News


ఎఫ్‌డీఐ ఇక రయ్‌రయ్‌!

Saturday 6th July 2019
news_main1562395016.png-26847

  • మీడియా, ఏవియేషన్‌, బీమా, సింగిల్‌ బ్రాండ్ రిటైల్‌లో వెసులుబాటు
  • విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: బీమా, మీడియా, ఏవియేషన్‌, సింగిల్‌ బ్రాండ్ రిటైల్‌ రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులు ఆకర్షించే దిశగా కేంద్రం బడ్జెట్‌లో చర్యలు ప్రతిపాదించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2018-19లో ఎఫ్‌డీఐలు 6 శాతం వృద్ధితో 64.37 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఆమె వివరించారు. "భారత్‌ను ఎఫ్‌డీఐలకు ఆకర్షణీయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. సంబంధిత వర్గాలతో చర్చించి ఏవియేషన్, మీడియా, ఏవీజీసీ (యానిమేషన్‌, విజువల్ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌), బీమా రంగాల్లో మరిన్ని ఎఫ్‌డీఐలను ఆకర్షించేందుకు తీసుకోతగిన చర్యలు అధ్యయనం చేస్తాం" అని మంత్రి వివరించారు. బీమా మధ్యవర్తిత్వ సంస్థల్లో 100 శాతం ఎఫ్‌డీఐను అనుమతించనున్నట్లు, సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలకు సంబంధించి స్థానిక సోర్సింగ్ నిబంధనలను సడలించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం వార్తాపత్రికల్లో 26 శాతం దాకా ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. అటు బీమా రంగంలో (ఇన్సూరెన్స్ బ్రోకింగ్‌, ఇన్సూరెన్స్ కంపెనీలు, థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్‌, సర్వేయర్స్‌ మొదలైన విభాగాలు) 49 శాతం దాకా ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. అయితే, 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్న ఆర్థిక సేవల మధ్యవర్తిత్వ సంస్థలకు సమానంగా బీమా బ్రోకింగ్ సంస్థలను కూడా పరిగణించాలంటూ ఆయా సంస్థలు కోరుతున్నాయి. 
    సింగిల్‌ బ్రాండ్ రిటైల్‌ రంగంలో స్థానిక సోర్సింగ్ నిబంధనలను సడలించనున్నట్లు  తప్పనిసరిగా నిర్దిష్ట స్థాయిలో స్థానిక కొనుగోళ్లు జరపాల్సిందేనన్న నిబంధనపై పలు విదేశీ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 30 శాతం కొనుగోళ్లు స్థానికంగా జరపడం అసాధ్యంగా ఉంటోందంటూ హై-ఎండ్ టెక్నాలజీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్‌లో తమ సింగిల్‌ బ్రాండ్ రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు స్థానిక సోర్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపునివ్వాలంటూ టెక్ దిగ్గజం యాపిల్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. నిబంధన పాటింపునకు నిర్దేశించిన వ్యవధిని పొడిగించడం ద్వారా కొంత వెసులుబాటు కల్పించాలంటూ గతంలో పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం విభాగం (డీపీఐఐటీ) భావించినప్పటికీ అప్పట్లో దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.  ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైల్‌లో 51 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ 2006లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 2018 జనవరిలో దీన్ని 100 శాతానికి పెంచింది.


 



You may be interested

‘రక్షణ’కు రూ. 3.18 లక్షల కోట్లు

Saturday 6th July 2019

- మధ్యంతర బడ్జెట్‌ కేటాయింపులే కొనసాగింపు - రక్షణ పరికరాల దిగుమతికి కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు  న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో 2019- 20 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ శాఖకు రూ. 3.18 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది రక్షణ శాఖకు రూ. 2.98 లక్షల కోట్లు కేటాయించగా, ఈ ఏడాది స్వల్పంగా నిధులు పెంచారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో చేసిన రక్షణ శాఖకు కేటాయింపులనే

హోం శాఖకు 1.19 లక్షల కోట్లు

Saturday 6th July 2019

మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణకు పెద్దపీట కేంద్ర సాయుధ బలగాలకు రూ. 71 వేల కోట్లు 2021 జనగణన సన్నాహకాలకు రూ. 621 కోట్లు న్యూఢిల్లీ: హోం మంత్రిత్వ శాఖకు మొత్తంగా రూ. 1,19,025 కోట్లను ఈ బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ. 5,858 కోట్లు ఎక్కువ. మౌలిక వసతులను మెరుగుపర్చడం, పోలీసు వ్యవస్థను ఆధునీకరించడం, సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన రక్షణ కల్పించడంపై కేంద్రం ఎక్కువగా

Most from this category