News


జీడీపీ అంచనాలు కట్‌

Wednesday 4th September 2019
news_main1567576401.png-28177

  • కుదించిన  ఆర్థిక సేవల సంస్థలు
  • కోలుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం
  • రికవరీ బలహీనంగానే ఉండొచ్చని అంచనా

న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను ఆర్థిక సేవల సంస్థలు కుదించాయి. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ఫిచ్‌ సొల్యూషన్స్‌.. 6.8 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించగా, సింగపూర్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం డీబీఎస్‌ కూడా 6.8 శాతం నుంచి 6.2 శాతానికి కుదించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నమోదైన 5.4 శాతం కన్నా మరింత తక్కువగా ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 5 శాతానికి జీడీపీ వృద్ధి పడిపోయిన నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వృద్ధి మందగమనానికి దాదాపు అడ్డుకట్ట పడి ఉండొచ్చని.. రాబోయే త్రైమాసికాల్లో రికవరీ ప్రారంభం కావొచ్చని ఫిచ్‌ తెలిపింది. అయితే, అంతర్జాతీయంగాను, ప్రైవేట్‌ రంగంలో వినియోగపరమైన ఒత్తిళ్ల కారణంగా.. ఈ రికవరీ గతంలో కన్నా బలహీనంగా ఉండొచ్చని పేర్కొంది. ద్రవ్య, ఆర్థికపరమైన ఉద్దీపనలు, సంస్కరణల కొనసాగింపు, సానుకూల బేస్‌ ఎఫెక్ట్‌ మొదలైనవి వృద్ధి మెరుగుపడటానికి దోహదపడొచ్చని వివరించింది. ‘బడ్జెట్‌ ప్రతిపాదనలు, ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన చర్యలు.. వృద్ధికి ఊతమివ్వడానికి గానీ .. సెంటిమెంట్‌ను మెరుగుపర్చడానికి గానీ సరిపోయినంత స్థాయిలో లేవు. మరిన్ని మెరుగైన చర్యలు ఉండొచ్చని ఆశావహ అంచనాలు నెలకొన్నప్పటికీ.. అలాంటివేమీ లేకపోయే రిస్కులు కూడా ఉన్నాయి‘ అని ఫిచ్‌ తెలిపింది. ఆటోమొబైల్‌ అమ్మకాలు క్షీణించడంతో రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలు పోవడం, నిర్మాణ రంగంలోనూ మందగమన పరిస్థితులు నెలకొనడం, వినియోగం తగ్గిపోవడం తదితర అంశాల కారణంగా వ్యాపార సంస్థలు పెట్టుబడి ప్రణాళికలను పక్కన పెట్టే అవకాశం ఉందని వివరించింది.

మరో విడత వడ్డీ రేట్ల కోత...
వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వృద్ధి గతి కొంత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని డీబీఎస్‌ ఒక నివేదికలో పేర్కొంది. సుమారు 7 శాతం దాకా నమోదు చేయొచ్చని వివరించింది. అయితే, బలహీన జీడీపీ గణాంకాల కారణంగా అక్టోబర్‌లో జరిగే సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక రేట్లను మరో 15–25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించవచ్చన్న గత అంచనాలకు కట్టుబడి ఉన్నట్లు డీబీఎస్‌ తెలిపింది. వృద్ధిపై ఆందోళన పెరిగే కొద్దీ రేట్ల కోత అవకాశాలు కూడా పెరుగుతున్నట్లు వివరించింది. అంతర్జాతీయంగా సవాళ్లు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ధోరణుల కారణంగా.. వృద్ధికి అనుకూల విధానాలవైపే ఆర్‌బీఐ మొగ్గు చూపవచ్చని డీబీఎస్‌ తెలిపింది. రంగాలవారీగా ప్రభుత్వం మరిన్ని ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఒకవేళ మందగమనం ఇంకా తీవ్రమైతే వచ్చే ఏడాది మరింత విస్తృతమైన ఉద్దీపన చర్యలు ఉండొచ్చని వివరించింది. 

ఇదే కనిష్ట స్థాయి కావొచ్చు...
జూన్‌ క్వార్టర్‌లో నమోదైన వృద్ధే దాదాపు కనిష్ట స్థాయి కావొచ్చని, ఇకనుంచి కొంత కోలుకోవచ్చని బ్యాంకింగ్‌ సంస్థ యూబీఎస్‌ అభిప్రాయపడింది. మందగమనం కారణంగా డిమాండ్, పెట్టుబడులు, ఎగుమతుల అంచనాలు.. అన్నీ దెబ్బతిన్నాయని వివరించింది. భవిష్యత్‌ రికవరీ ప్రక్రియ చాలా సుదీర్ఘంగాను, మార్కెట్‌ అంచనాల కన్నా దిగువ స్థాయిలోనే ఉండవచ్చని యూబీఎస్‌ తెలిపింది. 267 మంది సీఈవో, సీఎఫ్‌వో స్థాయి అధికారులతో జూలైలో నిర్వహించిన సర్వే ఆధారంగా యూబీఎస్‌ ఈ విషయాలు పేర్కొంది. వచ్చే 12 నెలల్లో డిమాండ్‌ వృద్ధి కేవలం 10 శాతం దాకా మాత్రమే పరిమితం కావొచ్చని దాదాపు సగం మంది ఎగ్జిక్యూటివ్స్‌ భావిస్తున్నట్లు వివరించింది. రెండంకెల స్థాయి వృద్ధి ఆశిస్తున్న వారి సంఖ్య 40 శాతం నుంచి మూడో వంతుకు తగ్గిపోయింది. You may be interested

ఎనిమిది రంగాలూ నెమ్మది

Wednesday 4th September 2019

గ్రూప్‌ వృద్ధి జూలైలో కేవలం 2.1 శాతం న్యూఢిల్లీ: ఎనిమిది ప్రధాన మౌలిక రంగ పరిశ్రమల వృద్ధి రేటు జూలైలో కేవలం 2.1 శాతంగా నమోదయ్యింది. బొగ్గు, క్రూడ్‌ ఆయిల్‌, సహజ వాయువు ఉత్పత్తి, రిఫైనరీ ప్రొడక్టుల విభాగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదుకావడం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది జూలైలో ఈ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంది.   మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో

స్థిరంగా పసిడి ధర

Wednesday 4th September 2019

ఆర్థిక మాంద్య భయాలతో నిన్నటి రోజు ఆరేళ్ల గరిష్టస్థాయిని అందుకున్న పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 2డాలర్ల స్వల్ప లాభంతో 1,559 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా, చైనాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరపోవడం, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితి పసిడికి మద్దతుగా నిలుస్తున్నాయి.   బ్రిటన్‌లో బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. నో డీల్‌ బ్రెగ్జిట్‌పై పార్లమెంటు ఓటింగ్‌ జరగడానికి

Most from this category