News


ఖాతాదారులకు యస్‌ బ్యాంక్ వెసులుబాటు

Wednesday 11th March 2020
news_main1583897090.png-32396

  • ఇన్‌వార్డ్ ఐఎంపీఎస్‌, నెఫ్ట్ సేవల పునరుద్ధరణ
  • ఇతర బ్యాంకు ఖాతాల ద్వారా ఈఎంఐలు,
  • క్రెడిట్‌ కార్డు చెల్లింపులకు ఓకే 

న్యూఢిల్లీ: మారటోరియం వల్ల తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని సర్వీసులను యస్‌ బ్యాంక్ క్రమంగా పునరుద్ధరిస్తోంది.  తాజాగా ఇన్‌వార్డ్‌ ఐఎంపీఎస్‌, నెఫ్ట్ సర్వీసులను పునరుద్ధరించినట్లు మంగళవారం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో వెల్లడించింది. దీంతో యస్‌ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డులు, రుణాలు తీసుకున్న వారు ఇతర బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం తమ ఏటీఎంలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, ఇతర ఏటీఎంల నుంచి కూడా నిర్దిష్ట స్థాయిలో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ యస్‌ బ్యాంక్ తెలిపింది. సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ నెలరోజుల మారటోరియం విధించడంతో కస్టమర్లలో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. నగదు విత్‌డ్రాయల్‌పై ఆంక్షలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫాంల ద్వారా డిజిటల్ పేమెంట్స్ సేవలు కూడా నిల్చిపోవడం మరింత గందరగోళానికి దారి తీసింది. ఫారెక్స్ సర్వీసులు, క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం పడింది. 
యస్‌ బ్యాంక్‌లో టియర్‌ 1 బాండ్లేమీ లేవు: శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్
నిధుల కొరతతో సతమతమవుతున్న యస్‌ బ్యాంక్‌లో తమకు టియర్‌ 1 స్థాయి బాండ్లేమీ లేవని శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ (ఎస్‌టీఎఫ్‌సీ) సంస్థ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. అప్పర్‌ టియర్‌ 2 స్థాయి బాండ్లలో 2010లో ఇన్వెస్ట్ చేసిన రూ. 50 కోట్లు మాత్రమే రావాల్సి ఉందని పేర్కొంది. ఆర్‌బీఐ రూపొందించిన పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకారం.. సుమారు రూ. 10,800 కోట్ల టియర్‌ 1 బాండ్ల చెల్లింపులు రద్దు కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు, 2006లో జారీ చేసిన వారంట్లకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తమపై రూ. 5 కోట్ల జరిమానా విధించినట్లు ఎస్‌టీఎఫ్‌సీ తెలిపింది. ప్రస్తుతం తమ గ్రూప్‌లో భాగమైన శ్రీరామ్ హోల్డింగ్స్ (మద్రాస్‌) (ఎస్‌హెచ్‌ఎంపీఎల్‌) అప్పట్లో రూ. 244 కోట్ల సమీకరణ కింద ఒక ప్రవాస భారతీయ వ్యక్తి నుంచి కూడా నిధులు సమీకరించినట్లు వివరించింది. ఈ లావాదేవీలో విదేశీ మారక నిర్వహణ (ఫెమా) చట్టాల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలతో ఈడీ తాజా జరిమానా విధించినట్లు ఎస్‌టీఎఫ్‌సీ తెలిపింది. కానీ నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరించినట్లుగా విశ్వసిస్తున్నామని పేర్కొంది. ఈ కేసులో ఎస్‌హెచ్‌ఎంపీఎల్‌కు గతంలో డైరెక్టర్లుగా వ్యవహరించిన ముగ్గురిపై కూడా ఈడీ తలో రూ. 50 లక్షల జరిమానా విధించింది. You may be interested

కో–ఆపరేటివ్‌లకూ యస్‌ బ్యాంక్‌ కష్టాలు

Wednesday 11th March 2020

54 పట్టణ సహకార బ్యాంక్‌ల సీటీఎస్‌ల రద్దు రూ.200 కోట్ల మేర నిలిచిపోయిన చెక్‌ లావాదేవీలు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కో–ఆప్‌ బ్యాంక్‌లపై ప్రభావం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: యస్‌ బ్యాంక్‌ ఆర్థిక సంక్షోభం ప్రభావం దేశంలోని పట్టణ సహకార బ్యాంక్‌ల మీద పడింది. యస్‌ బ్యాంక్‌ మారటోరియం నేపథ్యంలో యస్‌తో ఒప్పంద చేసుకున్న అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్స్‌ (యూసీబీ) చెక్‌ ట్రూన్‌కేషన్‌ సిస్టమ్‌ (సీటీసీ)లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రద్దు

టీసీఎస్‌ మధ్యంతర డివిడెండ్‌ రూ.12

Wednesday 11th March 2020

న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నది. ఈ మేరకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని టీసీఎస్‌ వెల్లడించింది. ఈ నెల 20లోపు తమ షేర్లను హోల్డ్‌ చేసిన వాటాదారులకు ఈ నెల 24న ఈ డివిడెండ్‌ను చెల్లిస్తామని వివరించింది. 

Most from this category