News


బాకీ మొత్తం కట్టాల్సిందే..

Thursday 19th March 2020
news_main1584588232.png-32570

- స్వీయ మదింపులు కుదరవు
- తప్పుడు వార్తలకు టెల్కోల ఎండీలదే బాధ్యత
- కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటాం
- ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు స్పష్టీకరణ
- టెల్కోలు, కేంద్రానికి అక్షింతలు

న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బాకీల విషయంలో కేంద్రం, టెల్కోలకు సుప్రీం కోర్టు తలంటింది. ఈ అంశాన్ని టెల్కోలు సాగదీస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది అక్టోబర్‌ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. నిర్దేశిత  బాకీలు మొత్తం కట్టి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. స్వీయ మదింపులు, బకాయిల పునఃసమీక్ష లాంటివి కుదరదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. బాకీల చెల్లింపునకు టెలికం సంస్థలకు 20 ఏళ్ల వ్యవధినివ్వాలంటూ కేంద్రం వేసిన పిటీషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌, జస్టిస్ ఎంఆర్‌ షా తో కూడిన బెంచ్ బుధవారం తిరస్కరించింది. రెండు వారాల తర్వాత దీన్ని పరిశీలిస్తామని పేర్కొంది. "20 ఏళ్ల వ్యవధి ఇవ్వడమనేది అసమంజసం. తీర్పులో పేర్కొన్నట్లుగా టెలికం కంపెనీలు బాకీలన్నీ తీర్చాల్సిందే" అని స్పష్టం చేసింది. వడ్డీలు, జరిమానాలపై టెలికం కంపెనీలు, ప్రభుత్వం వాదోపవాదాలన్నీ విన్న మీదటే ఏజీఆర్ బాకీలపై తీర్పునిచ్చామని, అన్ని పక్షాలు దానికి కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది. 

ఆ అధికారులను పిలిపిస్తాం..
ఏజీఆర్‌ బాకీలపై టెలికం కంపెనీలు స్వీయ మదింపు చేపట్టడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన తర్వాత కూడా ఇలాంటి వాటికి ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాంటివి కలలో కూడా ఊహించలేనివంటూ వ్యాఖ్యానించింది. స్వీయ మదింపు ప్రక్రియ చేపట్టేందుకు టెల్కోలను అనుమతించిన టెలికం శాఖ కార్యదర్శి, డెస్క్ ఆఫీసర్‌లను పిలిపిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. స్వీయ మదింపు పేరుతో టెలికం కంపెనీలు తీవ్రమైన మోసానికి పాల్పడుతున్నాయని ఆక్షేపించింది. "ఒకవేళ టెల్కోల స్వీయ మదింపునకు అనుమతిస్తే.. ఆ మోసంలో మేము కూడా పాలు పంచుకున్నట్లే అవుతుంది" అని పేర్కొంది. స్వీయ మదింపు పేరుతో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తూ, సుప్రీం కోర్టు అధికారాలను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. ఏజీఆర్ బాకీల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పే అంతిమమని, దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. 

టెల్కోల చీఫ్‌లకు హెచ్చరిక..
టెల్కోలు తమకు అనుకూలంగా వార్తాపత్రికల్లో కథనాలు రాయించుకుంటున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇలాంటి కథనాలు తమ తీర్పును ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది. ఏజీఆర్ బాకీలపై సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా 'తప్పుడు వార్తలు' గానీ ప్రచురించిన పక్షంలో టెలికం కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. "ఇక నుంచీ టెలికం కేసులో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాచిపెట్టేలా కథనాలేమైనా ప్రచురించిన పక్షంలో టెల్కోల ఎండీలే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది" అని స్పష్టం చేసింది. 

వివాదం ఇదీ..
లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల లెక్కింపునకు సంబంధించి టెల్కోల టెలికంయేతర ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న డాట్ వాదనలను సమర్థిస్తూ సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్ 24న తీర్పునిచ్చింది. 
దీనికి అనుగుణంగా సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) లెక్కల ప్రకారం టెల్కోలు వడ్డీ, జరిమానా కలిపి కట్టాల్సిన బాకీలు .. దాదాపు రూ. 1.69 లక్షల కోట్లు ఉంటాయని డాట్ లెక్క వేసింది. దీన్ని నిర్దిష్ట గడువులోగా చెల్లించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే, నిర్దేశిత గడువులోగా చెల్లింపులు జరపకుండా టెల్కోలు పునఃసమీక్ష కోరాయి. టెలికం రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి ఇంత మొత్తం కట్టలేమని, మరింత కాలం గడువివ్వాలంటూ మొరపెట్టుకున్నాయి. కానీ, అదంతా కుదరదంటూ సుప్రీం కోర్టు సీరియస్ కావడంతో .. చివరికి కొంత కట్టాయి. ఈలోగా డాట్‌ లెక్కలు కాకుండా తాము సొంతంగా బాకీలను మదింపు చేసిన ప్రకారం చెల్లించాల్సినది కొంతేనని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

స్వీయ మదింపుతో భారీ వ్యత్యాసం..
ఏజీఆర్‌ బాకీలకు సంబంధించి డాట్‌ చెబుతున్న దానికి, భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా, టాటా గ్రూప్‌ స్వీయ మదింపునకు మధ్య ఏకంగా రూ. 82,300 కోట్ల మేర వ్యత్యాసం ఉంది. డాట్ లెక్కల ప్రకారం ఈ మూడు సంస్థలు రూ. 1.19 లక్షల కోట్లు కట్టాలి. భారతి ఎయిర్‌టెల్‌, టెలినార్‌వి కలిపి రూ. 43,980 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 58,254 కోట్లు, టాటా గ్రూప్ సంస్థలు రూ. 16,798 కోట్లు చెల్లించాలి. అయితే, ఆయా టెల్కోలు జరిపిన స్వీయ మదింపు లెక్కల ప్రకారం.. భారతి గ్రూప్‌ రూ. 13,004 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 21,533 కోట్లు, టాటా గ్రూప్ సంస్థలు రూ. 2,197 కోట్లు మాత్రమే కట్టాల్సి ఉండనుంది.You may be interested

ప్రపంచ మార్కెట్లు లబోదిబో

Thursday 19th March 2020

డోజోన్స్‌ 6%, ఎస్‌అండ్‌పీ 5% పతనం 20,000 పాయింట్ల దిగువకు డోజోన్స్‌ నెల రోజుల్లో 29 శాతం జారిన ఎస్‌అండ్‌పీ కుప్పకూలిన ఎయిర్‌లైన్స్‌, హోటల్‌ స్టాక్స్‌ యూరోపియన్‌ ఇండెక్సులు 5.5% డౌన్‌ ఆసియా మార్కెట్లు 8-2.5% మధ్య వీక్‌ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. వెరసి అమ్మకాలు వెల్లువెత్తి అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నాయి. బుధవారం అమెరికా స్టాక్‌ ఇండెక్సులు 6-5 శాతం మధ్య పతనంకాగా.. యూరోపియన్‌ మార్కెట్లలో ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే 6-4 శాతం మధ్య

మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్‌ టీ-రాక్‌

Thursday 19th March 2020

- ప్రారంభ ధర రూ. 19.99 లక్షలు  న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్‌.. ‘టీ-రాక్‌’ పేరిట తన సరికొత్త స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ)ను బుధవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చిన ఈ కారు ధర రూ. 19.99 లక్షలుగా ప్రకటించింది. ఈ అధునాతన ఎస్‌యూవీ 8.4 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టాప్‌

Most from this category