News


మోదీ సర్కారు ‘వృద్ధి’ మంత్రం!

Sunday 2nd February 2020
news_main1580615244.png-31418

 • ఇటు వేతనజీవులు అటు కార్పొరేట్లను మెప్పించే తంత్రం
 • వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు, శ్లాబుల్లో భారీ మార్పులు
 • కంపెనీలపై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్ను పూర్తిగా తొలగింపు....
 • పడిపోతున్న వృద్ధిరేటుకు ఊతమిచ్చేలా వ్యయాన్ని పెంచాలని నిర్ణయం
 • రాబడులు తగ్గడంతో ద్రవ్యలోటు అదుపుతప్పినా వెరవని వైనం
 • ప్రభుత్వ ఖజానాకు చిల్లు.. ‘ఎల్‌ఐసీ’తో చెల్లు..
 • పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా ఎల్‌ఐసీలో వాటా విక్రయానికి సై
 • తద్వారా పెద్దమొత్తంలో నిధుల సమీకరణకు ప్రణాళిక...
 • వ్యవసాయం, మౌలికవసతుల రంగాలకు భారీగా కేటాయింపులు
 • రైల్వేల్లో మరింతగా ‘ప్రైవేటు’ కూతకు పచ్చజెండా
 • విద్య, వైద్యంలో కూడా ప్రైవేటు పెట్టుబడులకు ప్రతిపాదన
 • కట్టుతప్పిన ద్రవ్యలోటు, ఇన్వెస్టర్లను విస్మరించడంపై స్టాక్‌ మార్కెట్‌ గుర్రు
 • కుప్పకూలిన సూచీలు... సెన్సెక్స్‌ 988 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు డౌన్‌ 

 న్యూఢిల్లీ: భయపెడుతున్న ద్రవ్యలోటు ఒకవైపు... అంతకంతకూ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ మరోవైపు... ఇలాంటి సంకట పరిస్థితుల్లో కీలకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మోదీసర్కారు వృద్ధిరేటుకే తన ఓటు వేసింది. ఆదాయపు పన్ను(ఐటీ) రేట్లలో కోత ద్వారా వేతనజీవులకు ఊరటతో పాటు డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ) భారం నుంచి కంపెనీలకు పూర్తిగా ఉపశమనం కల్పించి అటు కార్పొరేట్లను మెప్పించే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. దశాబ్దకాలంలోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన మందగమనాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రభుత్వ వ్యయాన్ని కూడా భారీగానే పెంచుతూ ఎడాపెడా కేటాయింపులు చేశారు. ముఖ్యంగా వ్యవసాయం, మౌలిక సదుపాయాలకు పెద్దపీటవేశారు. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్యాలను కూడా పెంచేశారు. లోటును పూడ్చుకోవడానికి ‘ఎల్‌ఐసీ’ని తురుపుముక్కగా ఆమె ప్రయోగించారు. మొత్తంమీద 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను శనివారం సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో భారీస్థాయిలో మెరుపులేవీలేనప్పటికీ... అత్యంత తీవ్రంగా నిరాశపరిచే అంశాలు కూడా లేవనేది విశ్లేషకుల మాట!!
వేతనజీవులకు ఊరట...
మధ్య, ఎగువ మధ్య తరగతి వేతనజీవులకు ఊరటనిచ్చేందుకు ఐటీ రేట్లు, శ్లాబుల్లో కీలక మార్పులకు మోదీ సర్కారు శ్రీకారం చుట్టింది. రూ.10 లక్షల పైబడి వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు దీనివల్ల సుమారుగా ఒక ఏడాదిలో రూ.1,820 నుంచి రూ.20,300 ఆదా అవుతుందని అంచనా. అయితే, ఇప్పుడున్న రూ.50,000 స్టాండర్డ్‌ డిడక‌్షన్‌తో పాటు బీమా ప్రీమియం, భవిష్య నిధి, పిల్లల స్కూలు ఫీజులు, ఇతరత్రా అనేక మినహాయింపులన్నింటినీ వదులుకుంటేనే ఈ కొత్త రేట్ల ప్రకారం పన్ను ప్రయోజనం లభిస్తుంది. కొత్త విధానం వద్దనుకునేవారికి పాత శ్లాబులు, రేట్లను కొనసాగించుకునే వెసులుబాటును కూడా బడ్జెట్లో సీతారామన్‌ కల్పించడం విశేషం. అయితే, పన్ను విధానాన్ని సరళీకరిస్తున్నామంటూనే... మరింత గందరగోళంగా మార్చారంటూ పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ద్రవ్యలోటు లక్ష్యానికి తిలోదకాలు...
వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా పలు రంగాలకు భారీగా కేటాయింపులు జరపాల్సిన తరుణంలో ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) లక్ష్యాలకు కేంద్రం పూర్తిగా నీళ్లొదిలేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 3.3 శాతంగా నిర్దేశించిన ప్రభుత్వం... ఇప్పుడు దీన్ని 3.8 శాతానికి సడలించింది. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21) ద్రవ్యలోటు లక్ష్యాన్ని కూడా గతంలో 3 శాతంగా అంచనావేయగా... దీన్ని ఇప్పుడు 3.5 శాతానికి పెంచేసింది. దీనివల్ల మార్కెట్‌ నుంచి 2020-21లో ఏకంగా రూ.5.36 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రుణ సమీకరణను కూడా రూ.4.99 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు.

ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ...
భారత్‌ ఇప్పుడు ప్రపంచంలో అయిదో ఆర్థిక వ్యవస్థగా(దాదాపు 2.5 ట్రిలియన్‌ డాలర్లు) ఎదిగిందని బడ్జెట్‌ ప్రసంగంలో సీతారామన్‌ పేర్కొన్నారు. 2014 మార్చి నాటికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 52.2 శాతంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రుణాలు... 2019 మార్చినాటికి 48.7 శాతానికి దిగొచ్చాయని చెప్పారు. అంతేకాదు... 2014-19 మధ్యలో సగటు జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదైందని... ద్రవ్యోల్బణాన్ని సగటున 4.5 శాతానికి కట్టడి చేశామని కూడా ఆర్థిక మంత్రి వివరించారు. కాగా, 2024 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలసిందే.

ఆర్థిక క్రమశిక్షణకు సవాళ్లు: మూడీస్‌
భారత్‌లో జీడీపీ వృద్ధి మందగమనం ప్రభుత్వం చెబుతున్నదానికంటే చాలా ఎక్కువకాలమే కొనసాగే అవకాశం ఉందని... దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ(ద్రవ్యలోటు కట్టడి)కు తీవ్రమైన సవాళ్లు పొంచిఉన్నాయని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. ప్రస్తుతం భారత్ సార్వభౌమ(సావరీన్‌) రేటింగ్‌పై తమ ప్రతికూల దృక్పథాన్ని(నెగటివ్‌ అవుట్‌లుక్‌) ఈ రిస్కులు ప్రతిబింబిస్తున్నాయని కూడా అభిప్రాయపడింది. ప్రస్తుతం భారత్‌కు మూడీస్‌ ‘బీఏఏ2(ప్రతికూల అవుట్‌లుక్‌)ను కొనసాగిస్తోంది. ఈ స్థాయి రేటింగ్‌ ఉన్న దేశాలతో పోలిస్తే.. భారత్‌ రుణభారం చాలా ఎక్కువగా ఉందని కూడా మూడీస్‌ స్పష్టం చేసింది. ‘బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యాలను 3.8 శాతం(2019-20 ఏడాదికి), 3.5 శాతాలకు(2020-21 సంవత్సరానికి) సడలించడం,  బలహీన వృద్ధి, పన్నుల కోతలను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వం స్థూల ఆదాయ లక్ష్యాలను సాధించడం కష్టసాధ్యమే’ అని రేటింగ్‌ దిగ్గజం కుండబద్దలుకొట్టింది.

బంగారుబాతు.. ఎల్‌ఐసీ!
ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి మోదీ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో ప్రతిపాదనల్లోనే ఉన్న ‘ఎల్‌ఐసీ’ వాటా విక్రయం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ)లో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంది. దీనిలో కొంత వాటాను పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) ద్వారా విక్రయించడం ద్వారా స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. ఇప్పటిదాకా ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్‌) ప్రక్రియలో ఎల్‌ఐసీ నుంచే (షేర్లను కొనిపించడం ద్వారా) ప్రభుత్వం నిధులను లాగేస్తూ వస్తోంది. ఇప్పుడు నేరుగా ఎల్‌ఐసీలోనే వాటాను అమ్మడం అంటే... ‘బంగారు బాతు’ సామెతను తలపిస్తోందని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

బ్యాంకు డిపాజిట్లపై ఇకపై రూ.5లక్షల బీమా రక్షణ!
బ్యాంకులేవైనా దివాలాతీస్తే ఇప్పటివరకూ డిపాజిట్‌దారులకు రూ.లక్ష వరకూ మాత్రమే బీమా రక్షణ ఉంది. దీన్ని ఇప్పుడు ఏకంగా ఐదు రెట్లకు.. అంటే రూ.5 లక్షలకు పెంచుతూ బడ్జెట్‌లో కేంద్రం నిర‍్ణయం తీసుకుంది. గతేడాది మహారాష్ట్రకు చెందిన పీఎంసీ బ్యాంకు స్కామ్‌ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో డిపాజిటర్లు గగ్గోలు పెట్టడం తెలిసిందే. ఈ పరిణామం నేపథ్యంలోనే డిపాజిట్లపై బీమా రక్షణను భారీగా పెంచుతున్నట్లు మోదీ సర్కారు ప్రకటించడం గమనార్హం.

ఆదాయాలు, కొనుగోలు శక్తి పెంపే లక్ష్యం...
వరుసగా రెండో ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌... దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగానే ఉన్నాయని ఉద్ఘాటించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలోనే ఉంచుతున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తిని పెంచడమే లక్ష్యంగా 2020-21 బడ్జెట్‌లో కీలక చర్యలను ప్రకటించామని ఆమె స్పష్టం చేశారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు వీలుగా వంట సామగ్రి నుంచి ఎలక్ట్రికల్‌ పరికరాలు, ఫర్నీచర్‌, స్టేషనరీ, ఆటబొమ్మలు ఇలా అనేక ఉత్పత్తుల దిగుమతులపై సుంకాన్ని పెంచారు. మరోపక్క, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే లక్ష్యంతో వ్యవసాయం... గ్రామీణాభివృద్ధికి ఏకంగా రూ.2.83లక్షల కోట్లను కేటాయించారు. రైతు రుణాల లక్ష్యాన్ని 2020-21లో రూ.15 లక్షల కోట్లకు పెంచారు. రూ.1.7 లక్షల కోట్లను రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు. కీలకమైన ఇంధన రంగానికి కూడా రూ.40,750 కోట్లు కుమ్మరించడం విశేషం. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో కొన్ని స్కీములకు కేటాయింపుల పెంపు ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని 2020-21లో 13 శాతం మేర పెంచేలా సీతారామన్‌ చర్యలు చేపట్టారు. అయితే, ప్రస్తుతం ఉన్న తీవ్ర మందగమనానికి ఐటీ ఊరట, వ్యయాల పెంపు వంటి ఈ అరకొర చర్యలు సరిపోవని.. భారీ ఉద్దీపనలు అత్యవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.

కార్పొరేట్లకు రూ.25,000 కోట్ల తాయిలం...
గతేడాది సెప్టెంబర్‌లో కార్పొరేట్‌ పన్నును 30 శాతం స్థాయి నుంచి ఏకంగా 22 శాతానికి తగ్గిస్తూ.. కీలక నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకుంది. కొత్తగా ప్లాంట్లు నెలకొల్పే కంపెనీలకైతే 15 శాతం పన్నునే వర్తింపజేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ) భారం నుంచి కూడా కార్పొరేట్లకు ఉపశమనం కలిగించి.. మందగమనంలో ఉన్న పరిశ్రమలకు ఊరటనిచ్చే చర్యలను కేంద్రం తీసుకుంది. డీడీటీని ఇకపై నిర్ధేశిత శ్లాబులను అనుసరించి డివిడెండ్‌ పొందినవారే చెల్లించాల్సి ఉంటుంది. ఈ తాజా ప్రతిపాదనతో ప్రభుత్వ ఖజానాకు రూ.25,000 కోట్లు చిల్లుపడుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. మరోపక్క, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ‘ఇంద్రధనుష్‌’ పథకంలో భాగంగా ఇప్పటికే దండిగా మూలధనం అందించడం.. పలు బ్యాంకులను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బడ్జెట్‌లో ప్రత్యేకంగా వీటికి సంబంధించి ఎలాంటి ప్రకటనలూ చేయలేదు.

స్టార్టప్‌లకు దన్ను...
స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా సీతారామన్‌ కీలక చర్యలు తీసుకున్నారు. ఎంప్లాయీ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌ (ఎసాప్స్‌)పై అయిదేళ్ల పాటు ట్యాక్స్‌ హాలిడే ప్రకటించారు. "ఎసాప్స్‌కి సంబంధించి ఉద్యోగులపై తక్షణ పన్ను భారం పడకుండా అయిదేళ్ల పాటు లేదా వారు సంస్థ నుంచి తప్పుకునే దాకా లేదా విక్రయించే దాకా (ఏది ముందైతే అది) ట్యాక్స్‌ హాలిడే వర్తిస్తుంది" అని మంత్రి పేర్కొన్నారు. శైశవ దశలో ఉన్న స్టార్టప్‌ సంస్థలు నిపుణులైన సిబ్బందిని ఆకర్షించేందుకు, సంస్థను విడిచిపెట్టి వెళ్లిపోకుండా అట్టే పెట్టుకునేందుకు ఈ ఎసాప్స్‌ ఉపయోగపడతాయి. 

మార్కెట్లు ‘బేర్‌’...
ద్రవ్యలోటు లక్ష్యాలను పూర్తిగా గాలికొదిలేయడం... ఇన్వెస్టర్లను మెప్పించే చర్యలను(దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను-ఎల్‌టీసీజీ తొలగించాలన్నది మార్కెట్‌ వర్గాల ప్రధాన డిమాండ్‌) విస్మరించడం... వృద్ధికి ఊతమిచ్చేలా నిర్ధుష్ట చర్యలేవీ ప్రకటించకపోవడం వంటి కారణాలతో స్టాక్‌ మార్కెట్లు బడ్జెట్‌ పట్ల తీవ్రంగా స్పందించాయి. సెన్సెక్స్‌ ఏకంగా 988 పాయింట్లు కుప్పకూలింది. దాదాపు దశాబ్దకాలంలో ఒక్కరోజులో ఇంత భారీ నష్టాన్ని చవిచూడటం గమనార్హం. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 300 పాయింట్లు క్షీణించింది.

 


‘వృద్ధి’దాయక బడ్జెట్‌: మోదీ
‘ఆర్థిక వృద్ధిరేటు పుంజుకోవడానికి ఈ బడ్జెట్‌ తోడ్పడుతుంది. ఈ కొత్త దశాబ్దంలో దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆర్థికంగా మరింత పరిపుష్టం చేయడంతోపాటు ఆర్థిక వ్యవస్థ పునాదులను బలోపేతం చేస్తుంది’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దూరదృష్టి, సరైన కార్యాచరణతో కూడిన బడ్జెట్‌గా ఆయన ప్రశంసించారు. ‘ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను సరళీకరించడం, డిజిన్వెస్ట్‌మెంట్‌ వంటివి బడ్జెట్లో చాలా ముఖ్యమైనవి. దీనివల్ల ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి... ప్రజలు మరింత మెరుగైన జీవనాన్ని సాగించేందుకు దోహదపడుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. 

 You may be interested

స్టార్టప్‌లకు జోష్‌

Sunday 2nd February 2020

ఎసాప్స్‌పై అయిదేళ్ల ట్యాక్స్‌ హాలిడే రూ. 100 కోట్లలోపు టర్నోవరున్న సంస్థలకూ పన్ను ప్రయోజనాలు న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు ఊతమిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు చేశారు. ఎంప్లాయీ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌ (ఎసాప్స్‌)పై అయిదేళ్ల పాటు ట్యాక్స్‌ హాలిడే ప్రకటించారు. "ఎసాప్స్‌కి సంబంధించి ఉద్యోగులపై తక్షణ పన్ను భారం పడకుండా అయిదేళ్ల పాటు లేదా వారు సంస్థ నుంచి తప్పుకునే దాకా లేదా విక్రయించే దాకా

కొందిరికి మోదం .. కొందరికి ఖేదం

Sunday 2nd February 2020

మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను చూస్తే పదకొండేళ్ల కనిష్టానికి పడిపోయిన దేశ ఆర్ధిక వృద్ధిని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉంది. తాజా బడ్జెట్‌తో మళ్లీ ఒకప్పటి ఆర్థిక పరిపుష్టత సాధనపై కేంద్రం దృష్టి పెట్టిందనే అభిప్రాయం కలుగుతోంది. ఆదాయాలు, కొనుగోలు శక్తి పెంపుదలే ప్రస్తుత బడ్జెట్‌ లక్ష్యమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడం

Most from this category