STOCKS

News


జీ డీల్‌కు ఇన్వెస్కో సై

Thursday 1st August 2019
news_main1564629945.png-27454

  • మరిన్ని పెట్టుబడులకు ఇన్వెస్కో అంగీకారం
  • మరో 11 శాతం వాటాల కొనుగోలు
  • డీల్ విలువ రూ. 4,224 కోట్లు
  • ఇప్పటికే 7.74 శాతం వాటా

ముంబై: నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జీ గ్రూప్‌నకు ఊరటనిచ్చేలా అమెరికాకు చెందిన ఇన్వెస్కో ఓపెన్‌హైమర్ ఫండ్ మరింత ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎ౾ంటర్‌ప్రైజెస్ (జీ)లో ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ డీల్‌ విలువ రూ. 4,224 కోట్లుగా ఉండనుంది. ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌లో భాగమైన డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ ఈ వాటాలను కొనుగోలు చేయనుంది. 2002 నుంచి జీ లో ఇన్వెస్టరుగా కొనసాగుతున్న ఇన్వెస్కో ఫండ్‌కు ప్రస్తుతం ఇందులో 7.74 శాతం వాటాలు ఉన్నాయి. "ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్‌ .. జీ లో మరింతగా ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించింది. ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం దాకా వాటాలను రూ. 4,224 కోట్లకు కొనుగోలు చేయడానికి అంగీకరించింది" అని జీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సంస్థపై ఇన్వెస్కో ఫండ్‌కున్న నమ్మకాన్ని తాజా పెట్టుబడులు తెలియజేస్తున్నాయని జీ మేనేజింగ్ డైరెక్టర్‌, సీఈవో పునీత్ గోయెంకా పేర్కొన్నారు. ఈ డీల్‌తో జీ లో ప్రమోటర్ల వాటా 23 శాతానికి తగ్గుతుంది. 2019 జూన్ నాటికి జీ లో ప్రమోటర్ల వాటా 35.79 శాతంగా ఉంది. ఇందులో 63.98 శాతం వాటాలు మ్యూచువల్ ఫండ్స్‌, ఇతర ఆర్థిక సంస్థల దగ్గర తనఖాలో ఉన్నాయి. బుధవారం షేరు ముగింపు ధరను బట్టి జీ మార్కెట్ విలువ రూ. 34,717 కోట్లు కాగా.. ఇందులో ప్రమోటర్ల వాటాల విలువ సుమారు రూ. 13,000 కోట్లుగా ఉంటుందని అంచనా. 


మిగతా అసెట్స్‌ విక్రయంపై దృష్టి...
రుణాల చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రమోటర్లకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు ఈ డీల్‌తో లభించగలదని జీ మాతృసంస్థ ఎస్సెల్ గ్రూప్ పేర్కొంది. ఇతరత్రా అసెట్స్‌ విక్రయం దిశగా ఇది ముందడుగని తెలిపింది. మీడియాయేతర అసెట్స్‌ను కూడా విక్రయించాలని ఎస్సెల్ గ్రూప్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. "తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్దేశించుకున్న సెప్టెంబర్ గడువులోగా రుణాల రీపేమెంట్ ప్రక్రియను పూర్తి చేయగలం" అని ఎస్సెల్ గ్రూప్ ధీమా వ్యక్తం చేసింది.

ఏడాదిగా ప్రమోటర్ల ప్రయత్నాలు...
సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందంటూ ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాష్ చంద్ర ఈ ఏడాది జనవరిలో రాసిన బహిరంగ లేఖతో కంపెనీ వాస్తవ స్థితిగతులు అధికారికంగా బైటపడ్డాయి. ఇన్‌ఫ్రా రంగంలో భారీగా పెట్టిన పెట్టుబడులు, వీడియోకాన్‌కు చెందిన డీ2హెచ్ వ్యాపారం కొనుగోలు లావాదేవీలు ప్రతికూలంగా మారాయని చంద్ర పేర్కొన్నారు. ‍అయితే, బ్యాంకర్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌ నుంచి పొందిన రుణాలన్నీ పూర్తిగా తీర్చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ దాకా ఎటువంటి చర్యలూ తీసుకోకుండా రుణదాతలతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.  వాస్తవానికి భారీగా పేరుకుపోతున్న రుణభారాన్ని తగ్గించుకునే దిశగా గ్రూప్ సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు గతేడాది నవంబర్‌ నుంచీ ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రుణాల రీపేమెంట్‌కు 2019 సెప్టెంబర్‌ను గడువుగా నిర్దేశించుకున్నారు. జీ లో తమకున్న వాటాల్లో దాదాపు 50 శాతం వాటాలు వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించేందుకు ప్రమోటర్లు గతేడాది నవంబర్‌ నుంచి ప్రయత్నిస్తున్నారు. జీ లోనూ, ఇతరత్రా మీడియాయేతర అసెట్స్‌లో వాటాల కొనుగోలుకు వివిధ భాగస్వాముల నుంచి సానుకూల స్పందన కూడా వస్తున్నట్లు ఎస్సెల్ గ్రూప్ చెబుతూ వస్తోంది. తాజాగా ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌తో ఒప్పందం కుదరడం సంస్థకు కొంత ఊరటనివ్వనుంది. You may be interested

వినయశీలి, మృదుభాషి: సిద్ధార్థకు కార్పొరేట్ల నివాళులు

Thursday 1st August 2019

వీజీ సిద్ధార్థ మృతిపై పరిశ్రమ దిగ్గజాలు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సిద్ధార్థ వినయశీలి, మృదుభాషి’’ అని బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్‌ షా, ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు నివాళులర్పించారు. "సిద్ధార్థ భార్య మాళవిక, ఆయన కుమారులు, ఎస్‌ఎం కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తున్నాను" అని కిరణ్ మజుందార్‌ షా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో పేర్కొన్నారు. "సిద్ధార్థ గొప్ప

జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌పై జున్‌జున్‌వాలాకు ఆసక్తి

Thursday 1st August 2019

భారత ఈక్విటీ మార్కెట్లలో పాపులర్‌ ఇన్వెస్టర్‌గా పేరొందిన రాకేశ్‌ జున్‌జున్‌వాలా ఫార్మా రంగంలో జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ పట్ల ఎంతో ఆశాభావంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా ఈ కంపెనీలో అదనంగా మరికొంత ఇన్వెస్ట్‌ చేసి వాటా పెంచుకోవడం గమనార్హం. ఈ మంగళవారం (జూలై 30న) జున్‌జున్‌వాలా జుబిలంట్‌ లైఫ్‌లో 1.10 శాతం వాటాను అంటే 17.5 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో 20,13,626

Most from this category