News


విప్రో లాభం రూ.2,388 కోట్లు

Thursday 18th July 2019
news_main1563432177.png-27150

  • వార్షికంగా 12 శాతం వృద్ధి 
  • సీక్వెన్షియల్‌గా 4 శాతం క్షీణత 
  • 5 శాతం వృద్ధితో రూ.14,716 కోట్లకు ఆదాయం 

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 12 శాతం వృద్ధితో రూ.2,388 కోట్లకు పెరిగింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, (గత క్యూ4లో వచ్చిన నికర లాభం రూ.2,484 కోట్లుతో పోల్చితే) 4 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.13,978 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.14,716 కోట్లకు పెరిగిందని విప్రో కంపెనీ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, 9 శాతం తగ్గింది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఆదాయం 2 శాతం మేర పెరగగలదని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. కాగా ఇటీవలే ఫలితాలు వెల్లడించిన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ల కంటే విప్రో ఆదాయం విషయంలో వెనకబడిపోయింది. టీసీఎస్‌ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.38,172 కోట్లకు, ఇన్ఫోసిస్‌ ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.21,803 కోట్లకు పెరిగాయి. 

నిర్వహణ లాభం 6 శాతం డౌన్‌...
కంపెనీకి కీలకమైన ఐటీ సర్వీసుల విభాగం ఆదాయం 2 శాతం తగ్గి 203 కోట్ల డాలర్లకు చేరిందని విప్రో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో ఈ విభాగం ఆదాయం 204-208 కోట్ల డాలర్ల(0-2 శాతం వృద్ధి)రేంజ్‌లో ఉండగలదని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ విభాగం నిర్వహణ లాభం 6 శాతం తగ్గి రూ.2,652 కోట్లకు చేరిందని, మార్జిన్‌ 1 శాతం తగ్గి 18.4 శాతానికి చేరిందని తెలిపింది. వేతనాల వ్యయం అధికంగా ఉండటం, రూపాయి బలపడటం దీనికి కారణాలని వివరించింది. 

పరిస్థితులు మెరుగుపడతాయ్‌...! 
10 కోట్ల డాలర్లకు మించిన డీల్స్‌ మూడు సాధించామని విప్రో కంపెనీ విప్రో సీఈఓ  ఈడీ, అబిదాలి జడ్‌ నీమూచ్‌వాలా పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ నిలకడగానే ఉందని తెలిపారు. అయితే ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండటం వల్ల బ్యాంకింగ్‌, ఆర్థిక, భీమా రంగ కంపెనీలు నిర్ణయాలు తీసుకునే విషయంలో వెనకాడుతున్నాయని వివరించారు. ఇది తాత్కాలికంగానే ఉంటుందని, రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మెరుగుపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 
షేర్ల బైబ్యాక్‌ పూర్తి చేస్తాం...
సెబీ ఆమోదం రాగానే రూ.10,500 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను పూర్తి చేస్తామని విప్రో తెలిపింది. ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఈ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ.325 ధరకు మబొత్తం 32.31 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేస్తోంది. 

ఈ ఆర్థిక సంవత్సరం మందగమనంగానే మొదలైందని విప్రో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జతిన్‌ దలాల్‌ చెప్పారు. భవిష్యత్తులో  మంచి వృద్ధి సాధన దిశగా ప్రతిభ, సామర్థ్యాలపై పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. 
 



You may be interested

అన్నై ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ఐపీఓకు సెబీ ఆమోదం

Thursday 18th July 2019

ఇష్యూ సైజు రూ.200-225 కోట్లు  న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ అన్నై ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. వాటర్‌ మేనేజ్‌మెంట్‌, ఇరిగేషన్‌ ఈపీసీ సెగ్మెంట్లలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమిళనాడుకు చెందిన ఈ  కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.200-225 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ. కోటి ఈక్విటీ షేర్లను జారీ

యస్‌ బ్యాంక్‌ లాభం 92 శాతం డౌన్‌

Thursday 18th July 2019

రూ.96 కోట్లకు నికర లాభం  భారీగా పెరిగిన మొండి బకాయిలు కేటాయింపులు కూడా అదే స్థాయిలో  ఇక ఇప్పటి నుంచి పుంజుకుంటాం విశ్వాసం వ్యక్తం చేసిన బ్యాంక్‌  ముంబై: ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 92 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.1,260 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో  రూ. 96 కోట్లకు చేరిందని యస్‌ బ్యాంక్‌ తెలిపింది.  మొండి బకాయిలు భారీగా

Most from this category