News


'యస్‌'పై 18న మారటోరియం ఎత్తివేత

Monday 16th March 2020
news_main1584328879.png-32492

  • అమల్లోకి వచ్చిన పునరుద్ధరణ ప్రణాళిక
  • నెలాఖరుకు కొత్త బోర్డు ఏర్పాటు
  • సీఈవో, ఎండీగా ప్రశాంత్ కుమార్‌


న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18న బ్యాంకుపై మారటోరియం తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్‌బీఐ నియమిత అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్‌ ఆ తర్వాత సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ఆయన సారథ్యంలో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. పునర్‌వ్యవస్థీకరించిన బోర్డులో సునీల్ మెహతా (పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ నాన్‌-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌).. నాన్‌ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భెడా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉంటారు. మార్చి 13 నుంచి యస్ బ్యాంక్ పునరుద్ధరణ స్కీమ్‌ 2020ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ప్రభుత్వం ఈ అంశాలు పొందుపర్చింది. "ప్రణాళిక అమల్లోకి తెచ్చిన మూడో పని దినం సాయంత్రం 6 గం.లకు మారటోరియం తొలగిపోతుంది. ఆ పైన 7 రోజుల తర్వాత కొత్త బోర్డు ఏర్పాటవుతుంది" అని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏప్రిల్ 3 దాకా విత్‌డ్రాయల్స్‌ను రూ. 50,000కు పరిమితం చేస్తూ మార్చి 5న యస్‌ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.  

ఎన్‌పీఏల ఒత్తిడి కొనసాగుతుంది...
మొండిబాకీలతో నష్టాలు ప్రకటించిన యస్ బ్యాంక్‌ .. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ)పరమైన ఒత్తిడి కొనసాగుతుందని పేర్కొంది. అయితే, కొత్తగా వచ్చే రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో బ్యాంక్ నిలదొక్కుకోగలదని, సమస్యలను అధిగమించగలదని యస్‌ బ్యాంక్ అడ్మినిస్ట్రేటరు ప్రశాంత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ త్రైమాసికంలో యస్ బ్యాంక్ రూ. 18,654 కోట్ల భారీ నష్టం ప్రకటించింది. గడిచిన ఆరు నెలల్లో ఖాతాదారులు రూ. 72,000 కోట్ల పైగా విత్‌డ్రా చేసుకోవడంతో బ్యాంక్ డిపాజిట్లు రూ. 1.37 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. 

షేర్లకు లాకిన్‌...
పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. యస్‌ బ్యాంక్‌లో 49 శాతం దాకా వాటాలు తీసుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వచ్చే మూడేళ్లలో తన వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోవడానికి వీల్లేదు. ఇతర ఇన్వెస్టర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్ల పెట్టుబడుల్లో 75 శాతం షేర్లకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. తమ దగ్గరున్న మొత్తం షేర్లలో 25 శాతానికి మించి విక్రయించుకోవడానికి వీలు ఉండదు. అయితే, 100 లోపు షేర్లు ఉన్న వారికి ఈ లాకిన్ ‍పీరియడ్ వర్తించదు. నోటిఫికేషన్ ప్రకారం.. యస్‌ బ్యాంక్‌లో 49 శాతం వాటాలు తీసుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఒకరు లేదా అదనంగా మరింత మంది డైరెక్టర్లను నియమించవచ్చు. ఎస్‌బీఐ మినహా 15 శాతం వోటింగ్ హక్కులు ఉన్న ఇతర ఇన్వెస్టర్లు ఒక్కొక్క డైరెక్టరు చొప్పున యస్ బ్యాంక్ బోర్డుకు నామినేట్ చేయొచ్చు. పునరుదద్ధరణ ప్రణాళిక ప్రకారం.. యస్ బ్యాంక్ అధీకృత మూలధనం రూ. 6,200 కోట్లుగా ఉంటుంది. యస్ బ్యాంక్ ఉద్యోగులు  గత జీతభత్యాలు, సర్వీస్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారు. అయితే 'మేనేజ్‌మెంట్‌లో కీలక ఉద్యోగుల' సేవలను కొత్త బోర్డు ఎప్పుడైనా ఉపసంహరించవచ్చని నోటిఫికేషన్‌ పేర్కొంది. 



You may be interested

నేడు మార్కెట్లు మళ్లీ కుప్పకూలతాయా?

Monday 16th March 2020

భారీ గ్యాప్‌ డౌన్‌తో ఓపెనింగ్‌ నేడు! ప్రపంచ మార్కెట్లలో కరోనా విలయం 410 పాయింట్లు కోల్పోయిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  వడ్డీ రేట్లను సున్నాకు చేర్చిన ఫెడరల్‌ రిజర్వ్‌ యూఎస్‌ ఫ్యూచర్స్‌ 4.5 శాతం డౌన్‌ అటూఇటుగా ఆసియా మార్కెట్లు నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి పతనం(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30 ప్రాంతం‍లో 410 పాయింట్లు పడిపోయి 9,574 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 9,984

సెన్సెక్స్‌ కీలకస్థాయి 34,130 పాయింట్లు

Monday 16th March 2020

కరోనావైరస్‌ వివిధ దేశాలకు శరవేగంగా వ్యాప్తిచెందడం, పలు దేశాలు, కంపెనీలు ట్రావెల్‌ బ్యాన్స్‌ ప్రకటించడం, ఎన్నో కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను అమలుచేయడం వంటి పలు కారణాలతో ప్రపంచ ఈక్విటీ  మార్కెట్లో 2008 ఆర్థిక సంక్షోభ అనంతరం అతిపెద్ద పతనం సంభవించింది. ఆయా కేంద్ర బ్యాంకులు వ్యవస్థలోకి తక్కువ వడ్డీరేట్లతో పుష్కలంగా విడుదల చేస్తున్న నిధులు కూడా మార్కెట్లను  శాంతింపచేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌

Most from this category