News


ఇక్కడ ఎస్‌యూవీలంటేనే ఇష్టం

Saturday 7th December 2019
news_main1575690516.png-30101

  • రెండేళ్లలో నాలుగు కొత్త ఎస్‌యూవీలు 
  • ఫోక్స్‌వ్యాగన్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ న్యాప్‌

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: యూరోపియన్‌ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌ వచ్చే రెండేళ్లలో కొత్తగా నాలుగు స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ను (ఎస్‌యూవీ) మార్కెట్లోకి తేనుంది. ప్రస్తుతం టిగువన్‌ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో కంపెనీ విక్రయిస్తోంది. భారతీయులకు ఎస్‌యూవీలపై మక్కువ ఎక్కువని ఫోక్స్‌వ్యాగన్‌ ప్యాసింజర్‌ కార్స్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ న్యాప్‌ శుక్రవారమిక్కడ చెప్పారు. ఈ విభాగంలో రానున్న రోజుల్లో తమ స్థానాన్ని పదిలపర్చుకుంటామన్నారు. 2020లో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పోలో నూతన మోడళ్లను ప్రదర్శిస్తామని తెలియజేశారు. కంపెనీ 20వ కార్పొరేట్‌ బిజినెస్‌ సెంటర్‌ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఫోక్స్‌వ్యాగన్‌ కార్లు ఖరీదైనవని కస్టమర్లు అనుకునేవారు. నాలుగేళ్ల వారంటీ, విడిభాగాల ధర 15 శాతం తగ్గించడం ద్వారా ఆ భావన నుంచి బయటపడేలా చేశాం’ అని చెప్పారు. ఎస్‌యూవీలతోపాటు మరో రెండు కొత్త మోడళ్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
అయిదేళ్లలో 3 శాతం...
ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్‌కు 1.4 శాతం వాటా ఉంది. అయిదేళ్లలో 3 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు స్టీఫెన్‌ చెప్పారు. ‘ఇండియా 2.0 కార్యక్రమంలో భాగంగా 2022 నాటికి రూ.8,000 కోట్లు ఖర్చు చేయాలని గతేడాది నిర్ణయించాం. మోడళ్ల అభివృద్ధి, ఆర్‌అండ్‌డీ కోసం ఈ పెట్టుబడి పెడతాం. పుణే ఆర్‌అండ్‌డీ కేంద్రంలో ప్రస్తుతం 650 మంది ఇంజనీర్లు ఉన్నారు. దీనిని 5,000 స్థాయికి పెంచుతాం. భారత్‌ సహా అంతర్జాతీయ మార్కెట్‌ కోసం ఇక్కడ కార్లను అభివృద్ధి చేస్తాం. బీఎస్‌-4 వాహనాల తయారీని డిసెంబరు నుంచి నిలిపేస్తున్నాం. మార్కెట్లో బీఎస్‌-4తో పోలిస్తే బీఎస్‌-6 వాహనాల ధర డీజిల్‌ 12- 15 శాతం, పెట్రోల్‌ 5 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పాత మోడళ్లన్నిటినీ  కొనసాగిస్తాం. చార్జింగ్‌ స్టేషన్లు విరివిగా అందుబాటులోకి వచ్చాక ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ను ప్రవేశపెడతాం’ అని తెలిపారు. 



You may be interested

ప్రభుత్వం సాయం చేయకపోతే మూతే!!

Saturday 7th December 2019

(అప్‌డేటెడ్‌..) వొడా- ఐడియా బకాయిల భారంపై చైర్మన్‌ బిర్లా వ్యాఖ్య ఎకానమీ మెరుగుపడాలంటే ట్యాక్స్‌ రేట్ల తగ్గింపు సరిపోదు ఉద్దీపన చర్యలు అవసరమని వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కేంద్రానికి చెల్లించాల్సిన పాత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఊరట చర్యలేమీ తీసుకోకపోతే కంపెనీని మూసివేయక తప్పదని టెలికం సంస్థ వొడాఫోన్‌- ఐడియా చైర్మన్‌ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. "ప్రభుత్వం నుంచి ఏ రకమైన తోడ్పాటూ లేకపోతే ఇక వొడాఫోన్‌ ఐడియా కథ ముగిసినట్లే. ఇందులో ఇంకా పెట్టుబడులు

సౌదీ ఆరామ్‌కో..... ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ !

Saturday 7th December 2019

2,560 కోట్ల డాలర్లతో ‘అలీబాబా’ రికార్డ్‌ బ్రేక్‌ ఈ నెల 12న సౌదీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్‌ ! రియాద్‌: ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్‌ విలువ గల కంపెనీగా సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం, సౌదీ ఆరామ్‌కో అవతరించనున్నది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నిలిచింది. ఐపీఓలో భాగంగా తన షేర్‌ ధరను 32 రియాల్స్‌(8.53 డాలర్లు-రూ.601)గా  సౌదీ ఆరామ్‌కో నిర్ణయించింది.

Most from this category