News


జైట్లీ.. సంస్కరణల జమాజెట్టీ!

Monday 26th August 2019
news_main1566795781.png-28016

- కూలబడ్డ స్థాయి నుంచి పరుగుల దిశగా సంస్కరణలు
- జీఎస్‌టీ అమలు చేయటమే అతిపెద్ద విజయం
- దివాలా చట్టంతో బ్యాంకులకు ఊరట

ఒకపక్క స్కాముల కంపు కొడుతున్న వ్యవస్థ, మరోపక్క దిగజారిన విదేశీ నిధులు!!. ఇటు చూస్తే ద్రవ్య లోటు పెరుగుదల... అటు చూస్తే రెండంకెల ద్రవ్యోల్బణం!!. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎకనమిస్టుకైనా సంస్కరణలు అమలు కత్తిమీద సామే. కానీ ఈ రాజకీయ లాయర్‌కు మాత్రం అది ఒక సంక్లిష్టమైన కేసులాగే కనిపించింది. దాన్ని గెలిచేవరకు వదలకూడదన్న పట్టుదలతో రోజుకు 16 గంటలు పనిచేస్తూ చివరకు కేసు గెలిపించారు. ఈ క్రమంలో తన ఆరోగ్యాన్ని కూడా ఫణంగా పెట్టారు. దీంతో అదే ఈ లాయర్‌కు చివరి కేసైంది!. 
 

అరుణ్‌ జైట్లీ.. కొత్త శతాబ్దిలో భారత ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణలకు సారధి. ఇదే సమయంలో అత్యంత వివాదాస్పద ఆర్థిక నిర్ణయాలకు సాక్షి కూడా. యూపీఏ ప్రభుత్వ హయంలో కూనారిల్లిన ఎకానమీకి జవసత్వాలు తీసుకురావడం, కోట్లాది ఉద్యోగాల కల్పన లక్ష్యంగా జైట్లీ 2014లో ఆర్థిక మంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత పేలవ స్థితిలో ఉంది. కుంభకోణాలు, ఎగవేతలు ఎకానమీని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటు చూస్తే సొంత ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు అతిపెద్ద సవాలుగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అరుణ్‌జైట్లీ అత్యంత సమర్ధవంతంగా పనిచేశారు. తన టర్మ్‌ పూర్తయ్యేలోపు ఎకానమీని గట్టెక్కించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మందగమన ఛాయలు బయటపడుతున్నా, ఇండియా ఎకానమీపై అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయంటే అందులో జైట్లీ కృషి చాలా ఉంది.
రెండు షాక్‌లు.. 
అరుణ్‌జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎకానమీలో రెండు అతిపెద్ద కుదుపులు సంభవించాయి. 2016లో ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు ఎకానమీని స్తభింపజేసింది. దీంతో దాదాపు రెండు త్రైమాసికాల పాటు జీడీపీ ఒక్కసారిగా కుంచించుకుపోయింది. షాక్‌ తిన్న ఎకానమీని పట్టాలెక్కించి తిరిగి జీడీపీని గాడిన పెట్టడంలో జైట్లీది కీలక పాత్ర. ఒకపక్క ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మరోపక్క నిర్ణయ పర్యవసానాలను ఎదుర్కొంటూ ఆయన అత్యంత సమర్ధవంతంగా ఎకానమీని నడిపించారని ఎకనమిస్టులు ప్రశంసిస్తారు. నోట్ల రద్దు తర్వాత ఏడాది జీఎస్‌టీ అమలు చేయడం ద్వారా అప్పటివరకు ఉన్న పన్ను వ్యవస్థ మొత్తాన్ని కదలించారు. నోట్ల రద్దుతో సతమతమై కుదుటపడుతున్న ఆర్థిక వ్యవస్థకు జీఎస్‌టీ మరో షాక్‌లాగా తగిలింది. దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా ఆలోచనల్లోనే ఉంటూ వచ్చిన ఏక దేశం, ఏక పన్ను వ్యవస్థను జైట్లీ సాకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ ‘‘పాత భారతం ఆర్థికంగా ముక్కలుగా కనిపిస్తోంది, కొత్త భారతం ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్‌గా మారుతుంది’’ అన్నారు. ఇండియా ఎకానమీలో అతిపెద్ద సంస్కరణగా జీఎస్‌టీని ఆర్థికవేత్తలు కొనియాడుతున్నారు. కేవలం సంస్కరణను ప్రవేశపెట్టడం కాకుండా, ఎప్పటికప్పుడు దాని అమలును సమీక్షిస్తూ, అవసరమైన మార్పులు చేస్తూ జైట్లీ జీఎస్‌టీని సానుకూలంగా మార్చారు. రాజకీయంగా కూడా జీఎస్‌టీ పట్ల దాదాపు ఏకాభిప్రాయాన్ని సాధించడం ఆయన విజయంగా నిపుణులు అభివర్ణిస్తారు. 
ఎగవేతదారులకు చెక్‌
ఈ రెండు సంస్కరణలతో పాటు జైట్లీ హయంలో తీసుకువచ్చిన మరో ముఖ్యమైన సంస్కరణ దివాలా చట్టం ఏర్పాటు చేయడం. ఈ చట్టంతో క్రెడిట్‌ కల్చర్‌లో మంచి మార్పులు వచ్చాయి. రుణదాతలకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎగవేతలంటే భయపడే స్థితి ఏర్పడింది. ముఖ్యంగా క్రోనీ క్యాపిటలిజం నిర్మూలనకు ఇది సమర్ధవంతంగా పనిచేసిందని ప్రముఖ ఎకనమిస్టులు కొనియాడారు. ఆర్‌బీఐ, ద్రవ్యపరపతి సమీక్ష అంశాలపై జైట్లీకి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. కేంద్రబ్యాంకుకు మరింత స్వయం ప్రతిపత్తి ఉండాలని, ద్రవ్యోల్బణం కట్టడే సమీక్షా సమావేశ ప్రధాన అజెండా కావాలని ఆయన అభిప్రాయపడేవారు. ఆయన మరణం పట్ల అటు రాజకీయనాయకులతో పాటు ఇటు కార్పొరేట్‌ వర్గాలు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఆర్థిక సంస్కరణలు సమర్ధవంతంగా ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా కార్పొరేట్‌ ప్రపంచం జైట్లీని కొనియాడుతోంది.

 You may be interested

662 పాయింట్లు ఎగిసి... 872 పాయింట్లు వెనుతిరిగి...

Monday 26th August 2019

లాభాలు నిలుపుకోలేని సెన్సెక్స్‌ నిఫ్టీ 244 పాయింట్లు వెనక్కి దేశీయ మార్కెట్‌ ప్రపంచమార్కెట్ల ప్రభావానికే తలొగ్గింది. ఫలితంగా ఉద్దీపన చర్యల లాభాల్ని నిలుపుకోవడంలో సూచీలు విఫలయ్యాయి. చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఎఫ్‌పీఐలపై సర్‌ఛార్జీని ఉపసంహరించుకోవడం, బ్యాంకులకు రూ.70వేల కోట్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. అంచనాలకు తగ్గట్టుగానే నేడు సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 663 పాయింట్ల లాభంతో 37,364 వద్ద, నిఫ్టీ 171

అంతర్జాతీయ మందగమనం..తగ్గిన చమురు

Monday 26th August 2019

యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ తీవ్రమవ్వడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెలుతుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా చమురు ధరలు సోమవారం ట్రేడింగ్‌లో నష్టపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 1.5 శాతం క్షీణించి బారెల్‌ 58.45 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా డబ్యూటీఐ క్రూడ్‌ 1.8 శాతం నష్టపోయి బారెల్‌ 53.17 డాలర్లకు పడిపోయింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలు, యుఎస్‌ ఆర్థిక మాంద్య భయాలు చమురు మార్కెట్లను వెంటాడుతున్నాయని వలోర్‌

Most from this category