టప్‌ సంస్థలు 19,665 పైచిలుకు ఉన్నాయి. వీటికి పన్ను పరమైన మినహాయింపులు, ఇతరత్రా ప్రోత్సాహకాలు పొందేందుకు అర్హత ఉంటుంది.  You may be interested

ఎన్‌బీఎఫ్‌సీలకు బాసట ..

Saturday 6th July 2019

అసెట్స్‌ కొనుగోలు చేసే పీఎస్‌బీలకు పాక్షిక రుణ హామీ ఆర్‌బీఐకి మరిన్ని నియంత్రణాధికారాల ప్రతిపాదనలు న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) కొంత ఊరటనిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల నుంచి అత్యుత్తమ రేటింగ్‌ ఉన్న అసెట్స్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) కొనుగోలు చేస్తే కేంద్రం వన్‌–టైమ్‌ పాక్షిక రుణ హామీ ఇవ్వనున్నట్లు

ఎఫ్‌పీఐలకు సులభ కేవైసీ

Saturday 6th July 2019

సామాజిక సంస్థలు, స్వచ్చంద సంస్థలకు నిధుల సమీకరణ వేదిక ఇందుకోసం సోషల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రజల వాటా 35 శాతానికి బడ్జెట్లో ప్రతిపాదనలు క్యాపిటల్‌ మార్కెట్లను ప్రజలకు మరింత చేరువ చేసే చర్యలు నిర్మలాసీతారామన్‌ బడ్జెట్లో కనిపించాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) సంబంధించి కేవైసీ నిబంధనల సడలింపు, సామాజిక, స్వచ్చంద సంస్థల లిస్టింగ్‌కు అవకాశం, లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రజల కనీస వాటా 25 శాతం నుంచి 35 శాతానికి పెంపు ప్రతిపాదనలు

Most from this category