News


యస్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.629 కోట్లు

Saturday 2nd November 2019
news_main1572666602.png-29295

  • రూ.8,348 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం 
  • 2.7 శాతానికి పడిపోయిన నికర వడ్డీ మార్జిన్‌ 


న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసిక కాలంలో రూ.629 ‍కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. పన్ను వాయిదా సర్దుబాటు భారం రూ.709 కోట్ల కారణంగా ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని యస్‌ బ్యాంక్‌ తెలిపింది. స్టాక్‌ మార్కెట్లో లిస్టయినప్పటి  నుంచి చూస్తే ఇది ఈ బ్యాంక్‌కు రెండో త్రైమాసిక నష్టం. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.951 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో రూ.96 కోట్లు చొప్పున  నికర లాభాలు ఆర్జించామని బ్యాంక్‌ పేర్కొంది. గత క్యూ2లో రూ.8,714 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.8,348 కోట్లకు తగ్గిందని తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర వడ్డీ ఆదాయం 4 శాతం తగ్గి రూ.2,190 కోట్లకు చేరిందని తెలిపింది. గత క్యూ2లో 3.3 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ ఈ క్యూ2లో 2.7 శాతానికి తగ్గిందని పేర్కొంది. 

బ్యాంక్‌ రుణ నాణ్యత అధ్వానంగా మారింది. మొండి బకాయిలు దాదాపు ఐదు రెట్లు పెరిగాయి. గత క్యూ2లో 1.60 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 7.39 శాతానికి చేరాయని యెస్‌ బ్యాంక్‌ తెలిపింది. అలాగే నికర మొండి బకాయిలు 0.84 శాతం నుంచి 4.35 శాతానికి పెరిగాయని పేర్కొంది. తాజా మొండి బకాయిలు రూ.5,950 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. మొండి బకాయిలు పెరగడంతో కేటాయింపులు కూడా పెరిగాయి. కేటాయింపులు రూ.943 కోట్ల నుంచి  రూ.1,336 కోట్లకు పెరిగాయని వివరించింది. 

స్టాండ్‌ అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.965 కోట్ల నికర లాభం  రాగా, ఈ క్యూ2లో రూ.600 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది. 
 



You may be interested

ఆశాజనకంగా అక్టోబర్‌ ఆటో అమ్మకాలు

Saturday 2nd November 2019

7 నెలల తరువాత పెరిగిన మారుతీ విక్రయాలు పుంజుకుంటున్న మహీంద్ర, టయోటా న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ అమ్మకాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆటో రంగం అక్టోబర్‌ నెల్లో ఆశాజనక వాతావరణాన్ని నమోదుచేసింది. ఈ రంగంలోని దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ ఇండియా వంటి సంస్థలు అమ్మకాల్లో పురోగతిని చూపాయి. దాదాపు 7 నెలల అనంతరం మారుతీ 4.5 శాతం వృద్ధి రేటుతో సానుకూల సంకేతాలను ఇచ్చింది. ప్యాసింజర్‌, వాణిజ్య విక్రయాలు గతంతో పోల్చితే అక్టోబర్‌లో

జీఎస్‌టీ వసూళ్లు పేలవమే..!

Saturday 2nd November 2019

అక్టోబర్‌లో రూ.95,380 ‍కోట్లు న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు అక్టోబర్‌లో 5.29 శాతం తగ్గాయి. రూ.95,380 కోట్లుగా నమోదయాయ్యియి. 2018 ఇదే నెల్లో ఈ వసూళ్లు రూ.1,00,710 కోట్లు. శుక్రవారం ప్రభుత్వం ఈ గణాకాలను విడుదల చేసింది. జీఎస్‌టీ వసూళ్లు లక్ష కోట్లకన్నా తగ్గడం ఇది వరుసగా మూడవనెల. నిజానికి  పండుగల సీజన్‌ కావడంతో అక్టోబర్‌లో అయినా రూ. లక్ష కోట్లపైబడి జీఎస్‌టీ వసూళ్లు జరుగుతాయన్న అంచనా ఉంది.

Most from this category