News


వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో వాల్‌మార్ట్‌

Tuesday 14th January 2020
news_main1578974508.png-30910

  • 56 మందికి ఉద్వాసన
  • లిస్టులో 8 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు
  • భారత్‌ నుంచి నిష్క్రమించే యోచన లేదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ:   పోటీ సంస్థలను దీటుగా ఎదుర్కొనే క్రమంలో రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ తాజాగా భారత్‌లో వ్యాపార  కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 56 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో 8 మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ ఉండగా, మిగతా వారిలో.. మధ్య స్థాయి, కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఉద్వాసనకు గురైన వారిలో అత్యధిక శాతం మంది .. స్టోర్స్ విస్తరణలో కీలకమైన రియల్ ఎస్టేట్ విభాగంలోని వారే కావడం గమనార్హం.  "మరింత మెరుగ్గా కార్యకలాపాలు నిర్వహించుకునే మార్గాలపై దృష్టి పెడుతున్నాం. దానికి అనుగుణంగానే కార్పొరేట్ స్వరూపంలో మార్పులు, చేర్పులు చేస్తున్నాం" అని వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈవో క్రిష్ అయ్యర్ తెలిపారు. తొలగించిన ఉద్యోగులకు మెరుగైన ప్యాకేజీతో పాటు ఇతరత్రా ఉద్యోగావకాశాలు దొరకపుచ్చుకునేందుకు అవసరమైన సహాయ, సహకారాలు కంపెనీ అందిస్తోందని అయ్యర్ చెప్పారు.

భారత్‌కు కట్టుబడి ఉన్నాం...
లాభాల్లోకి మళ్లే అవకాశాలేమీ కనిపించకపోతుండటంతో వాల్‌మార్ట్‌.. భారత్‌లో స్టోర్స్‌పరమైన కార్యకలాపాలను మూసివేయాలనే ఆలోచనలో ఉందని, ఏప్రిల్‌లో మరో విడత ఉద్వాసనలు ఉంటాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. భారత్‌లో హోల్‌సేల్ రిటైల్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నామని, నుంచి నిష్క్రమించే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. గతేడాది కొత్తగా ఆరు బెస్ట్‌ ప్రైస్ హోల్‌సేల్ స్టోర్స్‌, ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ ప్రారంభించినట్లు.. అమ్మకాలు 22 శాతం పెరిగినట్లు అయ్యర్ చెప్పారు. కస్టమర్లకు మరింతగా సేవలు అందించేందుకు అవసరమైన పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. 

అమెజాన్‌, జియోమార్ట్‌లతో పోటీ...
2014 జులైలో పుణె, హైదరాబాద్‌లో బెస్ట్ ప్రైస్ స్టోర్స్‌తో వాల్‌మార్ట్‌.. భారత్‌లో హోల్‌సేల్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ఫార్మాట్ల ద్వారా విక్రయాలు జరుపుతోంది. 28 హోల్‌సేల్‌ స్టోర్స్ ఉన్నాయి. 2018లో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాలు కొనుగోలు చేసింది. అయితే గత కొన్నాళ్లుగా పోటీ సంస్థ అమెజాన్‌.. దూకుడుగా ముందుకెడుతోంది. ఫ్యూచర్‌ రిటైల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు ఇతరత్రా ఆఫ్‌లైన్ రిటైల్ సంస్థల్లోనూ వాటాలు దక్కించుకుంటోంది. మరోవైపు దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ కూడా జియో మార్ట్‌ పేరిట నిత్యావసరాల ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించింది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్‌ ద్వారా ఈ రంగంలో భారీగా కార్యకలాపాలు విస్తరిస్తున్న రిలయన్స్.. అటు వాల్‌మార్ట్‌, ఇటు అమెజాన్‌లకు గట్టి పోటీనిచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వాల్‌మార్ట్ భారత కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణ ప్రాధాన్యం సంతరించుకుంది. You may be interested

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లపై సీసీఐ దర్యాప్తు

Tuesday 14th January 2020

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లపై కాంపిటీషన్‌‌ కమిషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సీసీఐ) సోమవారం దర్యాప్తునకు ఆదేశించింది. భారీ డిస్కౌంట్లు, ఒక వస్తువు కొంటే మరోకటి పొందేలా ఆఫర్లు, ఎంపిక చేసిన అమ్మకందారులు మాత్రమే ప్లాట్‌ఫామ్‌లలో విక్రయాలు జరపడం వంటి అంశాల్లో ఈ సంస్థలు దుర్వినియోగానికి పాల్పడట్లు ఆరోపణలు వచ్చినట్లు సీసీఐ వెల్లడించింది. ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు

బ్లూచిప్‌ పీఎస్‌యూల్లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ !

Tuesday 14th January 2020

కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం  న్యూఢిల్లీ: నాల్కో, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ వంటి బ్లూచిప్‌ పీఎస్‌యూల్లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో షేర్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లక్ష్య సాధన కష్టతరం కానుండటంతో నాల్కో, కోల్‌ ఇండియా వంటి మంచి పనితీరు ఉన్న ప్రభుత్వ రంగ

Most from this category