News


లాభాల్లోకి ట్రూజెట్‌!

Saturday 13th July 2019
news_main1562991909.png-27033

  • గత అక్టోబరు నుంచి నిర్వహణ లాభాలు
  • ప్రస్తుతం సంస్థ చేతిలో 5 విమానాలు 
  • నవంబరు నాటికి ఈ సంఖ్య 10కి చేరుతుంది
  • ఈశాన్యం సహా మరిన్ని ప్రాంతాలకు సర్వీసులు
  • ‘అనుబంధ’ ఆదాయాలపైనా ఫోకస్‌
  • సీఎఫ్‌ఓ విశ్వనాథ్‌, ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ వెల్లడి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: విమానయాన రంగ కంపెనీలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో... తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్‌ మాతృ సంస్థ టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ మాత్రం తొలిసారి లాభాల్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. 2018 అక్టోబరు నుంచి నష్టాలు లేవని, నిర్వహణ లాభాలు ఆర్జిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.85 కోట్ల నష్టాలొచ్చాయి. ఈ ఏడాది ఫలితాలింకా ఆడిట్‌ కాలేదని, కాకపోతే తాము లాభాల్లోకి మాత్రం ప్రవేశిస్తున్నామని సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ కె.జి.విశ్వనాథ్‌ చెప్పారు. దాదాపు 23 శాతం ఎబిటా మార్జిన్లు సాధిస్తున్నామని, ఇది ఈ రంగంలోని అన్ని కంపెనీలకన్నా ఎక్కువని కంపెనీ సీసీవో సుధీర్‌ రాఘవన్‌ వెల్లడించారు. సంస్థకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారమిక్కడ వారితో పాటు సీఈఓ మూర్తి, ఈ కంపెనీని ప్రమోట్‌ చేస్తున్న మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా (ఎంఈఐఎల్‌) గ్రూప్‌ డైరెక్టర్‌ కె.వి.ప్రదీప్‌ విలేకరులతో మాట్లాడారు. కంపెనీ భవిష్యత్‌ ప్రణాళికలు వివరించారు. 
చేతికి కొత్త విమానాలు...
2015లో హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటయిన ట్రూజెట్‌.. రెండు విమానాలతో మొదలై ప్రస్తుతం 5 విమానాలకు చేరుకుంది. గతేడాది జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి సిబ్బందితో సహా 5 విమానాలను లీజుకు తీసుకుని సంఖ్యను 10కి చేర్చాలని లక్ష్యించినా... జెట్‌ సంక్షోభం కారణంగా కుదరలేదు. ‘‘నవంబరు-డిసెంబరు మా విమానాల సంఖ్య 10కి చేరుతుంది. 2020లో మరో 5-8 జతకూడనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల రూట్లకు సంబంధించి గతేడాదే ఉడాన్‌ బిడ్లు సాధించాం. మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాం’’ అని ప్రదీప్‌ వివరించారు. స్వయంగా ఎదగటానికే ప్రయత్నిస్తామని, ఇతర సంస్థల్ని కొనేందుకు సరైన అవకాశం వస్తే మాత్రం పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారాయన. ప్రస్తుతం కంపెనీలో మేఘా ఇంజినీరింగ్‌కు 90 శాతం వాటా ఉందని, నిధుల కోసం దీన్ని పబ్లిక్‌ ఇష్యూకు తెచ్చి, వాటాలు విక్రయించే యోచనేదీ ప్రస్తుతమైతే లేదని స్పష్టంచేశారు. ‘‘మేం గణనీయమైన స్థాయికి చేరాలి. అందుకు కనీసం మూడేళ్లు పడుతుందని నా అంచనా. ఆ స్థాయికి చేరిన తరవాత మాత్రం పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే ఆలోచన తప్పకుండా చేస్తాం’’ అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  
ఆదాయానికి మూడు మార్గాలు..!
ఖర్చులు తగ్గించుకోవటంతో పాటు లాభాల్లోకి ప్రవేశించడానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నట్లు విశ్వనాథ్‌ చెప్పారు. ‘‘ప్రయాణికులకు యాడ్‌ ఆన్‌ సేవలందించడం, ఇతర విమానయాన కంపెనీలకు థర్డ్‌పార్టీ సర్వీసులివ్వటం, విమానాల్లో ప్రకటనలు వంటి మార్గాలన్నీ అన్వేషిస్తున్నాం. అందుకే వేగంగా నష్టాల నుంచి బయటపడ్డాం. విమానయాన రంగం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న ఈ తరుణంలో కూడా చక్కని వృద్ధిరేటుతో మేం లాభాల్లోకి మళ్లగలిగాం’’ అని ఆయన వివరించారు. అందుకే ఒక సీట్‌ కిలోమీటర్‌కు (అంటే ప్రయాణించే ప్రతి కిలోమీటరుకు ఒక సీటు ఆర్జించే ఆదాయం) తాము ఆర్జిస్తున్న ఆదాయం పోటీ కంపెనీలకన్నా 40 శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. ‘‘2019లో మరో 6 కొత్త గమ్యాలకు విమానాలు నడుపుతాం. 2020 నాటికి ఈ సంఖ్య రెట్టింపవుతుంది. ప్రస్తుతం నెలకు 1,200 సర్వీసులు నడుస్తున్నాయి. కొత్త విమానాల చేరికతో ఇది 2,500లకు చేరుతుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 700 మంది ఉద్యోగులున్నారని, ఇటీవలే జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి 100 మందిని తీసుకున్నామని, కార్యకలాపాలు విస్తరిస్తున్న దృష్ట్యా వచ్చే 6 నెలల్లో మరో 300 మందిని నియమించుకుంటామని వివరించారాయన. 
ప్రయాణికులు 6 శాతమే...
కడప, బళ్ళారి (విజయనగర్‌) సహా వేరెవ్వరూ నడపని పలు ప్రాంతాలకు తాము విమానాలు నడుపుతున్నామని, దీనివల్ల పలు గ్రామీణ ప్రాంతాలను విమానరంగ కనెక్టివిటీకి చేరువ చేశామని సంస్థ సీఈఓ, రిటైర్డ్‌ కల్నల్‌ ఎల్‌.ఎస్‌.ఎన్‌.మూర్తి చెప్పారు. ‘‘దేశంలో విమాన ప్రయాణం చేసేవారి సంఖ్య 6 శాతమే. అదే చైనాలో తీసుకుంటే 22 శాతం. ఈ సంఖ్య పెరగటం వల్ల ఎయిర్‌వేస్‌ సంస్థలే కాదు. విమానాశ్రయలు నిర్వహించే కంపెనీలు, ప్రయాణికులు... ఇలా ఈ రంగంతో సంబంధం ఉన్నవారంతా లబ్ధి పొందుతారు. ఈ సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. You may be interested

ఇదిగో... మీ భూమి చరిత్ర!!

Saturday 13th July 2019

 ప్రాపర్టీ వివరాలన్నీ క్షణాల్లో ప్రత్యక్షం  విలువ, రుణాలు, అనుమతులు కూడా... ‘మైఓఎస్‌ ప్రాపర్టీ.కామ్‌’ ఘనత హైదరాబాద్‌ సహా 12 నగరాల్లో సేవలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రాపర్టీ కొనాలన్నా, విక్రయించాలన్నా అంత తేలికేమీ కాదు. సవాలక్ష సందేహాలుంటాయి. మెట్రో నగరాల్లో అయితే మరీ ఎక్కువ!!. ఎంపిక చేసిన ప్రాపర్టీకి ఎలాంటి లీగల్‌ చిక్కులున్నాయో? వాస్తవానికి ఆయా ప్రాంతంలో ధర ఎంత ఉందో? ఒకవేళ కొన్నాక నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయో రావో..? బ్యాంక్‌ గృహ

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

Saturday 13th July 2019

ఆగస్ట్‌ 6 నుంచి అంతర్జాతీయ సేవలు ఢిల్లీ నుంచి సింగపూర్‌కు నిత్యం సర్వీసులు 7న ముంబై నుంచి సింగపూర్‌కు న్యూఢిల్లీ: టాటా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంయుక్త భాగస్వామ్య సంస్థ విస్తారా... ఇక నుంచి అంతర్జాతీయ సర్వీసులను కూడా నడపనుంది. వచ్చే నెల (ఆగస్ట్‌) 6 నుంచి ప్రప్రథమంగా సింగపూర్‌కు ఢిల్లీ నుంచి రోజువారీ విమాన సర్వీసులను ఆరంభిస్తోంది. ఆ మరుసటి రోజే ఆగస్ట్‌ 7న ముంబై నుంచి కూడా సింగపూర్‌కు డైలీ సర్వీసులను ప్రారంభించనుంది.

Most from this category