News


విశాఖ పోర్టు లాభం రూ. 200 కోట్లు

Friday 10th May 2019
news_main1557472315.png-25656

  • ఏటా ఐదు శాతం వృద్ధి రేటు
  • రూ. 3,700 కోట్లతో పోర్టు ఆ«ధునికీకరణ
  • రూ. 5 వేల కోట్లతో కాలుష్య నియంత్రణ చర్యలు
  •  విలాసవంతమైన క్రూయిజ్‌ల నిర్మాణం కోసం 77 కోట్లు ఖర్చు
  • విశాఖ పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు వెల్లడి


సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు గడిచిన ఐదేళ్లలో ఆర్థిక, నైపుణ్యత, మౌలిక సదుపాయాలు తదితర అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి ఏటా ఐదు శాతం వృద్ధి రేటు సాధించడమే కాకుండా దేశంలోనే శుభ్రమైన పోర్టుగా వరుసగా మూడేళ్లు జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. గ్రీన్‌ ఇండస్ట్రీ, గ్రీన్‌ పోర్టు అవార్డులను కూడా సొంతం చేసుకుందని చెప్పారు. పోర్టు అభివృద్ధి కోసం తన హయాంలో చేపట్టిన కార్యక్రమాలను కృష్ణబాబు శుక్రవారం విశాఖలో మీడియాకు వివరించారు. 2017–18లో 63.54 మిలియన్‌ టన్నుల మేర ఎగుమతులు, దిగుమతులు జరిగితే 2018–19లో 65.3 మిలియన్‌ టన్నులకు పెరిగాయని, తద్వారా రూ. 200 కోట్ల లాభాలను ఆర్జించి పోర్టు రికార్డు నెలకొల్పిందని తెలిపారు. రూ. 300 కోట్ల ఖర్చుతో పోర్టు ఛానల్‌ లోతును 11 మీటర్ల నుంచి 14.5 మీటర్లకు పెంచామని, దీనివల్ల లక్ష టన్నులకు మించిన నౌకలు కూడా ఇన్నర్‌ హార్బర్లలోకి వచ్చే వెసులుబాటు కలిగిందని చెప్పారు. 85 ఏళ్ల కిందట ఏర్పడిన పోర్టును ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఆధునికీకరిస్తున్నామని, ఇందుకోసం విశాఖ పోర్టు ట్రస్ట్‌ రూ. 1,200 కోట్లు ఖర్చు చేస్తే, ప్రైవేటు సెక్టార్‌ నుంచి రూ. 2,500 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. ఏడాదికి 13.5 లక్షల కంటైనర్లు వినియోగమయ్యేలా రూ. 633 కోట్లతో కంటైనర్‌ టెర్మినల్‌ను విస్తరించే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విలాసవంతమైన భారీ క్రూయిజ్‌ల నిర్మాణం కోసం రూ. 77 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పోర్టు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు కాన్వెంట్‌ కూడలి నుంచి సీ హార్స్‌ జంక‌్షన్‌ వరకు 7.5 మీటర్ల ఎత్తులో రక్షణ గోడ నిర్మించామని వివరించారు. కాలుష్య నియంత్రణ కోసం గడిచిన 8 ఏళ్లలో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. సాగరమాల ప్రాజెక్టు కింద పోర్టు రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించడంతో పాటు షీలానగర్‌ నుంచి సబ్బవరం వరకు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి అనుసంధానమయ్యేలా పనులు జరుగుతున్నాయన్నారు. సోలార్‌ ఎనర్జీపై నడుస్తున్న ఏకైక పోర్టు విశాఖ పోర్టు అని తెలిపారు. పోర్టు ట్రస్ట్‌ 31 పాఠశాలలను దత్తత తీసుకుందని, ఏటా 8 వేల మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, కంప్యూటర్స్, ఆయా పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కోసం సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఐదేళ్ల తన పదవీ కాలం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్‌ పీఎల్‌ హరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 You may be interested

ఏపీ నుంచి మెడికల్‌..

Friday 10th May 2019

తెలంగాణ నుంచి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు స్నాప్‌డీల్‌లో ఎక్కువగా అమ్ముడయ్యేవివే హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ ఈ–కామర్స్‌ కంపెనీ స్నాప్‌డీల్‌లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువగా అమ్ముడుపోయేవి మెడికల్‌ ఉత్పత్తులు కాగా, తెలంగాణ నుంచి ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలే ఎక్కువగా కొంటున్నారు. ‘‘హైదరాబాద్‌ నుంచి కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్స్‌ మదర్‌బోర్డ్స్, ర్యామ్, బ్యాటరీలు, అడాప్టర్లు, హార్డ్‌ డివైజ్‌లకు డిమాండ్‌ ఉంది. కర్నూల్‌లో స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ డివైజ్‌లు, కేబుల్‌ చార్జర్లు, స్పీకర్లు, హెడ్‌ఫోన్లకు, కడప నుంచి ధర్మామీటర్లు, బీపీ,

గ్రామీణ బ్యాంకుల్లో మేమే నెంబర్‌వన్‌!

Friday 10th May 2019

మిగులు నిధుల పరంగా టాప్‌లో ఉన్నాం సెప్టెంబర్‌ నాటికి ఏపీకి పరిమితం సాగు, గృహ రుణాలపై ఎక్కువ ఫోకస్‌ పెన్షన్‌ కేటాయింపుల వల్ల లాభాల్లో క్షీణత ఏపీజీవీబీ చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌ హైదరాబాద్‌, సాక్షి బిజినెస్‌: దేశంలోని గ్రామీణ బ్యాంకులన్నింటిలో మిగులు నిధులు, ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ పరంగా టాప్‌లో ఉన్నామని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. బ్యాంకు వద్ద రూ.2286 కోట్ల మిగులు నిధులున్నాయని, నిర్వహణ లాభం 16 శాతం వృద్దితో రూ.

Most from this category