News


రుణాలపై రేట్ల సమీక్షకు బ్యాంకర్లు అంగీకారం

Tuesday 6th August 2019
news_main1565072105.png-27567

  • రుణాలపై రేట్ల సమీక్షకు బ్యాంకర్లు అంగీకారం

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణ గ్రహీతలకు బ్యాంకులు పూర్తి స్థాయిలో అందించని పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకర్లతో సోమవారం చర్చించారు. రుణ రేట్లను సమీక్షించేందుకు బ్యంకర్లు అంగీకారం తెలిపారు. గత డిసెంబర్‌ నుంచి ఆర్‌బీఐ ఇప్పటి వరకు 75 బేసిస్‌ పాయింట్ల మేర రుణ రేట్లను తగ్గించినప్పుటికీ, ఆ స్థాయిలో రుణాలపై రేట్లు తగ్గని విషయం తెలిసిందే. ‘‘బ్యాంకులు రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని రుణాలకు బదలాయించాల్సిన అవసరం ఉంది. ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా రుణ రేట్లను సమీక్షించి చర్యలు తీసుకుంటామని బ్యాంకులు సమావేశంలో అంగీకరించాయి’’అని మంత్రి అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లు, ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, కోటక్‌ బ్యాంకు, సిటీ బ్యాంకు తదితర బ్యాంకుల సారథులతో సమావేశం అనంతరం మంత్రి నుంచి ప్రకటన వెలువడింది. ఎంఎస్‌ఎంఈ, ఆటోమొబైల్‌ రంగాలకు రుణ వితరణ వృద్ధితోపాటు సకాలంలో రేట్ల తగ్గింపు ప్రయోజనాల బదిలీ, డిజిటైజేషన్‌, సేవల పన్ను సంబంధిత అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్టు ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వృద్ధిని పెంచడమే లక్ష్యంగా పేర్కొన్నారు. 

పలు రంగాల ప్రతినిధులతో సమావేశమవుతా...
పలు రంగాల ప్రతినిధులతో తాను సమావేశమై, సత్వర చర్యలు తీసుకుంటామని మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సోమవారం బ్యాంకుల చీఫ్‌లతో భేటీ అయినట్టుగానే... ఈ వారంలోనే ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు, ఆటోమొబైల్‌ రంగం, వాణిజ్య సంఘాలు, రియల్‌ ఎస్టేట్‌ ప్రతినిధులతోనూ మంత్రి సమావేశం కానున్నారు. వారి అభిప్రాయాలను విని, అందుకు అనుగుణంగా తగురీతిలో, సత్వరమే చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. తద్వారా వారిలో విశ్వాసం తిరిగి నెలకొంటుందన్నారు. 



You may be interested

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ అమర్‌

Tuesday 6th August 2019

జీవిత బీమా రంగంలోని అగ్రగామి సంస్థ ఎల్‌ఐసీ నాన్‌ లింక్డ్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని ‘జీవన్‌ అమర్‌’ పేరుతో తీసుకొచ్చింది. ఆఫ్‌లైన్‌లో లభించే ఈ ప్లాన్‌లో రెండు రకాల మరణ పరిహార ప్రయోజనాల్లో నచ్చిన దానిని ఎంచుకోవచ్చని సంస్థ తెలిపింది. పాలసీ కాల వ్యవధి వరకు ఒకటే సమ్‌ అష్యూర్డ్‌ (లెవల్‌ సమ్‌ అష్యూర్డ్‌) ఒకటి అయితే, సమ్‌ అష్యూర్డ్‌ (బీమా) నిర్ణీత కాలానికోసారి పెరుగుతూ వెళ్లేది రెండో ఆప్షన్‌.

ఫ్లిప్‌కార్ట్‌లో ఇక సినిమాలు కూడా..

Tuesday 6th August 2019

 వీడియో స్ట్రీమింగ్ సేవలపై సంస్థ కసరత్తు ప్రాంతీయ భాషల్లో త్వరలో అందుబాటులోకి న్యూఢిల్లీ: ప్రత్యర్థి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ను దీటుగా ఎదుర్కొనే దిశగా వాల్‌మార్ట్‌ సారథ్యంలోని ఫ్లిప్‌కార్ట్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త్వరలోనే ప్రాంతీయ భాషల్లో వీడియో స్ట్రీమింగ్ సేవలు కూడా అందుబాటులోకి తేనున్నట్లు సోమవారం ప్రకటించింది. 'ఫ్లిప్‌కార్ట్ వీడియోస్‌' పేరిట ఈ సర్వీసు ప్రారంభించనుంది. ప్రకటనల ఆదాయంతో నిర్వహించే ఈ సర్వీసు.. ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ఉపయోగించే యూజర్లకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

Most from this category