News


ఇక చౌక కాల్స్‌, డేటాకు చెల్లు!!

Wednesday 18th December 2019
news_main1576640378.png-30278

  • కనీస చార్జీల విధింపుపై ట్రాయ్ చర్చాపత్రం
  • అనుసరించాల్సిన విధానంపై అభిప్రాయ సేకరణ
  • అభిప్రాయాలు తెలిపేందుకు జనవరి 17 దాకా గడువు

న్యూఢిల్లీ: చౌక మొబైల్ కాల్స్‌, డేటా విధానానికి స్వస్తి పలుకుతూ .. కనీస చార్జీలు వడ్డించే ప్రతిపాదనలపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి సారించింది. దీనిపై తాజాగా చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఇటు టెల్కోలు, అటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టారిఫ్‌ల విషయంలో నియంత్రణ సంస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరంపైనా, మొబైల్ సర్వీసులకు కనీస చార్జీలను నిర్ణయించడంపైనా సంబంధిత వర్గాల అభిప్రాయాలు కోరింది. ఒకవేళ కనీస చార్జీలు నిర్ణయించాల్సి వస్తే కొత్త ఆపరేటర్లకు అకస్మాత్తుగా లాభాలు వచ్చి పడకుండా అనుసరించతగిన విధానాలపైనా అభిప్రాయాలు ఆహ్వానించింది. ఇందుకు వచ్చే ఏడాది జనవరి 17 దాకా గడువు ఉంటుంది. వీటిపై కౌంటర్‌-కామెంట్స్ సమర్పించడానికి జనవరి 31 ఆఖరు తేది. "టెలికం రంగంలో శరవేగంగా మారే టెక్నాలజీలను అందుకోవాలంటే భారీ పెట్టుబడులు కావాలి. ఎకానమీలో వివిధ రంగాలకు కీలకంగా మారిన టెలికం రంగం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. టెలికం రంగ సమస్యలు పరిష్కరించేందుకు, పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత వర్గాలంతా చర్చించాల్సిన అవసరం ఉంది" అని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. 

యూ టర్న్...
టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో తాజా ట్రాయ్ చర్చాపత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం.. టారిఫ్‌ల విషయంలో టెల్కోలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. టారిఫ్ ప్లాన్లను ప్రకటించిన వారం రోజుల్లోగా ట్రాయ్‌కు తెలిపితే సరిపోతుంది. కాబట్టి యూజర్లను ఆకర్షించేందుకు టెల్కోలు పోటాపోటీగా ఉచిత, అత్యంత చౌక ప్లాన్స్ కూడా అందిస్తూ వచ్చాయి.  ఒకవేళ కనీస చార్జీల విధానం గానీ అమల్లోకి వస్తే.. ఉచిత సర్వీసులకు ఇక కాలం చెల్లినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు పరిశీలించతగిన చర్యలంటూ అక్టోబర్‌లో చేసిన సిఫార్సుల్లో ఈ కనీస చార్జీల ప్రతిపాదన కూడా ఉంది. అటు పాత టెల్కోలు కూడా దీన్ని గట్టిగా కోరుతున్నాయి. రిలయన్స్ జియో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రెండేళ్ల క్రితం టెల్కోలు ఇలాంటి ప్రతిపాదనే చేసినప్పటికీ.. ఇది సాధ్యపడే విషయం కాదని ట్రాయ్ తోసిపుచ్చింది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో దీన్ని పరిశీలించాలని భావిస్తోంది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల విషయంలో ఇటీవల సుప్రీం కోర్టులో ప్రతికూల ఆదేశాలు రావడంతో టెలికం సంస్థలు దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు కేటాయింపులు జరపాల్సి రావడంతో సెప్టెంబర్ క్వార్టర్‌లో వొడాఫోన్ ఐడియా రికార్డు స్థాయిలో రూ. 50,922 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. అటు ఎయిర్‌టెల్ కూడా రూ. 23,045 కోట్లు నష్టాలు ప్రకటించింది. You may be interested

ఆర్థిక సేవల్లోకి రియల్‌మీ

Wednesday 18th December 2019

పైసా యాప్‌ ఆవిష్కరణ రూ. 1 లక్ష దాకా వ్యక్తిగత రుణాలు, ఉచిత క్రెడిట్ రిపోర్ట్‌లు తదితర సర్వీసులు న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ రియల్‌మీ తాజాగా ఆర్థిక సేవల విభాగంలోకి ప్రవేశించింది. రుణాలు, మ్యూచువల్ ఫండ్స్‌, క్రెడిట్ స్కోర్ రిపోర్టులు అందించేందుకు 'రియల్‌మీ పైసా' పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫాం ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్స్‌ విభాగంలో ప్రత్యర్థి సంస్థ షావోమీ ఇటీవలే 'మి క్రెడిట్' పేరుతో ఇలాంటి ఫైనాన్షియల్ సర్వీసులే ప్రారంభించిన నేపథ్యంలో ఈ పరిణామం

ఈ షేర్లపై మ్యూచువల్‌ ఫండ్స్‌ మక్కువ

Wednesday 18th December 2019

ప్రస్తుత ఏడాది నవంబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు రూ.27 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. క్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి రూ.23.59 లక్షల కోట్లుగానే ఉన్నాయి. అంటే ఏడాదిలో 17 శాతం మేర ఫండ్స్‌ ఆస్తులు వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు (దేశంలో 42 సంస్థలు ఉ‍న్నాయి) నవంబర్‌లో కొనుగోలు చేసిన టాప్‌ స్టాక్స్‌, అలాగే, అధికంగా విక్రయించిన షేర్ల వివరాలను ఐసీఐసీఐ

Most from this category