News


ఫోన్ టారిఫ్‌లలో మరింత పారదర్శకత

Thursday 28th November 2019
Markets_main1574911497.png-29909

  • యూజర్ల వినియోగానికి తగ్గ ప్లాన్ సూచించేలా టారిఫ్ కాల్‌క్యులేటర్‌
  • కొత్త, పాత ప్లాన్ల వివరాలన్నీ టెల్కోలు అందుబాటులో ఉంచాలి
  • ట్రాయ్ ప్రతిపాదనలు.. అభిప్రాయ సేకరణ

న్యూఢిల్లీ: ఫోన్‌ సర్వీస్‌ రేట్ల విషయంలో మరింత పారదర్శకత తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు అనువైన ప్లాన్‌ సూచించేలా టారిఫ్ కాల్‌క్యులేటర్‌ ప్రవేశపెట్టడం తదితర ప్రతిపాదనలు చేసింది. టెలికం ఆపరేటర్లు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టినప్పుడు.. పాత పథకాల వివరాలు కూడా అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించింది. దీనివల్ల రెండింటిని పోల్చి చూసుకుని తగిన ప్లాన్‌ ఎంపిక చేసుకోవడం సులువవుతుంది. ప్రస్తుతం టెల్కోలు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టాక.. పాత ప్లాన్ల వివరాలను తొలగించేస్తున్నాయి. ఫలితంగా సరైన సమాచారం లేకపోవడం లేదా వివరాలు తప్పుదోవ పట్టించేవిగా ఉండటం లేదా అస్పష్టంగా ఉండటం వంటి వివిధ కారణాలతో యూజర్లు గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నారని ట్రాయ్ అభిప్రాయపడింది. 
    ఇక యూజరు తను ఎంత డేటా, ఎన్ని నిమిషాల అవుట్‌గోయింగ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు, ఎన్నాళ్ల వేలిడిటీ కోరుకుంటున్నారు తదితర వివరాలిస్తే.. వారికి అత్యంత అనువైన ప్లాన్స్‌ను సూచించేలా టారిఫ్ కాల్‌క్యులేటర్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని ట్రాయ్‌ పేర్కొంది. మరోవైపు, ఫెయిర్‌ యూసేజీ పాలసీ (ఎఫ్‌యూపీ), ఫస్ట్ రీచార్జ్ కండీషన్ (ఎఫ్‌ఆర్‌సీ) వంటి విధానాలు అమలు చేసేటప్పుడు షరతులు, నిబంధనలను సవివరంగా తెలపకపోవడం లేదా తెలిపినా స్పష్టత లేకపోవడం వంటి అంశాల వల్ల యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని ట్రాయ్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సర్వీసులు మెరుగుపర్చడానికి టెల్కోలు ఇంకా ఏం చర్యలు తీసుకోవచ్చన్న దానిపై అభిప్రాయాలు తెలపాలంటూ టెలికం యూజర్లకు ట్రాయ్ సూచించింది. అభిప్రాయాలు పంపేందుకు తుది గడువు డిసెంబర్ 26 కాగా.. పరిశ్రమ వర్గాలు కౌంటర్ కామెంట్స్ సమర్పించేందుకు జనవరి 9 ఆఖరు తేదీగా ట్రాయ్ నిర్ణయించింది.

టారిఫ్‌లకు ట్రాయ్ దూరం..
చార్జీలు పెంచాలని టెల్కోలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం టారిఫ్‌ల విషయంలో జోక్యం చేసుకోరాదని ట్రాయ్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెలికం సంస్థలు ఎంత మేర చార్జీలు పెంచుతాయన్నది వేచి చూడాలని యోచిస్తున్నట్లు వివరించాయి. తీవ్ర పోటీతో ప్రత్యర్థి సంస్థలు కారుచౌక స్థాయికి చార్జీలు తగ్గించేసి, ఇతర సంస్థలను దెబ్బతీసేలా వ్యవహరించకుండా ట్రాయ్ కనీస చార్జీల్లాంటి నిబంధనలు ప్రవేశపెట్టాలని పాతతరం టెల్కోలు కోరుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

టెల్కోల చీఫ్‌లతో ట్రాయ్ చైర్మన్ భేటీ..
వచ్చే ఏడాది (2020) టెలికం రంగానికి సంబంధించిన అజెండా రూపకల్పనలో భాగంగా వొడాఫోన్‌-ఐడియా సీఈవో రవీందర్ టక్కర్ సహా వివిధ టెల్కోల చీఫ్‌లతో ట్రాయ్‌ చైర్మన్ ఆర్‌ఎస్‌ శర్మ సమావేశమయ్యారు. 2020లో ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. సమావేశానికి ముందే పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేశాయని, ట్రాయ్ కూడా కొన్ని అంశాలు గుర్తించిందని శర్మ వివరించారు. తాజా భేటీలో వీటన్నింటిపైనా చర్చించినట్లు ఆయన వివరించారు. 2020 అజెండాలో పొందుపర్చేందుకు 6-7 అంశాలను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల రూపంలో భారీ బకాయీల కట్టాల్సి రానున్న టెలికం సంస్థలు.. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) ఫార్ములాను గతం నుంచి కాకుండా ఇకపైనే అమలు చేసేలా ట్రాయ్ ఒక చర్చాపత్రాన్ని రూపొందించాలని అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 



You may be interested

వాహనదారులకు యాక్సిస్‌ బ్యాంక్‌ ఆఫర్‌

Thursday 28th November 2019

ఉచితంగా ట్యాగ్స్‌ పంపిణి ముంబై: జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే డిసెంబరు ఒకటి నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్‌ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని నెలలపాటు ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తామని ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ యాక్సిస్‌ బ్యాంక్‌ బుధవారం ప్రకటించింది. ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించడంలో భాగంగా టోల్‌ప్లాజాలు, పార్కింగ్‌ ప్రాంతాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ఫాస్టాగ్‌ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుండగా.. ఈ టెక్నాలజీకి

ప్రైవేటీకరణ కాకపోతే ఎయిర్‌ఇండియాను మూసేయడమే

Thursday 28th November 2019

పౌరవిమానయాన మంత్రి హర్‌దీప్‌సింగ్‌పురి న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించకపోతే, మూసేయాల్సి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హరదీప్‌సింగ్‌ పురి బుధవారం రాజ్యసభకు తెలిపారు. సంస్థ ఉద్యోగులు అందరికీ సానుకూల ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎయిర్‌ ఇండియా తన ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని, ప్రైవేటీకరించేంత వరకు ఏ ఒక్కరినీ ఉద్యోగాల నుంచి తీసివేయడం జరగదని వివరించారు. ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అంతర్జాతీయంగా విమానాల రద్దీ తగ్గుముఖం పట్టినా,

Most from this category