News


కంపెనీల బోర్డుల్లో యువతకు చోటేది?

Thursday 12th September 2019
Markets_main1568259726.png-28324

  • 50 ఏళ్లలోపు సభ్యులు 7 శాతమే
  • బోర్డు సభ్యుల సగటు వయసు 63
  • అనుభవానికే పెద్ద పీట
  • యువతకు మొండి చేయి
  • అంతర్జాతీయంగానూ ఇవే పరిస్థితులు
  • సీఎల్‌ఎస్‌ఏ నివేదికలో ఆలోచింపజేసే అంశాలు

యువ జనాభా అత్యధికంగా కలిగిన భారత్‌ భవిష్యత్తు ఆర్థిక దిగ్గజంగా తప్పకుండా అవతరిస్తుందని ఎంతో మంది విశ్వసిస్తు‍న్నారు. దేశ ఉత్పాదకతను పెంచేందుకు యువతరం మన విలువైన సొత్తు. కానీ, యువతకు ఉద్యోగ కల్పన విషయంలో కీలకమైన కార్పొరేట్‌ కంపెనీల బోర్డుల్లో మాత్రం... యువ నిపుణులకు తగిన చోటు లేదన్న వాస్తవం ఒప్పుకుని తీరాల్సిందే. కంపెనీల ‘బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ట్స్‌’ మరింత స్వతంత్రంగా, అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి చేరుతున్నా... ఒక్కటి మాత్రం లోటు కనిపిస్తోంది. బోర్డుల్లో అనుభవజ్ఞులు అవసరమైనప్పటికీ, అదే సమయంలో యువతకు కనీస ప్రాతినిధ్యం లేకపోవడం ఆలోచించాల్సిన అంశమే. బీఎస్‌ఈ100 కంనీల్లో 38 కంపెనీల బోర్డుల స్వరూపాన్ని సీఎల్‌ఎస్‌ఏ పరిశీలించగా... డైరెక్టర్ల సగటు వయసు 2019 మార్చి చివరికి 63గా ఉందని తెలిసింది. 2009 నాటికి ఉన్న 59 ఏళ్ల సగటు నుంచి పెరిగినట్టు స్పష్టమవుతోంది. దీనికితోడు స్వతంత్ర డైరెక్టర్ల పదవీ కాలం కూడా మరింత కుచించుకుపోతోంది. కార్పొరేట్‌ మోసాలతో బోర్డుల స్వతంత్రత ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితుల్లో సీఎల్‌ఎస్‌ఏ అధ్యయనంలో ఈ ఫలితాలు వెలుగు చూడడం ఆలోచింపజేసేదే. ఈ నివేదికలోని వివరాలను పరిశీలిస్తే...
పరిమిత పాత్ర...
బోర్డుల్లో డైరెక్టర్ల సగటు వయసు పెరగడానికి ప్రస్తుత సభ్యుల వయసు పెరగుతుండడమే ఒక కారణం. వీరంతా దశాబ్ద కాలంగా ఆయా కంపెనీల బోర్డుల్లో తిష్ట వేసిన వారే. బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లలో 30 శాతం వరకు మారకుండా ఉండడం సాధరణమేనన్నది సీఎల్‌ఎస్‌ఏ నిర్వచనం. ఎందుకంటే సాధారణంగా ప్రమోటర్లు, వారి సంబంధీకులే బోర్డుల్లో ఎక్కువ మంది ఉండడంతోపాటు వారు రిటైట్‌ అవడానికి అంతగా ఇష్టపడరు. ఏదో ఫలానా రంగం, ఫలానా కంపెనీ అనేమీ లేదు. అన్ని చోట్లా యువతకు సరైన ప్రాతినిధ్యం అయితే లేదు. ఎందుకంటే 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి కేవలం కంపెనీల బోర్డు డైరెక్టర్లలో 7 శాతం మందే 50 ఏళ్లలోపు వారున్నారు. 2009 ఆర్థిక సంవత్సరం నాటికి ఉన్న 18 శాతంతో పోలిస్తే యువ నిపుణులకు చోటు తగ్గుతూ వచ్చినట్టు స్పష్టమవుతోంది. 
అనుభవానికే.. 
అయితే, కంపెనీల బోర్డులు వయోభారంతో ఉండడం అన్నది కేవలం మన దేశంలో ఉన్న పరిణామమేమీ కాదు. నాస్‌డాక్‌ 100 కంపెనీలను పరిశీలించినా ఇదే తెలుస్తుంది. వీటి బోర్డుల్లో డైరెక్టర్ల సగటు వయసు 62గా ఉంది. అంటే మన కంపెనీలతో పోలిస్తే కేవలం ఏడాది తక్కువ. ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే నాస్‌డాక్‌100 అన్నది టెక్నాలజీ పరంగా అత్యాధునిక, దిగ్గజ కంపెనీలు. అంటే వీటితోపాటు, మన కార్పొరేట్‌ కంపెనీల్లోనూ అనుభవానికే పెద్ద పీట వేస్తున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరహా ధోరణితో ప్రమోటర్ల కుటుంబ సభ్యులు అయితే తప్పించి యువతకు బోర్డుల్లో చోటు కష్టంగా మారుతోందని సీఎల్‌ఎస్‌ఏ తన నివేదికలో వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. 
యువతరం అవసరమా..?
ఎస్‌అండ్‌పీ 500, నికాయ్‌ 225 కంపెనీల్లోనూ ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి. వీటిల్లో డైరెక్టర్ల సగటు వయసు 63 సంవత్సరాలు. టెక్నాలజీ పరంగా ఎంతో ముందడుగు ఉన్న నేడు, భారత కంపెనీల బోర్డులకు మరింత యువరక్తం అవసరమా లేక అనుభవమే ముఖ్యమా అన్న ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుందని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ఇక బీఎస్‌ఈ 100 కంపెనీల బోర్డుల సైజు కనీసం 11 మంది సభ్యులుగా ఉంది. భారత కంపెనీల బోర్డుల సగటు సైజు అంతర్జాతీయ కంపెనీల మాదిరే ఉంది. నాస్‌డాక్‌ 100 కంపెనీల సగటు బోర్డు సైజు 10.3 సభ్యులు కాగా, ఎస్‌అండ్‌పీ 500లో సగటున 11, నికాయ్‌ 225 కంపెనీల్లో ఇది సగటున 10.9 సభ్యులుతో ఉంది. కంపెనీ బోర్డులో కనీసం సగం మంది స్వతంత్ర డైరెక్టర్లు, కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ ఉండాలని కంపెనీల చట్టం 2013 స్పష్టం చేస్తోంది. 2015 ఏప్రిల్‌ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. దీంతో 2013-14 నాటికి బీఎస్‌ఈ 100 కంపెనీల్లో మహిళా డైరెక్టర్ల శాతం 7.9 శాతంగా ఉంటే, 2018-19 నాటికి ఇది 15.2 శాతానికి పెరిగింది. బోర్డులు మరింత స్వతంత్రతో పనిచేయాలన్న ఉద్దేశ్యంతోనే కేంద్రం ఈ మార్పులు చేసింది.

 



You may be interested

నమ్మకానికి మారు పేరు భారతీసిమెంట్‌

Thursday 12th September 2019

నమ్మకానికి మారు పేరు భారతీసిమెంట్‌ డీలర్స్‌ సమావేశంలో మల్లారెడ్డి నమ్మకానికి మారుపేరుగా ఉన్న భారతీ సిమెంటు అభివృద్ధికి డీలర్స్‌ ఎంతో సహాయపడ్డారని మార్కెటింగ్‌ వైస్‌ చైర్మన్‌ సీహెచ్‌ మాల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నెల్లూరులోని మినర్వాగ్రాండ్‌లో భారతీ సిమెంట్‌ డీలర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్లారెడ్డి మాట్లాడుతూ రోబోటిక్‌ క్వాలిటీ కంట్రోల్, ట్యాంపర్‌ఫ్రూప్‌ ప్యాకింగ్, జర్మన్‌ టెక్నాలజీ వంటి వాటితో భారతీ సిమెంటు  వినియోగదారుల నమ్మకాన్ని చూరగొందన్నారు.  ఇటీవలే ఆవిష్కరించిన నూతన ప్రొడక్ట్‌

ఫ్లిప్‌కార్ట్‌లో మాతృసంస్థ భారీ పెట్టుబడి

Thursday 12th September 2019

సింగపూర్‌ సంస్థ నుంచి రూ.1,616 కోట్లు వాల్‌మార్ట్‌కు చెందిన భారత ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. ఈ పండుగల సీజన్‌ కోసం తన మాతృసంస్థ నుంచి భారీ మొత్తంలో పెట్టుబడిని అందుకుంది. సింగపూర్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలో రూ.1,616 కోట్లును పెట్టుబడిగా పెట్టినట్లు రిజిస్ర్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ)కి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఇందుకోసం భారత సంస్థ తనకు 4,64,403 ఈక్విటీ షేర్లను (ఒక్కో

Most from this category