News


‘‘యస్‌’’బీఐ..!

Saturday 7th March 2020
news_main1583552785.png-32337

  • వాటాల కొనుగోలుకు ఆసక్తి
  • పునర్నిర్మాణ స్కీమ్‌ ముసాయిదా
  • రూపొందించిన ఆర్‌బీఐ
  • ఇన్వెస్టర్లు 49% వాటాలు 
  • కొనుగోలు చేసేలా ప్రతిపాదన
  • షేరుకు రూ. 10 ధర
  • మూడేళ్ల పాటు లాకిన్‌
  • అభిప్రాయాల వెల్లడికి మార్చి 9 దాకా గడువు

ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ను ఒడ్డున పడేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు చేపట్టింది. యస్‌ బ్యాంకులో ఇన్వెస్ట్‌ చేయడానికి ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆసక్తి చూపుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో యస్‌ బ్యాంకు పునర్నిర్మాణ స్కీమ్‌ 2020 ముసాయిదాను ఆర్‌బీఐ రూపొందించింది. దీని ప్రకారం.. వ్యూహాత్మక ఇన్వెస్టర్లు యస్‌ బ్యాంక్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన రోజు నుంచి మూడేళ్ల దాకా వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోకూడదు. యస్‌ బ్యాంక్‌ షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున లెక్కించి వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యస్‌ బ్యాంకు షేరు ముఖ విలువ రూ. 2తో పోలిస్తే ఇది రూ. 8 అధికం. ఇక నిర్దేశిత తేదీ నుంచి బ్యాంక్‌ అధీకృత మూలధనాన్ని కూడా రూ. 5,000 కోట్లకు, ఈక్విటీ షేర్ల సంఖ్యను 2,400 కోట్లకు సవరించనున్నారు. ఈ ముసాయిదాపై సంబందిత వర్గాలు మార్చి 9 దాకా అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. 
    మొండిబాకీలు, నష్టాలు, నిధుల కొరత సమస్యలతో సతమతమవుతున్న యస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఏప్రిల్‌ 3 దాకా నెల రోజులపాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవధిలో డిపాజిట్‌దారులు రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. అటు బ్యాంకు.. ఇతరత్రా రుణాలు ఇవ్వడానికి గానీ పెట్టుబడులు పెట్టడానికి గానీ లేదు. మారటోరియం గడువులోగానే బ్యాంకును పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఆర్‌బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్‌ ప్రశాంత్‌ కుమార్‌ శుక్రవారం వెల్లడించారు. డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఆర్‌బీఐ మారటోరియం విధించిందని, ఖాతాదారుల సొమ్ము భద్రంగానే ఉంటుందని ఆయన చెప్పారు. 

ఖాతాదారుల సొమ్ము భద్రం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
యస్‌ బ్యాంక్‌లో గవర్నెన్స్‌ లోపాలు, నిబంధనలను పాటించకపోవడం, రిస్కుతో కూడుకున్న రుణాలివ్వడం వంటి ధోరణులను 2017 నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ గమనిస్తూనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ను కూడా మార్చాలని ఆర్‌బీఐ ఆదేశించినట్లు తెలిపారు. యస్‌ బ్యాంక్‌లో సమస్యలు, వాటికి బాధ్యులెవరన్న అంశాలన్నింటిపైనా విచారణ జరపాలంటూ ఆర్‌బీఐకి ప్రభుత్వం సూచించినట్లు ఆమె వివరించారు. "ఖాతాదారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్‌బీఐతో పాటు పరిస్థితులను నేను కూడా సమీక్షిస్తున్నాను. డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉంటుంది" అని నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. నిర్దిష్ట 30 రోజుల్లోగానే పునర్నిర్మాణ స్కీమ్‌ అమల్లోకి రాగలదని, ఇన్వెస్ట్‌ చేసేందుకు ఎస్‌బీఐ ముందుకొచ్చిందని మంత్రి చెప్పారు. ఏడాది పాటు యస్‌ బ్యాంక్‌ సిబ్బంది ఉద్యోగాలు, జీతభత్యాలకు ఎలాంటి సమస్య ఉండబోదని భరోసానిచ్చారు. అంబానీ గ్రూప్, ఎస్సెల్, ఐఎల్‌ఎఫ్‌ఎస్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, వొడాఫోన్‌ వంటి సంస్థలకు ఇచ్చిన రుణాలు యస్‌ బ్యాంక్‌కు గుదిబండగా మారాయన్నారు. 

సత్వరం పరిష్కారమవుతుంది: ఎస్‌బీఐ చీఫ్‌ రజనీష్‌ కుమార్‌
"యస్‌ బ్యాంక్‌ సమస్య కేవలం ఆ బ్యాంకుకే పరిమితమైన అంశం. ఇది మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థ సమస్య కాదు. యస్‌ బ్యాంక్‌ సంక్షోభానికి చాలా తొందర్లోనే పరిష్కారం లభిస్తుంది" అని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. బ్యాంకులో వాటాలు కొనుగోలు చేసే పక్షంలో తమకు ఇప్పటికీ సూత్రప్రాయంగా అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. 

డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడతాం: సీఈఏ
యస్‌ బ్యాంక్‌ను పునరుద్ధరించడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలూ ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ చెప్పారు. ఖాతాదారుల సొమ్ము భద్రంగానే ఉంటుందని తెలిపారు. ఆర్‌బీఐ సరైన దిశగా చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. 

సత్వర చర్యలు తీసుకుంటున్నాం: ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌
దేశీ ఆర్థిక రంగంలో స్థిరత్వానికి సమస్యలు వాటిల్లకుండా యస్‌ బ్యాంక్‌ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. బ్యాంకును పునరుద్ధరించడానికి అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. 30 రోజుల మారటోరియం అన్నది గరిష్ట పరిమితి అని.. ఈలోగానే పరిష్కార ప్రణాళిక అమల్లోకి రాగలదని దాస్‌ ధీమా వ్యక్తం చేశారు. ఖాతాదారుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామన్నారు. స్వయంగా పరిస్థితి చక్కదిద్దుకునేందుకు బ్యాంకుకు తగినంత సమయం ఇచ్చినా ఫలితం కనిపించకపోవడంతోనే ఆర్‌బీఐ ప్రస్తుత చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పరిశ్రమల సమాఖ్య అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ఇది తొందరపాటుతనం అని కొందరు .. చాలా ఆలస్యం చేశారని మరికొందరు వ్యాఖ్యానించవచ్చని, కానీ ఆర్‌బీఐ తగిన సమయంలోనే చర్యలు తీసుకుందని దాస్‌ చెప్పారు. 

డిజిటల్‌ పార్ట్‌నర్స్‌కు సెగ..
యస్‌ బ్యాంక్‌పై ఆంక్షలతో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, దానిపై ఆధారపడిన ఫిన్‌టెక్‌ సంస్థలకు సమస్యలొచ్చి పడ్డాయి. ప్రధానంగా ఫోన్‌పే వంటి డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థల లావాదేవీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అటు యస్‌ బ్యాంక్‌ ఖాతాల్లోకి యూపీఐ ప్లాట్‌ఫాం ద్వారా చేసే చెల్లింపులు సహా పలు లావాదేవీల సెటిల్మెంట్‌లపై పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఆంక్షలు విధించింది. ఇక, యస్‌ బ్యాంక్‌ బాండ్లలో వివిధ స్కీమ్‌ల ద్వారా చేసిన పెట్టుబడుల విలువను సున్నా స్థాయికి తగ్గించేసినట్లు నిప్పన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ తెలిపింది. మరోవైపు, యస్‌ బ్యాంక్‌లో ఖాతాలున్న షేర్, బాండ్‌ హోల్డర్ల నిధులు చిక్కుబడిపోకుండా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వారి షేర్లు, బాండ్లు మొదలైనవి విక్రయించిన పక్షంలో వచ్చే నిధులను వేరే బ్యాంకులో జమ చేసుకునే వీలు కల్పిస్తూ సత్వర చర్యలు తీసుకున్నాయి. 

ఆందోళనలో కస్టమర్లు.. 
విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలతో యస్‌ బ్యాంక్‌ ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. వార్త తెలిసినప్పట్నుంచీ ఏటీఎంలు, పలు శాఖల్లో కస్టమర్లు బారులు తీరారు. తమ డిపాజిట్ల పరిస్థితి గురించి వాకబు చేస్తూ కనిపించారు. నెట్‌ బ్యాంకింగ్‌ పనిచేయకపోవడం, ఏటీఎంలలో డబ్బు లేకపోవడం తదితర ఫిర్యాదులతో బ్యాంక్‌ హెల్ప్‌లైన్‌ హోరెత్తింది. కొందరు ట్విటర్‌ వంటి వేదికల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆర్‌బీఐ ఆంక్షలు విధించడానికి రెండు రోజుల ముందునుంచే బ్యాంకు చిక్కుల్లో ఉన్న సంకేతాలు కనిపించాయని కొందరు ఖాతాదారులు చెప్పారు. బ్యాంకింగ్‌ సమస్యలపై మార్చి 3, 4 తారీఖుల నుంచే పలువురు కస్టమర్లు యస్‌ బ్యాంక్‌ ట్విటర్‌ హ్యాండిల్‌లో ఫిర్యాదులు చే శారు. 


పూరీ జగన్నాధునికీ యస్‌ కష్టాలు...
యస్‌ బ్యాంకులో పూరీ జగన్నాధ స్వామి ఆలయానికి సంబంధించి రూ. 545 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించడంతో ఈ డిపాజిట్ల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ప్రైవేట్‌ బ్యాంకులో జగన్నాధుడి నిధులను డిపాజిట్‌ చేయడం అనైతికమని, ఈ విషయంలో శ్రీ జగన్నాథ టెంపుల్‌ అడ్మినిస్ట్రేషన్, గుడి మేనేజింగ్‌ కమిటీపై పోలీసులకు ఫిర్యాదు చేశామని జగన్నాథ సేన కన్వీనర్‌ ప్రియదర్శి పట్నాయక్‌ చెప్పారు. అయితే, అధికారులు చర్యలేమీ ఇంతవరకూ తీసుకోలేదన్నారు. మరోవైపు, ఈ మొత్తాన్ని మార్చి నెలాఖరులోనే ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులోకి మళ్లించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుందని.. ఈలోగానే తాజా పరిణామం చోటు చేసుకుందని ఒడిషా న్యాయశాఖ మంత్రి ప్రతాప్‌ జెనా తెలిపారు. నిధుల బదలాయింపునకు ఎలాంటి సమస్య ఉండబోదనే భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.  
 



You may be interested

కట్టాల్సినది రూ. 21 వేల కోట్లే

Saturday 7th March 2020

ఏజీఆర్‌ బాకీలపై వొడాఫోన్ ఐడియా స్వీయ మదింపు న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల (ఏజీఆర్‌) కింద తాము కట్టాల్సినది టెలికం శాఖ (డాట్) చెబుతున్న దానికంటే చాలా తక్కువేనని టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్‌) తెలిపింది. వాస్తవంగా తాము చెల్లించాల్సినది రూ. 21,533 కోట్లు మాత్రమేనని స్వీయ మదింపులో తేలిందని సంస్థ వివరించింది. ఇందులో ఇప్పటికే రూ. 3,500 కోట్లు కట్టినట్లు పేర్కొంది. వొడాఫోన్ ఐడియా

కుప్పకూలిన మార్కెట్‌

Friday 6th March 2020

894 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్‌ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 280 పాయింట్లు పతనం 55 శాతం దిగజారిన యస్‌ బ్యాంక్‌ షేరు 5.3 శాతం క్షీణించిన పీఎస్‌యూ బ్యాంక్స్‌ ఓవైపు కోరలు చాస్తున్న కరోనా వైరస్‌.. మరోపక్క యస్‌ బ్యాంక్‌ బోర్డు రద్దు వంటి ప్రతికూల వార్తలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. గురువారం అమెరికా మార్కెట్లు 3.5 శాతం పతనంకావడంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ఎగబడ్డారు. చివరివరకూ అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో సెన్సెక్స్‌ 894

Most from this category