News


వాహన అమ్మకాలు... బే‘‘కార్‌’’..!

Tuesday 11th February 2020
news_main1581390149.png-31669

  • జనవరిలో 6 శాతం తగ్గిన అమ్మకాలు
  • కొనుగోలు భారం పెరగడం, మందగమనం కారణం
  • సియామ్ నివేదికలో వెల్లడి

గ్రేటర్ నోయిడా: దేశీయంగా వాహన విక్రయాల్లో మందగమనం కొనసాగుతోంది. కొత్త ఏడాదిలోనూ అమ్మకాలు పుంజుకోలేదు. జనవరిలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు 6.2 శాతం క్షీణించాయి. వాహనాల కొనుగోలు భారం పెరగడం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మందగించడం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.  ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త బీఎస్‌6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంఽడే వాహనాల రేట్లు అధిక స్థాయిలో ఉండటం, ముడివస్తువుల ధరల పెరగడంతో జనవరిలో కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల రేట్లను పెంచడం కూడా అమ్మకాలపై ప్రతికూల ప్రభావాలు చూపాయి. "జీడీపీ వృద్ధి మందగమనం, వాహన కొనుగోలు వ్యయాలు పెరగడం వంటి అంశాల ప్రతికూల ప్రభావాలు వాహన విక్రయాలపై కొనసాగుతున్నాయి" అని అని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలిపారు. "ఇన్‌ఫ్రా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ఇటీవలచేసిన ప్రకటనలతో రాబోయే రోజుల్లో వాహనాల అమ్మకాలు పుంజుకోగలవని ఆశిస్తున్నాం. ముఖ్యంగా వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల సెగ్మెంట్ మెరుగుపడగలదని భావిస్తున్నాం" అని ఆయన చెప్పారు.

త్రిచక్ర వాహనాలు కాస్త ఊరట...
జనవరి గణాంకాలను ప్రస్తావిస్తూ.. త్రిచక్ర వాహనాలు మినహా అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు పడిపోయాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్పారు. పరిశ్రమ ఇంకా నెగటివ్‌లోనే ఉన్నప్పటికీ.. పండుగల సీజన్ తర్వాత విక్రయాల క్షీణత తీవ్రత కాస్త తగ్గిందని ఆయన తెలిపారు. "ప్రస్తుతం కొనసాగుతున్న ఆటో ఎక్స్‌పోలో సందర్శకుల స్పందనను బట్టి చూస్తే.. వినియోగదారుల సెంటిమెంటు మరింత మెరుగుపడగలదని ఆశిస్తున్నాం. ఇందులో ఇప్పటిదాకా దాదాపు 70 వాహనాలను ఆవిష్కరించారు" అని ఆయన చెప్పారు. 

విక్రయాల తీరిదీ...

- గతేడాది జనవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,80,091 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది జనవరిలో 2,62,714 యూనిట్లకు తగ్గాయి.
- కార్ల అమ్మకాలు 8.1 శాతం క్షీణించి 1,79,324 యూనిట్ల నుంచి 1,64,793కి పరిమితమయ్యాయి.
- ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. 15,97,528 యూనిట్ల నుంచి 13,41,005 యూనిట్లకు తగ్గాయి. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 15 శాతం తగ్గి 10,27,766 నుంచి 8,71,886కి క్షీణించాయి. స్కూటర్లు 16 శాతం క్షీణించి 4,97,169 యూనిట్ల నుంచి 4,16,594కి పరిమితమయ్యాయి.
- వాణిజ్య వాహనాల అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. 87,591 యూనిట్ల నుంచి 75,289 యూనిట్లకు తగ్గాయి.
- వివిధ కేటగిరీల్లో అన్ని వాహనాల విక్రయాలు 13.83 శాతం తగ్గి.. 20,19,253 యూనిట్ల నుంచి 17,39,975 యూనిట్లకు క్షీణించాయి.
- కంపెనీలవారీగా చూస్తే కార్ల విభాగంలో మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు మాత్రం 0.29 శాతం పెరిగి 1,39,844 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 8 శాతం క్షీణించి 42,002 యూనిట్లకు, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 17 శాతం తగ్గి 19,794 యూనిట్లకు పరిమితమయ్యాయి.
- ‍ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ విక్రయాలు 14 శాతం పడిపోయాయి. 4,88,069కి చేరాయి. అటు హోండా మోటార్‌సైకిల్‌ అమ్మకాలు కూడా సుమారు 7 శాతం క్షీణించి 3,74,114 యూనిట్లకు పరిమితమయ్యాయి. టీవీఎస్ మోటార్ అమ్మకాలు సుమారు 29 శాతం క్షీణించి 1,63,007 యూనిట్లకు తగ్గాయి. You may be interested

ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎన్‌టీపీసీ హ్యాపీ

Tuesday 11th February 2020

2018-19లో లాభదాయక కంపెనీలు ఇవి... పార్లమెంటులో సర్వే న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి 2018-19లో లాభాల బాటన నిలిచిన కంపెనీల్లో తొలి మూడు స్థానాల్లో ఓఎన్‌జీసీ, ఇండియన్‌ ఆయన్‌ కార్పొరేషన్‌, ఎన్‌టీపీసీలు ఉన్నాయి. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా, ఎంటీఎన్‌ఎల్‌లు భారీ నష్టాలను మూటగట్టుకున్న ప్రభుత్వ రంగ కంపెనీలుగా మిగిలాయి. వరుసగా మూడేళ్ల నుంచీ ఈ కంపెనీలది ఇదే పరిస్థితి. 2018-19కి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి పార్లమెంటులో

మరికొంత కరెక్షన్‌కు అవకాశం!

Tuesday 11th February 2020

నిఫ్టీ వరుసగా రెండో సెషన్‌లో సోమవారం నష్టపోయింది. అయితే కీలకమైన 12,050 స్థాయిలకు దిగువకు వచ్చేసి 12,031 వద్ద క్లోజయింది. దీంతో సూచీ 50 ఈఎంఏ, 20ఈఎంఏ, 13ఈఎంఏలను కోల్పోయినట్టయింది. దీంతో నిఫ్టీకి 12,100 నిరోధ స్థాయిగా పనిచేస్తుందని, ఇది అధిగమించి క్లోజయితే మరికొంత ర్యాలీకి అవకాశం ఉంటుందని, దిగువ వైపున 11,970-11,890 మద్దతు స్థాయిలుగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.    ‘‘నిర్మాణాత్మకంగా చూస్తే నిఫ్టీ పుల్‌బ్యాక్‌ (ఇటీవలి నష్టాల తర్వాత ర్యాలీ)

Most from this category