News


ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు!!

Friday 17th May 2019
news_main1558075207.png-25789

  • వ్యాపార వ్యూహాలపై భేదాభిప్రాయాలు
  •  లీగల్‌ సంస్థల సహాయంతో పరిష్కార యత్నాలు
  • షేరు కుదేలు.. 9 శాతం డౌన్‌
  • రూ. 5 వేల కోట్లు తగ్గిన మార్కెట్‌ క్యాప్‌

న్యూఢిల్లీ: ఒకదాని వెంట ఒకటిగా దేశీ విమానయాన సంస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. రుణ సంక్షోభంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిల్చిపోగా.. తాజాగా చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయన్న వార్తలు తెరపైకి వచ్చాయి. పనితీరు, వ్యాపార విస్తరణ వ్యూహాలపై వ్యవస్థాపకులు రాకేష్‌ గంగ్వాల్, రాహుల్‌ భాటియా మధ్య భేదాభిప్రాయాలు పొడచూపినట్లు సమాచారం. అయితే, గత కొద్ది వారాల్లో తీవ్రత మరింత పెరిగినప్పటికీ, పరిస్థితి లీగల్‌ కేసుల స్థాయిలో మాత్రం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. విభేదాల పరిష్కారం కోసం ఇరు వర్గాలు న్యాయ సలహా సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు వివరించాయి. లీగల్‌ సేవలందించే సంస్థలు ఖైతాన్‌ అండ్‌ కో, జే సాగర్‌ అండ్‌ అసోసియేట్స్‌ ఇందులో తోడ్పడుతున్నాయి. ఇద్దరూ కూడా ఈ సంస్థలకు పాత క్లయింట్లే కావడంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు రెండు సంస్థలూ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇండిగో కార్యకలాపాల విస్తరణ వ్యవహారం గందరగోళంగా మారే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌ నిల్చిపోవడంతో చార్జీల ధరలకు రెక్కలు రాగా.. తాజాగా ఇండిగో వివాదం ముదిరితే దేశీ విమానయాన రంగంపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
దూకుడుగా గంగ్వాల్‌... ఆతి తూచి భాటియా
2006లో భాటియా, గంగ్వాల్‌ కలిసి ఇండిగోను ఏర్పాటు చేశారు. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ పేరుతో దీని మాతృసంస్థ 2013లో స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్టయ్యింది. దేశీ ఏవియేషన్‌ మార్కెట్లో దీనికి 44 శాతం వాటా ఉంది. వ్యవస్థాపకుల్లో ఒకరైన గంగ్వాల్ విషయానికొస్తే.. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్, యూఎస్‌ ఎయిర్‌వేస్‌లో ఆయనకు సుదీర్ఘానుభవం ఉంది. దూకుడు వ్యూహాలతో ఇండిగోను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సంస్థగా నిలపడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. మేనేజ్‌మెంట్‌లోనూ మార్పులు, చేర్పులతో కంపెనీని ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విస్తరణ ప్రణాళికల విషయంలో వేగంగా దూసుకుపోవాలన్నది గంగ్వాల్‌ అభిప్రాయం కాగా.. ఆచి తూచి అడుగేయాలని భాటియా భావిస్తారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే గడిచిన రెండేళ్లుగా పలు సందర్భాల్లో ఇరువురి మధ్య విభేదాలు బైటపడ్డాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం కంపెనీలో భాటియాకు 38 శాతం, గంగ్వాల్‌కు 37 శాతం వాటాలు ఉన్నాయి. 
వృద్ధి ప్రణాళికలు యథాతథం.. సీఈవో
ప్రమోటర్ల మధ్య విభేదాల వార్తల నేపథ్యంలో ఉద్యోగులకు భరోసానిచ్చే క్రమంలో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ సీఈవో రొణొజొయ్‌ దత్తా తమ సిబ్బందికి ఈమెయిల్‌ పంపారు. కంపెనీ వృద్ధి వ్యూహాలు యథాతథంగానే ఉన్నాయని, వీటి అమలుకు బోర్డ్‌ అఫ్‌ డైరెక్టర్స్‌ నుంచి మేనేజ్‌మెంట్‌కు పూర్తి మద్దతుందని ఆయన పేర్కొన్నారు. ‘మన ప్రమోటర్లు రాహుల్‌ భాటియా, రాకేష్‌ గంగ్వాల్‌ మధ్య విభేదాలు తలెత్తాయన్న ఆరోపణల వార్తల గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే, సంస్థ వృద్ధి వ్యూహాల్లో ఎటువంటి మార్పు లేదని మీకు భరోసా ఇవ్వదల్చుకున్నాను. ప్రణాళికలను అమలు చేయడానికి మేనేజ్‌మెంట్‌కు బోర్డు నుంచి పూర్తి మద్దతు కూడా ఉంది‘ అని ఈమెయిల్‌లో దత్తా పేర్కొన్నారు. వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగులతో పాటు సంస్థతో అనుబంధం ఉన్న వారందరికీ ప్రయోజనం చేకూర్చడంపైనే ఇకపైనా దృష్టి పెడతామని ఆయన తెలిపారు.You may be interested

లీజుకు హ్యుందాయ్‌ వాహనాలు

Friday 17th May 2019

లీజింగ్‌ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంస్థ  ఏఎల్‌డీ ఆటోమోటివ్‌ ఇండియాతో జట్టు హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో సేవలు న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) తాజాగా వాహనాల లీజింగ్ సర్వీసుల్లోకి ప్రవేశించింది. ఇందుకోసం ఏఎల్‌డీ ఆటోమోటివ్ ఇండియాతో జట్టు కట్టింది. హ్యుందాయ్ లీజింగ్‌ పేరిట ప్రారంభించిన ఈ సర్వీసు కింద తమ పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని రకాల వాహనాలు లీజింగ్‌కి లభిస్తాయని సంస్థ తెలియజేసింది. ముందస్తు చెల్లింపులు, మెయింటెనెన్స్ వ్యయాల్లాంటి

ఎన్నికల తర్వాత ఏవి బెటర్‌?

Friday 17th May 2019

ఈ నెల 23న ఎన్నికల ఫలితాల అనంతరం మార్కెట్‌కు ఒక దిశా నిర్ధేశం రానుంది. ఫలితాల వేళ ఒడిదుడకులున్నా తర్వాత కాలంలో తిరిగి దేశీయ సూచీలు అప్‌మూవ్‌నే చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఫలితాల అనంతరం ఎలాంటి స్టాకులను ఎంచుకోవాలి? మిడ్‌క్యాప్స్‌ బెటరా? స్మాల్‌క్యాప్స్‌ బెటరా? అనే విషయమై రిటైల్‌ ఇన్వెస్టర్స్‌ డైలమాలో ఉన్నారు. గతేడాది గాయాల అనంతరం ఇప్పుడిప్పుడే చిన్న, మధ్యతరహా స్టాకులు

Most from this category